Suryaa.co.in

Andhra Pradesh

జూన్ 10వ తేదీకి హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడమే లక్ష్యం

– : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులకు 3,800 కోట్ల రూపాయల కేటాయింపులు
– : ఒక పోలవరం మినహా తెలంగాణ, దక్షిణాది భారతదేశంలో ఏ ఒక్క సింగల్ ప్రాజెక్టుకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదు
– ముఖ్యమంత్రి ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్
– రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
– ఉరవకొండ వద్ద నుంచి రాగులపాడు వరకు హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులను పరిశీలించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం : హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 10వ తేదీకి డెడ్ లైన్ విధించారని, అప్పటిలోపు హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

సోమవారం ఉరవకొండ – అనంతపురం మెయిన్ రోడ్డులో ఉరవకొండ పట్టణం వద్దనున్న హంద్రీనీవా కాలువ నుండి రాగులపాడు రోడ్డు వరకు 35వ ప్యాకేజీ కింద హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివ పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఉరవకొండ వద్ద నుంచి రాగులపాడు వరకు హంద్రీనీవా ప్రధాన కాలువపై అధికారులతో కలిసి మంత్రి పర్యటించి పనులను సమగ్రంగా పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆరోజున శరవేగంగా 40 శాతం పనులను పూర్తిచేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం ఒక గంప మన్ను కూడా కాలువ మీద తీసేయలేదన్నారు.

తాము మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాపై ఉన్న ప్రత్యేక ప్రేమ, అభిమానంతో బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరుగుతున్నప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సీఎం మాకు ప్రోత్సాహం ఇచ్చారన్నారు. ఒక ప్రాజెక్టు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు 3,800 కోట్ల రూపాయల కేటాయింపులు ఎప్పుడూ జరపలేదన్నారు. ఒక పోలవరం మినహా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు ఒక బడ్జెట్లో జరిపినటువంటిది ఎక్కడా కూడా లేదన్నారు.

తెలంగాణ, దక్షిణాది భారతదేశంలో ఏ ఒక్క సింగల్ ప్రాజెక్టుకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదన్నారు. కేవలం కేటాయింపులు జరిపి ప్రచారం చేసుకునే ఆలోచన తమకు లేదని, పనులను కూడా వెంటనే ప్రారంభించామన్నారు. ఈ ఏడాది మార్చి 15 – 20వతేదీ మధ్య బడ్జెట్ అప్రూవల్ పూర్తి చేసుకుంటే, అప్పటికే సన్నద్ధత పనులు పూర్తి చేసుకుని 20 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. పెద్ద ఎత్తున పనులు ప్రారంభమయ్యాయని, అనంతపురం జిల్లాలో 82 కిలోమీటర్ల మేర ఉన్న హంద్రీనీవా కాలువలో 12 కిలోమీటర్ల కాలువ వెడల్పు పనులు ఇప్పటికే పూర్తిస్థాయిలో చేసేయడం జరిగిందన్నారు.

10 నుంచి 15 శాతం పని ఇప్పటికే పూర్తయిందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 10వ తేదీకి డెడ్ లైన్ విధించారన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ సిఈ, ఎస్ఈ, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇదే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్ అన్నారు. 20 ఏళ్లుపాటు కాలువలో ఎంత మట్టి ఎత్తివేశామో.. దాంట్లో 60 – 70 శాతం మట్టిని ఇప్పుడు తీయాల్సి వస్తుందన్నారు.

ఉరవకొండ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిపించిన ప్రజలకు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. జిల్లా ప్రజల రుణం తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరపడం, దానికి ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకారం అందించి పనులు కూడా పూర్తి చేయాలని ప్రోత్సహించడం, జిల్లా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇది చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విషయమని, ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతుంటే ప్రతిపక్షం నాయకులు ఎక్కడా కాలువ మీద రాలేదని, నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వలేదన్నారు.

కాలువ వెడల్పుతో పాటు భగవంతుడు సహకరిస్తే ఇంకా వెడల్పు చేయవచ్చని, 3,800 క్యూసెక్కుల నీరు కాలువలో ఎలా తీసుకెళ్లాలో మొదటి దశలో తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ముఖ్యమంత్రి గతంలో ఉరవకొండకి వచ్చి జలదీక్ష చేసి మూడు నెలల్లో హంద్రీ పనులు ప్రారంభిస్తాం అన్నారని, ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లు మర్చిపోయారన్నారు. భైరవాణి తిప్ప ప్రాజెక్ట్, అప్పర్ పేరూరు ప్రాజెక్ట్, లాంటి వాటికి నీరు రావాలని, వేడల్పు చేసుకుంటూ వెళ్తేనే నీరు వస్తాయన్నారు.

 

LEAVE A RESPONSE