-
బాబును తిట్టిన మంగ్లీని తీసుకువెళతారా?
-
జగన్ భక్తురాలిని గుడికి తీసుకువెళతారా?
-
ఎర్రన్న నూరిపోసిన సిద్ధాంతాలు ఇవేనా?
-
మంగ్లీని అరసవల్లి ఆలయానికి వెంట తీసుకువెళ్లిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
-
గతంలో చంద్రబాబు పేరంటేనే చిరాకని చెప్పిన మంగ్లీ
-
వైసీపీకి ఎన్నికల్లో ఉచితంగానే పాట పాడిన గాయని మంగ్లీ
-
జగన్ జమానాలో ఆమెకు ఎస్వీబీసీ సలహాదారు పదవి ఇచ్చిన వైసీపీ
-
రామ్మోహన్ తీరుపై టీడీపీ సోషల్‌మీడియా సైనికుల కన్నెర్ర
-
చనువు ఇస్తే చంకనెక్కుతున్నారంటూ తమ్ముళ్ల ఫైర్
-
జగన్ జమానాలో తమ్ముళ్లను వేధించిన నాటి కలెక్టర్ శ్రీబాలాజీని ఓఎస్డీగా నియమించుకున్న రామ్మోహన్‌నాయుడు
-
కార్యకర్తల మనోభావాలను నేతలకు పట్టవా అంటూ దునుమాడుతున్న తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనేక కారణాలతో వివిధ స్థాయి నేతలను ప్రోత్సహిస్తున్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఇస్తున్న చనువును.. పదవులు పొందిన వారు దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు. బాబుగారూ.. మీరు ఇస్తున్న అతి చనువును రామూ లాంటివాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. మా ఫీలింగ్స్ పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో పదవులు పొందిన వారిని వెంటేసుకుని, మన పార్టీ మంత్రులు దర్శనాలకు రావడం వల్ల కార్యకర్తలకు ఏం సంకేతం పంపిస్తున్నారు? రాము చే సిన పని పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసింది. మీరిచ్చే ప్రోత్సాహం ఇలా దుర్వినియోగం చేస్తుంటే, అది మిగిలిన వారికి ఆదర్శం కాదా’ అంటూ పసుపు సైనికులు, సోషల్‌మీడియా వేదికగా.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తీరును తూర్పారపడుతున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఎర్రన్న కొడుకన్న సానుభూతితో రామ్మోహన్‌నాయుడుకు ఇచ్చిన చనువును, ఆయన దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలకు తెరలేచింది.
అసలేం జరిగిందంటే… వైసీపీ స్థాపించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో, గాయని మంగ్లీ జగనన్నపై పాట పాడింది. ఆ పాట జనక్షేత్రంలో ఉర్రూతలూగించింది. దానికి ఆమె కళాకారిణిగా డబ్బులేమీ తీసుకోలేదు. కేవలం జగన్‌పై అభిమానంతో ఆ పాట పాడింటదట. సంతోషం. అది వారి వ్యక్తిగతం. అధికారంలోకి వచ్చిన జగన్.. ఆమెను ఎస్వీబీసీ సలహదారు పదవి ఇచ్చి గౌరవించింది.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీ కూడా.. తమ పార్టీ పాటలు పాడమని ఆమెను కోరిన సందర్భంలో.. తన నోట చంద్రబాబునాయుడు పేరు పలికేందుకు ఇష్టం లేదని, నిర్మొహమాటంగా చెప్పిందన్న ప్రచారం జరిగింది.
సీన్ కట్‌చేస్తే.. తాజాగా అరసవల్లి దేవాలయ దర్శనానికి కుటుంబసభ్యులతో వచ్చిన కేంద్రమంత్రి రామ్మోహన్‌రాయుడు.. తనతోపాటు..జగన్ వీరాభిమాని మంగ్లీని కూడా వెంట తీసుకువెళ్లడం విమర్శలకు దారితీసింది. దానిపై టీడీపీ సోషల్‌మీడియా సైనికులు విరుచుకుపడుతున్నారు.
అప్పటికే..గత వైసీపీ హయాంలో ఆ పార్టీతో అంటకాగి, టీడీపీ నేతలను వేధించి, అవమానాలకు గురిచేసిన నాటి కలెక్టర్ లఠ్కర్ శ్రీకేష్ బాలాజీరావును.. తన ఓస్డీగా నియమించుకున్న తీరుపై..తమ్ముళ్లు ఇప్పటికే కారాలుమిరాయాలు నూరుతున్నారు. జగన్ దన్నుతో పార్టీ నేతలను అవమానించిన బాలాజీరావును, తన దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా ఎలా నియమించుకుంటారని, పసుపు సైనికులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.
మళ్లీ ఇప్పుడు జగన్ ప్రత్యేకించి పిలిచి ఎస్వీబీసీ సలహాదారు పదవి ఇచ్చిన మంగ్లీని.. రామ్మోహన్‌నాయుడు ఏవిధంగా తన వెంట దర్శనానికి తీసుకువెళతారు? ఇదేనా మా ఎర్రన్న నేర్పిన సిద్ధాంతం?ఎర్రన్నాయుడు చనిపోయేవరకూ రాజకీయ ప్రత్యర్ధులతో ఎప్పుడూ మాట్లాడలేదే? మంగ్లీని తీసుకువెళ్లిన రాము లక్షలాదిమంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశారు. అందుకాయన క్షమాపణ చెప్పితీరాలి. బాబుగారు ఇలాంటివారిని ఏవేవో కారణాలతో ప్రోత్సహిస్తుంటే, చివరకు వాళ్లంతా అదంతా తమ గొప్పతమని భావించి, పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు. ఇదే పని మరో నాయకుడు చేస్తే నాయకత్వం మౌనంగా ఉంటుందా? రేపు రోజాను మరో నాయకుడు తిరుమల తీసుకువెళ్లి దర్శనం చేయిస్తే కూడా, నాయకత్వం ఇంత ఉదాసీనంగా ఉంటుందా? అంటూ సోషల్ మీడియా వేదికగా, శరపరంపరగా ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.