Suryaa.co.in

Telangana

ప్రభుత్వం ధాన్యం కొనడం రైతుల విజయం

– ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర
– ప్రభుత్వ ఆంక్షలతో వరి సాగు చేయని రైతులకు పరిహారం ఇవ్వాలి
– తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదు
-కరెంటు చార్జీల భారంతో ప్రజలు విలవిల
– పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
– భట్టి పాదయాత్రకు పలువురు నాయకులు సంఘీభావం
– 19వ రోజు పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం

వరి వేస్తే ఉరి అని ప్రకటించిన పాలకుల పైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పెంచిన వత్తిడితో వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని రైతుల విజయంగా భావిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం 19 రోజున జానకిపురం నుంచి నారాయణపురం, చిన్న బీరవల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాల్లో (సుమారుగా 12 కిలోమీటర్లు) పాదయాత్ర కొనసాగింది.

రాత్రి కలకోట గ్రామంలో బస చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వరి వేస్తే ఉరి అని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో రాష్ట్రంలో 15లక్షల ఎకరాలకు పైగా వరి వేయకుండా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, వీరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అస్పష్ట విధానాలు రైతులకు శాపంగా మారాయని విమర్శించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వారి కొనుగోలు చేసినట్లు గానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా అంతర్భాగమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు.

కరెంటు చార్జీల భారంతో ప్రజలు విలవిల
నిత్యావసర ధరలు పెంచి బిజెపి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ పేరిట కరెంటు చార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపడాన్నీ తీవ్రంగా ఖండించారు. నెలకు 450 రూపాయలు రావాల్సిన కరెంట్ బిల్లు ఈ నెల 12వేలు వస్తే ఎలా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఇదేవిధంగా పేదల పైన కరెంటు చార్జీల భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలను, డెవలప్మెంట్ పేరిట వేస్తున్న అదనపు చార్జీల బాదుడుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

భట్టి పాదయాత్రకు సంఘీభావం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు బుధవారం వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ కార్యదర్శి మేడ సురేష్ లు బోనకల్లు మండలం చిన్న బీరవల్లి గ్రామంలో స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి వరకు సీఎల్పీ నేత భట్టి అడుగుల్లో అడుగులు వేస్తూ పీపుల్స్ మార్చ్ లో కదం తొక్కారు. నారాయణపురం లో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా కార్యదర్శి సాధినేని హనుమంతరావు, తెలుగు యువత కార్యదర్శి మైనేని రవికుమార్ తదితరులు ఉన్నారు.

పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కు బోనకల్లు మండలం నారాయణపురం, చిన్న బీరవల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాల్లో కాంగ్రెస్, టిడిపి, వామపక్ష శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కదిలివచ్చి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. డప్పుల దరువు, కోలాటం మహిళల నృత్యాలతో పాదయాత్ర హోరేత్తింది. సబ్బండ వర్గాల ప్రజలు కదిలి వచ్చి భట్టి అడుగులో అడుగులు వేస్తూ పీపుల్స్ మార్చ్ లో కదం తొక్కారు. కాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడుగి తెలుసుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలను ఆలకిస్తూ యువత తో కరచాలనం చేస్తూ తన పాదయాత్రను ముందుకు కొనసాగించారు.

LEAVE A RESPONSE