– ఎవనికీ భయపడేది లేదు
– బట్టేబాజ్ మాటలతో జాతిని మోసం చేసేటోన్నికాదు
– న్యాయపరమైన సమస్యలు రాకుండా వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నాం
– వివాదాలు సృష్టించి అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు
– వారిని లీగల్‌గా ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు
– ఇప్పటికే ఆలస్యమైంది.. ఇంకా సాగదీసి ఎస్సీలకు అన్యాయం జరగనివ్వను
– శాస్త్రీయంగా స్టడీ చేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది
– కమిషన్ నివేదిక ప్రకారం ముందుకెళ్తాం
– మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ : దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కల నెరవేరుతున్న సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ని, హైదరాబాద్‌లోని తన నివాసంలో(మినిస్టర్స్ క్వార్టర్స్) మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు, ప్రజలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.మంత్రిని ఘనంగా సన్మానించి, ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడారు.మాదిగల సమిష్టి కృషి, సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, సీఎం రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతోంది.
బట్టేబాజ్ మాటలు మాట్లాడి జాతిని మోసం చేసే వాడిని కాదు నేను. ఎవనికీ భయపడే తత్వం కాదు నాది.వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో 14 ఏండ్లు పెండింగ్‌లో ఉన్నది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తాం అని ఎన్నికలకు ముందే చెప్పాం. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే గారే స్వయంగా చేవెళ్ల డిక్లరేషన్‌లో వర్గీకరణపై ప్రకటన చేశారు.
మీ అందరి ఆశీర్వాదంతో 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ అడ్వకేట్‌ను ప్రభుత్వం తరపున నియమించి, వర్గీకరణకు అనుకూలంగా వాదింపజేశాం. సీఎం సూచనల మేరకు మాదిగ నాయకులు, మేధావుల బృందాన్ని తీసుకుని నేనే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి, విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించాం.
దశాబ్ద కాలానికిపైగా పెండింగ్‌లో ఉన్న కేసులో 6 నెలల్లో తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఆగస్టు ఒకటిన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించాం. తీర్పు వచ్చిన గంటలోపలే వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి తో అసెంబ్లీలో ప్రకటన చేయించాం.
కోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ చేసేందుకు కేబినేట్ సబ్ కమిటీని నియమించి, వర్గీకరణపై చర్చించాం. చట్టపరమైన సమస్యలు రాకుండా, వన్ మెంబర్ కమిషన్ నియమించడం జరిగింది. రిటైర్డ్ జస్టీస్ చైర్మన్‌గా ఉన్న వన్ మ్యాన్ కమిషన్ ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించి, అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ పరమైన అంశాలపై స్టడీ చేసింది.
సుప్రీంకోర్టు చెప్పిన విధంగా Empirical dataను సేకరించింది. అలాగే, అన్ని వర్గాల నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతి ద్వారా నెల రోజులపాటు వినతులు స్వీకరించింది. సుమారు 8 వేలకుపైగా వినతులను పరిశీలించి, క్రోడీకరించి నివేదిక తయారు చేసింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన రోజే కేబినేట్ సబ్ కమిటీ ఆమోదించేలా చర్యలు తీసుకున్నాం.
ఆలస్యం కావొద్దు, ఇంకా అన్యాయం జరగొద్దు అని మరునాడే కేబినేట్‌లో కమిషన్ రిపోర్ట్‌ను ఆమోదింపజేసుకున్నాం. క్రిమిలేయర్ పెట్టాలన్న కమిషన్ రికమండేషన్‌ను రిజెక్ట్ చేశాం.జనాభా, empirical data ఆధారంగా మూడు గ్రూపులుగా మొత్తం 59 కులాలను కమిషన్ వర్గీకరించింది. ఆ రికమండేషన్లకు మరునాడే కేబినేట్ ఆమోదం తీసుకుని, అదేనాడు అసెంబ్లీలో సీఎం గారితో తీర్మానం చేయించుకున్నాం.
ప్రత్యక్షంగా, పరోక్షంగా మాదిగ, మాదిగ ఉపకులాలకు సుమారు 9.8 శాతం రిజర్వేషన్లు సాధించాం. గ్రూప్ వన్‌లో 0.77 శాతం, గ్రూప్ 2లో 9 శాతం మనకే వచ్చింది.ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా అన్యాయం జరగొద్దన్న సదుద్దేశంతో వీలైనంత వేగంగా చర్యలు తీసుకున్నాం.
కోర్టు కేసులు, లీగల్ సమస్యలు రాకుండా జాగ్రత్తగా వర్గీకరణను ముందుకు తీసుకెళ్లాం.వర్గీకరణ జరగడం ఇష్టంలేని వ్యక్తులు, వర్గీకరణ పేరిట మనుగడ సాగించాలనుకునే వ్యక్తులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యక్తిగత విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. వారిలా చిల్లర మాటలు, బట్టేబాజ్ మాటలు మాట్లాడి జాతిని మోసం చేసే వ్యక్తిని కాదు నేను.
ఎవనికీ భయపడే తత్వం కాదు.. వర్గీకరణ చేసి తీరుతాం.అన్నదమ్ముల్లా ఉండాల్సిన మాల, మాదిగల నడుమ వివాదాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించి వర్గీకరణను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారు. వాళ్లను లీగల్‌గా ఎలా ఎదుర్కోవాలో, దశాబ్దాల వర్గీకరణ ఆకాంక్షను ఎలా నెరవేర్చాలో మాకు తెలుసు. సమాజంలో అందరికీ సమాన హక్కులు, సమన్యాయం దక్కాలన్నదే కాంగ్రెస్ పార్టీ కమిట్‌మెంట్.
ఆ కమిట్‌మెంట్‌తోనే సీఎం రేవంత్ రెడ్డి , ఆయన నాయకత్వంలోని మా ప్రభుత్వం ముందుకెళ్తున్నది.మాదిగలు ఇంకా డప్పులు కొట్టేకాన్నే ఆగిపోవద్దు. కంప్యూటర్లు పట్టి కోడింగ్ కొట్టాలే. అమెరికా పోవాలె. ఆఫీసర్లు కావాలె. వ్యాపారాలు చేయాలే. ఆత్మగౌరవంతో బతకాలె.