పేదవాడి బియ్యాన్నీ వదలని దౌర్భాగ్యపు ప్రభుత్వం

– కేంద్రం ఇచ్చిన వాటిని దారిమళ్లింపు
– ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం
– ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న రైతాంగం
– టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

పేదవాడి బియ్యాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం వదలడంలేదని, ఇలాంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం మనకుండడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లలో నూతన నిబంధనలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది రైతులు విక్రయించిన ధాన్యం బకాయిలు అందక ఇప్పటికీ అగచాట్లు పడుతున్నారు. నూతన నిబంధనలను ఉపసంహరించుకోవాల్సిన అవసరముంది. జగన్ రెడ్డి పాలనలో అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. పంటలకు మద్దతు లేదు, పంట నష్టపోయిన వారికి పరిహారం అందలేదు, రైతు భరోసా రైతు దగాగా మారింది.

అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. ఎక్కువ అప్పులున్నకుటుంబాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. ధాన్యం కొనుగోళ్లలోనూ నూతన నిబంధనలతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామనే జగన్ రెడ్డి మాటలు.. కాగితాలకే పరిమితం అయ్యాయి. కొత్తగా అమలు చేయనున్న నిబంధనలతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయాలకు రైతులు ఆపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికీ గతేడాది ధాన్యం బకాయిలు అందలేదు. ఈసారైనా అన్ని కష్టాలు ఎదుర్కొని పంటను అమ్ముకుని, నష్టాలను పూడ్చకుందామని యోచిస్తున్న రైతులకు జగన్ రెడ్డి ఇష్టానుసార నిబంధనలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

చంద్రన్న పాలనలో వారంలోనే ధాన్యం బకాయిలు చెల్లించగా.. నేడు నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు. జగన్ రెడ్డి నూతన నిబంధనలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌)లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పీఏసీఎస్‌లకు ఆర్‌బీకేలను ఎండార్స్‌ చేయగా.. ఆయా పీఏసీఎస్‌ సిబ్బంది, సీఈవోలు ధాన్యం కొనుగోలును పర్యవేక్షణ చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది సరికొత్త నిబంధనలు అమలులోకి తేవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌)లు సహకరించడం లేదు.

అనేక మంది పీఏసీఎస్‌ల సీఈవోలు ధాన్యం కొనుగోలు విషయమై వెనకడుగు వేస్తున్నారు. కొత్త నిబంధల వల్ల కలిగే సమస్యలను బయటకు చెప్పుకోలేక.. అమలు చేయలేక సతమతమవుతున్నారు. పీఏసీఎస్‌ సిబ్బంది రైస్‌ మిల్లర్ల వద్దకు వెళ్లి గోనె సంచులను తీసుకురావాల్సి ఉంది. వాటిని తమ పరిధిలోని రైతుభరోసా కేంద్రాలకు అప్పగించాలి. ధాన్యం రవాణాకు సంబంధించి ప్రతి పీఏసీఎస్‌ ఐదు వాహనాలకు తక్కువ కాకుండా ఆర్‌బీకేలకు ఎటాచ్‌ చేయాల్సి ఉంది. గతంలో ఖాళీ గోనె సంచులను రైస్‌మిల్లర్లే రైతులకు అందించేవారు.

కొత్తగా ఆ బాధ్యతలను పీఏసీఎస్‌లకు అప్పగించడం తుగ్గక్ నిర్ణయమే. ధాన్యం తరలించే వాహనాలను కూడా ఆర్‌బీకేలకు అప్పగించడం వల్ల అనేక సమస్యలు ఎదురు కానున్నాయి. మరోవైపు గతేడాది ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తిస్థాయిలో పీఏసీఎస్‌లకు కమీషన్లు చెల్లించలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు నుంచి పీఏసీఎస్‌లను తప్పించాలి. పాత నిబంధనలే అనుసరించాలి. వైకాపా అవినీతి కేంద్రాలుగా ఆర్బీకేలు మారాయి.

జగన్ రెడ్డి ఆర్భాటంగా ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు వైకాపా నేతల అవినీతి కేంద్రాలుగా మారాయి. ఈ-క్రాప్ లో అవకతవకలతో పాటు.. వైసీపీ నేతలు చెప్పిన వారివే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో ఎక్కడా అమలు కావడంలేదు. గతేడాది మిల్లర్ల వద్ద గోనె సంచులను తీసుకురావడం నుంచి తిరిగి వారికి ధాన్యం అప్పగించే వరకు శ్రమించారు. కళ్లాల వద్దకు వచ్చే ధాన్యం వాహనాలకు అనేకమంది లోడింగ్‌ పనులు కూడా చేపట్టారు.

గతేడాది సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో మిలర్లకు ధాన్యం ఇచ్చి ట్రక్కు సీట్లు కటింగ్‌ చేయించలేకపోయారు. దీంతో రైతులకు నేటికీ సొమ్ము అందలేదు. ఇప్పటికీ మిల్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి తీసుకువచ్చిన నూతన నిబంధనలతో రైతున్నలకు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. ఇప్పటికైనా జగన్ రెడ్డి ప్రభుత్వం, అధికార యంత్రంగం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి సక్రమంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలి. నూతన నిబంధనలను ఉపసంహరించుకోవాలి. ధాన్యం సేకరణ లక్ష్యాలు కుదించిన జగన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చుట్టూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

ధాన్యం సేకరణ లక్ష్యాలను జగన్ రెడ్డి ఈ ఏడాది కుదించడం రైతు ద్రోహమే. ఈ ఏడాది నవంబర్ వచ్చినా ఈ-క్రాప్, ఈకేవైసీ పూర్తికాలేదు. మరోవైపు గన్నీబ్యాగుల కొరత వేధిస్తోంది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది ధాన్యం అధికంగా సేకరించాల్సి ఉన్నప్పటికీ జగన్ రెడ్డి చేతులెత్తేశారు. 2019-20 ఖరీఫ్ లో 47,83,347 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 37 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యంగా నిర్దేశించడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం. గన్నీ బ్యాగులు 9.25 కోట్లు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం 55 లక్షల గన్నీ బ్యాగులే ఉన్నాయి.

ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేలా పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టాలి. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడంలేదు. గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు కుప్పలు తెప్పలుగా ఉన్నా కొనే నాధుడు కరువయ్యాడు. ఆర్బీకే లో కమీషన్ ఏజెంట్లు ఉన్నారు, చేయి తడిపితేనే పంట అమ్ముకోగలం. ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా ఉండాలి గానీ అన్యాయం చేసేలా ఉండకూడదు. ఆర్బీకే భవనాలు ఎక్కడా నిర్మాణం కాలేదు. రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలు వెంటనే చెల్లించాలి. చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయాల్సిన బియ్యం తరలిపోతోంది. రైతుల వద్ద పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

Leave a Reply