– మాజీ మంత్రి మల్లారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు విషయంలోకి వెళితే… గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. 2,500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును ఈరోజు అధికారులు తొలగించారు.
దీనిపై మల్లారెడ్డి మాట్లాడుతూ… అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపించారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని తాను అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేశానన్నారు.
2,500 గజాల రోడ్డు స్థలానికి గాను ప్రత్యామ్నాయంగా తన స్థలాన్ని నాడు మున్సిపాలిటీకి ఇచ్చానని మల్లారెడ్డి తెలిపారు. కాలేజీ రోడ్డు తొలగించడంతో 25 వేలమంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.