– బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్: నిండు శాసనసభ సాక్షిగా ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మధ్యంతర, రెండు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టింది. ఇది అంకెల గారడీ తప్ప,ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీ లేదు.రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను మూడు కోట్ల నాలుగు వేల 965 కోట్ల (3,04,965)రూపాయల భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది.
మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో 20వేల కోట్ల రూపాయల సబ్ ప్లాన్ కోసం బీసీలు గొంతెత్తి డిమాండ్ చేస్తే,అది పక్కన పెట్టి…11,405 కోట్లు మాత్రమే కేటాయించారు. నేతన్నల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని తేలిపోయింది,ఈ బడ్జెట్ లో కేవలం 371 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు.కేసీఆర్ సుపరిపాలనలో దసరా, రంజాన్, క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా అక్కాచెల్లెళ్లకు చీరలు,దుస్తులను అందజేసేవారు,ఇప్పుడా ప్రస్తావనే లేదు.
దేవాదాయ శాఖకు కేవలం 190 కోట్లు మాత్రమే కేటాయించారు, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేసీఆర్ 10ఏండ్లలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలు, లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అందించారు. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా కళకళలాడిన తెలంగాణను కాంగ్రెస్ పాలకులు ఎండబెట్టి చోద్యం చూస్తున్నరు.
బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికి శుద్ధి చేసిన తాగునీరు ఉచితంగా అందితే,మహిళామణులు నీళ్ల కోసం బిందెలు పట్టుకుని క్యూ కట్టే దుస్థితి తలెత్తింది ఈ ఇందరమ్మ రాజ్యంలో. నీళ్లు లేక పంట పొలాలు,హరితహారం మొక్కలు ఎండిపోయాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పింఛన్లు చేతికి రాక,పారిశుద్ధ్య, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ, ఆశావర్కర్లు నెలల తరబడి జీతాలు అందక గోస పడ్తున్నరు.
చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఈ బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదు. మొత్తంగా ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆశలు,ఆకాంక్షలపై నీళ్లు చల్లింది.