Suryaa.co.in

Telangana

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

– 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం
– వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు
– మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్

నారాయణపేట: దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకోవడం సంతోషం. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళలు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం.

రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం.

అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చాం. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నాం.

సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నాం. రూరల్, అర్బన్ అనే తేడా లేదు… తెలంగాణలో మహిళలంతా ఒక్కటే. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందాం. ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నా.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా. అందించడానికి సిద్ధంగా ఉన్నాం. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. నిధులు మేం ఇస్తాం..నిర్వహణ మీరు చేయండి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలి.

LEAVE A RESPONSE