Suryaa.co.in

Telangana

ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది

– దసరా లోపు పెండింగ్ లో ఉన్న ఆరు డీఏల్లో మూడు డీఏలు విడుదల చేయాలి
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ : ఆరు గ్యారెంటీలతో ప్రజలను, ఆశపెట్టి ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నాయకులు శనివారం సాయంత్రం నిజామాబాద్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడంతో పాటు డీఏలు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, పీఆర్సీ ద్వారా మెరుగైన ఫిట్ మెంట్ ఇస్తామనే హామీలతో పాటు ఉద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేసిందని గుర్తు చేశారు. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా ఐదు డీఏలను పెండింగ్ లో పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందన్నారు.

జులై ఒకటిన చెల్లించాల్సిన మరో డీఏను కలువుకుంటే మొత్తం ఆరు డీఏ లను ఈ ప్రభుత్వం ఉద్యోగుల కు బాకీ పడిందన్నారు. ఇప్పుడు ఒక జీవో ఆరు నెలల తర్వాత ఇంకో జీవో ఇస్తామని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అంటే ఉద్యోగుల ను వంచించడమే అన్నారు.

ఆరు గ్యారెంటీలతో సామాన్య ప్రజలకు దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగులను అలాగే మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ వేయలేదన్నారు. కనీసం మధ్యంతర భృతి ఇచ్చే ప్రయత్నం చేయకపోగా ఉద్యోగులను నిందించేలా ప్రభుత్వం మాట్లాడుతోందన్నారు. దసరా పండగలోపు పెండింగ్ లో ఉన్న ఆరు డీఏల్లో మూడు డీఏలు ఇవ్వకపోతే ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.

వెంటనే పీఆర్సీ నియమించి ఉద్యోగులకు మెరుగైన ఫిట్ మెంట్ ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేసే వరకు ఉద్యోగులకు ఐఆర్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు నాగరాజు, రేవంత్ తదితరులు ఉన్నారు.

ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచింది

జగిత్యాల : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం జగిత్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు.

ఉద్యోగుల కు పెండింగ్ లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డీఏ విదిల్చారని.. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE