Suryaa.co.in

Telangana

రేవంత్.. తులం బంగారం ఏమాయె?

-హామీలన్నీ అటకెక్కించేశారా?
– సర్కారుపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు

సికింద్రాబాద్: మహిళలకు తులం బంగారం ఇస్తానన రేవంత్ హామీ ఏమయిందని సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు నిలదీశారు. అన్ని హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.

అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మారేడుపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం అడ్డగుట్ట లోని రియో పాయింట్ వద్ద జరిగింది. కార్యక్రమంలో సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.

చెక్కుల పంపిణీ అనంతరం పద్మారావు గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల పిల్లల పెళ్ళిళ్ళ ఖర్చు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే గత కెసిఆర్ ప్రభుత్వo అద్భుతమైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పధకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామనే హామీని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గాద్దేనేక్కిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీ ఏమైందని లబ్దిదారులు తమను ప్రశ్నిస్తున్నారని పద్మారావు గౌడ్ వివరించారు. బీ.సి. జనాభా గుర్తింపునకు తాము అనుకూలమని అయితే ప్రభుత్వ ఈ వ్యవహారాన్ని తప్పుల తడకగా మార్చిందని పద్మారావు గౌడ్ విమర్శించారు. ఓ బీ.సీ. కుల నాయకునిగా తాను బీసీ ల న్యాయపరమైన ప్రయోజనాలను స్వాగతిస్తానాన్ని, ప్రభుత్వం కుల గణన సర్వేను సమర్ధవంతంగా నిర్వహించకుండా అభాసుపాలు చేసిందని ఆరోపించారు.

జంటనగరాల్లో ప్రారంభోత్సవాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగబడుతున్నారని, హైదరాబాద్ జిల్లా పరిధిలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంఎల్ఏ ని కూడా గెలిపించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అడ్డదారిలో వ్యవహరించడం విడ్డురమని అన్నారు. తమ ప్రభుత్వ హయంలో తాము అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాజకీయం చేయలేదన్నారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పొందడంలో ప్రజలు దళారీలను ఆశ్రయించరాదని, సితాఫలమండీ లోని తమ క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, తాసిల్దార్ భూపతి గౌడ్ యువ నేత రామేశ్వర్ గౌడ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారేడుపల్లి మండలానికి సంబంధించిన దాదాపు రూ. 91 లక్షల విలువచేసే సుమారు 91 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పద్మారావు గౌడ్ అందించారు.

LEAVE A RESPONSE