-మా ప్రభుత్వంలో మేమే బయట పెట్టాం
-చిన్న తప్పు దొర్లినా దండన కఠినం
-ఏ ఒక్కరికీ నష్టం జరగ నీయ్యం
-ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అదే
-అవినీతి రహిత పాలనగా తెలంగాణా
-రాజకీయ అవినీతి తగ్గుముఖం
-వెల్లడించిన జాతీయ నివేదికలు
-విపక్షాలు చిల్లరగా ప్రవర్తిస్తూన్నాయి
-ఈ డి,సి బి ఐ,ఐటి లకు ఫిర్యాదు చేస్తారంటున్న వారిది తెలివి తక్కువ తనమే
-తెలంగాణా ప్రజలు ప్రజాక్షేత్రంలో వారి మీదనే ఫిర్యాదు చేస్తున్నారు
-మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో దొంగలను పట్టి బయట పెట్టిందే రాష్ట్ర ప్రభుత్వం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పు పట్టడం అర్ధరహితమని ఆయన కొట్టి పారేశారు.బి ఆర్ యస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలాలో భాగంగ ఆయన శుక్రవారం రోజున సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కురు,ఆలేరు నియోజకవర్గ పరిధిలోని మూట కొండూరు లలో జరిగిన సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. మా ప్రభుత్వంలో జరిగిన సంఘటనను చిత్తశుద్ధితో మేమే బయట పెడితే విపక్షాలు రాద్ధాంతం చేసి లబ్దిపొందేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చిన్న తప్పు దొర్లినా దండన కఠినంగా ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని,ఏ ఒక్కరికి నష్టం వాటిల్లనియకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు సహజారించాల్సింది పోయి రాజకీయంచేస్తూ తమ తమ తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఒకవైపు అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణా కు జాతీయ స్థాయి నివేదికలు కితాబు ఇస్తుంటే ఇక్కడ విపక్షాలు ఈ రకంగా ప్రవర్తించడం సిగ్గుచేటని ఆయన విరుచుకుపడ్డారు.రాజకీయాలలో సైతం తెలంగాణాలో అవినీతి తగ్గుముఖం పట్టిందంటూ జాతీయ స్థాయిలో నివేదికలు ఇస్తుంటే అభినందించాల్సిన విపక్షాలు చిల్లర రాజకీయాలు చేయడం తెలంగాణా ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు.
నిరుద్యోగులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతుంటే మరోవైపు ఈ డి,సిబిఐ, ఐటి లకు ఫిర్యాదు చేస్తామంటూ ప్రతిపక్షాలు తమ తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నారని ఆయన ఎద్దేవాచేశారు. ప్రజాక్షేత్రంలో అటువంటి రాజకీయ పక్షాలపై ఫిర్యాదు చేసేందుకు యావత్ తెలంగాణా సమాజం ఎప్పుడో నిర్ణయించుకుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.