Suryaa.co.in

Political News

క్రేజు పాయె.. కామెడీలా మారె!

– పాపం ఉద్యోగులు
– ఉద్యోగసంఘ నేతలకు పోయిన విలువ
– బాబు హయాం వరకూ వెలిగిన సంఘాలు
– జగన్ జమానాలో కరిగిపోయిన వైనం
– బాబు హయాంలో నేతలకు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్‌మెంట్లు
– జగన్ జమానాలో నేతల ముఖం చూడని అవమానం
– బాబు హయాం వరకూ పాలకులను బెదిరించిన సంఘాలు
– జగన్ హయాంలో జీతాల కోసం దేబిరించే దయనీయం
– భజన సంఘాల్లా మారిన కొన్ని ఉద్యోగ సంఘాలు
(ఎం.ఎస్ రాజు)

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులంటే పాలకులకు హడల్. ఇక ఉద్యోగ సంఘ నేతలంటే వణికిపోవలసిందే. మొండివాడన్న పేరున్న ఎన్టీఆర్ లాంటి నేతనే, సెక్రటేరియేట్‌లో రోడ్డుమీద పడుకునేలా చేసిన ఘనత ఉద్యోగ సంఘాలది. దానితో ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా, మళ్లీ అధికారంలోకి రాదన్న భావన స్థిరపడింది.

దానితో పాలకులెవరైనా ఉద్యోగులను ఇంటి అలుళ్లలెక్క చూసుకునేవారు. ఒకసారి చేదు అనుభవం చవిచూసిన చంద్రబాబు.. ఆ అనుభవంతో విభజిత రాష్ట్రంలో వారికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిచే స్తే చాలన్నారు. వారికోసం హైదరాబాద్ నుంచి అమరావతికి ైరె లు కూడా వేయించారు. అడిగిన వెంటనే ఉద్యోసంఘ నేతలకు అపాయింట్‌మెంట్లు ఇచ్చారు.

అయితే ఆ గౌరవం వారికి ఏమాత్రం సరిపోలేదు. ఎన్నికలకు ముందు.. మీకు‘ నేనున్నా, నేను విన్నా’నంటూ జగన్ వేసిన దీర్ఘ ప్రసంగం, వారిని ఆనందపరవశులను చేసింది. దానితో ఉద్యోగులు రెండుచేతులతో ఓట్లేసి జగనన్నను గెలిపించారు. ఆ మాట ఓ ఉద్యోగనేత వేదనాపూరిత స్వరంతో వెల్లడించారు.

మరి ఉద్యోగులు ఏమైనా సాధించారా అంటే శూన్యం. ఉద్యోగ నేతలను జగనన్న దేకిందే లేదు. కానీ ఈ ఐదేళ్లలో జగనన్న ఉద్యోగుల దూల తీర్చేశారన్న కితాబు.. ఎగబడి గెలిపించినందుకు తగిన శాస్తి జరిగిందని, మెటికలు విరిచేస్తున్న సౌండ్లు మాత్రం జనక్షేత్రంలో వినిపిస్తున్నాయి. చివరాఖరకు దశాబ్దాల నుంచి పోరాడి సాధించుకున్న క్రేజు స్థానంలో ఉద్యోగ నేతలు కామెడీపీసుల్లా మారిన విషాదం!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చూసి మిగతా ప్రపంచం అంతా విస్తుపోతోంది. మొన్నటి దాకా వాడు మగాడ్రా…బుజ్జీ అన్నోళ్లే , ఇప్పుడు వాళ్ల అవస్థలు చూసి నవ్వుకుంటున్నారు. కొంతమందేమో .. సర్కార్ నౌకరీ చూసుకొని రెచ్చిపోయారుగా మీకు ఇలాగే జరగాలంటూ అసూయతో ఆనందపడుతున్నారు. మరికొంతమంది మాత్రం.. అయ్యో పాపం ప్రభుత్వం ఉద్యోగులకు ఈ పరిస్థితి ఏంటి?…ఇలా ఇంతకుమెందెప్పుడూ మిమ్మల్నిట్లా చూడలేదే అని జాలి చూపుతున్నారు.

మొత్తంగా చూస్తే గతమెంతో వైభవంగా సాగిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి.. నేడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేనంతగా విషాదంగా దిగజారిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగులు జీతాల ఆలస్యం, సిపిఎస్,జిపిఎఫ్ ఇలా సమస్యల వలయంలో చిక్కుకొని సతమతమవుతున్న సంగతి సామాన్యులకు కూడా తెలిసిపోయిది. దీంతో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల ఇక్కట్ల గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా సింపతీ స్టోరీలు రాస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం లెక్కనేనన్ని జోక్స్, మీమ్స్,స్పూస్స్ తో వీళ్లు ఫుల్ కామెడీ ఐటెమ్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది.

సుమారు రెండేళ్లుగా సోషల్ మీడియాలో ఫన్ క్రియేషన్ కు తామే ముడిసరుకుగా మారతామని, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ ఊహించి ఉండరు.ఇలా ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల క్రేజ్ ని దారుణంగా దెబ్బతీసిన ప్రభుత్వంగా, జగన్ సర్కార్ హిస్టరీలో ఒక స్పెషాలిటీని సొంతం చేసుకుంది.

అసలు ఎపిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకీ పరిస్థితి వచ్చింది?…అందుకు కారణాలు ఏమిటి?…ఇందుకు బాధ్యలు ఎవరు?…కారణాలేమైనా కోల్పోయిన తమ పునర్వైభవాన్ని గవర్నమెంట్ ఉద్యోగులు తిరిగి పొందగలుగుతారా?…అలా జరగడం సాధ్యమేనా?…అంటే ఈ ప్రశ్నల అన్నింటికీ సమాధానం వైసీపీ ప్రభుత్వమేనని ఉద్యోగ సంఘాలన్నీ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల రాష్ట్ర ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఆ ఫ్రస్టేషన్ ని కొంతకాలంగా తప్పదన్నట్లుగా ఎలాగోలా ఓర్చుకున్న ఉద్యోగులు ఇక మావల్ల కాదంటూ బరస్టయిపోతున్నారు. ఉత్తరాంధ్ర,కోస్తా,రాయలసీమ అని తేడా లేకుండా అన్ని చోట్లా ఉద్యోగులు తమ అసహనాన్ని పలు రూపాల్లో ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) నేరుగా ఏపీ ప్రభుత్వం పైనే గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో సమస్య తీవ్రతను ప్రపంచం మొత్తానికి ఎలుగెత్తి చాటినట్లయింది. గవర్నర్‌ హఫీజ్ ని కలిసి తమ జీతాల విషయంలో ఒక కొత్త చట్టం చేయాలని కోరుతూ, ఆయనకు ఏపీజీఈఏ వినతిపత్రం అందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వంపైన ఫిర్యాదు చేసే పరిస్థితి రావడం వింతగా మారింది. ఎన్నికలు సమీపించిన తరుణం కావడంతో ఈ విషయం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల ఈ చర్య ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది.

ఈ పరిణామాన్ని అసలు ఊహించని వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం తీరుపై నారాజ్ అయింది. ఏపీజీఈఏ గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే మీడియాతో మాట్లాడటంపై మండిపడిన జగన్ సర్కార్ , ఆ సంస్థ గుర్తింపుని రద్దు చేసే చర్యలను చేపట్టింది. ఆ క్రమంలో మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ ఏపీజీఈఏని సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది.

ఉద్యోగ సంఘాల నేతల ఫిర్యాదుపై ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ స్పందిస్తూ.. అసలు ఏ రాష్ట్రంలో ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నారో చెప్పండి?…అని ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వం ఏమైనా ఫస్ట్ తారీఖునే జీతం ఇచ్చిందా?..పోనీ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకటో తేదీనే వేతనాలు వస్తున్నాయా..? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకటో తేదీనే జీతాలు వచ్చిన దాఖలాలు లేవు అని సూక్తిముక్తావళి వినిపించారు.

అయినా బిల్లుల అప్ లోడింగ్‌..ప్రాసెసింగ్ చేయటానికి కొంత సమయం పడుతుంది…దాన్ని కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాం…ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించాలని చూడడం సరికాదన్నారు. కోవిడ్ సంక్షోభంలో కూడా క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోమన్నారు. రావత్ గారు వైసీపీ నేతలు కూడా ఈర్ష్యపడేలా చేసిన ఆ ప్రకటన ఉద్యోగులను హతాశులను చేసింది.

దీంతో అసలే సకాలంలో జీతాలు అందక నానా అవస్థలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు, రావత్ స్పందనతో మళ్లీ మండిపోయింది. ప్రభుత్వం తమని ఎంత బెదిరించినా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకూ పోరాడుతూనే ఉంటామని మరోమారు స్పష్టం చేశారు. జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు, పీఆర్సీ సమస్యల పరిష్కారం విషయంలో అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మడమ తిప్పేశారని ఒక్క వైసీపీ అనుకూల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తప్ప, మిగతా అన్నీ యూనియన్లు ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి.

ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను, ఆ తరువాత కాలంలో వేతనాలు సైతం సకాలంలో జమకాకపోవడం మరింత మండిపోయేలా చేసింది.తమ జీతాలు ఒకటో తేదీన జమ అవడం అటుంచి అసలు ఏ తేదీన జమవుతాయో ఊహించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇటు జీతాలైనా అటు పెన్షన్లైనా ఒక్కో నెల ఒక్కోరకంగా అందుతుండటంతో ఏ చెయ్యాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు.

మరోవైపు పులి మీద పుట్రలా పీఎఫ్ నిధుల విషయంలోనూ, ప్రభుత్వం తీరు వారిని మరింత ఇబ్బందుల పాలు చేస్తోంది. పిఎఫ్ లో జీతం నుంచి తమ వాటాకు ప్రభుత్వ వాటా కలిపి జతచేస్తారనే సంగతి తెలిసిందే. ఏదైనా అత్యవసరం అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అందులో నుంచి కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇలా జిపిఎఫ్ ను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

నెలల తరబడి తమ జీపీఎఫ్ బిల్లులు, పెండింగ్‌లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం తమ జీపీఎఫ్‌కి సంబంధించిన సొమ్మును సైతం దారి మళ్లించిందని, అందుకే ఈ పరిస్థితి నెలకొందని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తుండటం గమనార్హం.

సరే కొంతకాలానికి పరిస్థితులు చక్కబడతాయోమో అన్న ఆశతో ఎదురుచూసిన ప్రభుత్వ ఉద్యోగులు, పరిస్థితి నానాటికీ మరింత దిగజారుతుండటంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. సీపీఎస్ అంశంలో ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సానుకూలంగా స్పందించిన తరుణంలో ..ఇందుకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడం ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఎక్కడా లేనివిధంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పేరుతో ఒక కొత్త విధానం తీసుకొచ్చేందుకు, ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను ఆయా సంఘాలు తప్పుబట్టడమే కాదు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కూడా!

ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఆయా ఎంప్లాయిస్ యూనియన్ నేతల మీద ఒత్తిడిని పెంచుతోంది. ఉద్యోగుల ప్రశ్నలవర్షం ధాటిని తట్టుకోలేకపోతున్న యూనియన్ల నాయకులు, ప్రభుత్వం పై తమ విమర్శల దాడిని మరింత తీవ్రం చేశారు. వీరిలో గతంలో పీఆర్సీ సహా వివిధ ఒప్పందాల విషయంలో, జగన్ సర్కార్ వైఖరిని సమర్థించిన నాయకులు కూడా ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

ఏపీ ఎన్జీవో, అమరావతి జేఏసీ వంటివి కూడా వైసీపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన గురించి ఉపాధ్యాయ సంఘం నేత, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు విశ్లేషిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. అందుకు వైసీపీ ప్రభుత్వ తీరు అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణంగా ఆయన విశ్లేషించారు. ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులు, డీఏ చెల్లింపు వంటి విషయంలో జరుగుతున్న తీవ్ర జాప్యం వారిని ఇక్కట్లపాలు చేస్తోందన్నారు.

ఒకవైపు సామాజిక పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీన అందించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న జగన్ సర్కార్.. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుందనే అభిప్రాయం కలగడంలో వింతేముందన్నారు. సీపీఎస్ తో సహా అనేక విషయాల్లో ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మరి ప్రభుత్వం తన తీరు మార్చుకోకుండా, ఉద్యోగ సంఘాలను తప్పుబట్టడం వల్ల నష్టమే గానీ ఏ మాత్రం ప్రయోజనం ఉండదని తేల్చేశారు.

ఒకప్పుడు పాలకులను గడగడలాడించిన ఉద్యోగనేతలు, ఇప్పుడు జగనన్నను చూసి గడగడ వణికిపోవడమే ఉద్యోగ సంఘాల ఇమేజీనీ డామేజీ చేశాయి. పోరాటాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఇచ్చిందే పదివేలనుకుని భయంతో బతుకుతున్న ఉద్యోగుల విషాదం ప్రజలను విస్మయపరుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి గురించి ఏకంగా పార్లమెంట్ లో ప్రస్తావన రావడం జగన్ సర్కార్ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. ఫిబ్రవరి 4న లోక్ సభలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా చెల్లించట్లేదని అన్నారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం రూపాయి కూడా వినియోగించడంలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదని,ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి అప్పులు తీసుకుంటోందని దుయ్యబట్టారు.

ఇక లోక్‌సభ సమావేశాలున్న ప్రతి సందర్భంలోనూ.. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఉద్యోగులకు సక్రమంగా జీతాలివ్వలేని జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కూడా వాడుకున్న జగన్ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని రాజు డిమాండ్ చేయడం, అప్పట్లో ప్రభుత్వానికి తలకొట్టేసేలా చేసింది.

ఇదండీ ఎపిలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత పరిస్థితి. ఇక ఇప్పుడు ఎన్నికల ఘంటారావానికి సమయం ఆసన్నమయింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏమి చేస్తారు? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు తమకు ఏవైతే హామీలిచ్చారో అవి ఇప్పటికిప్పుడు తేల్చేయాల్సిందే అని పట్టుబడతారా?

లేక ఇంక చేసేదేముందిలే.. మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాం అని చతికలబడతారా?…ఒకవేళ జగన్ ప్రభుత్వం ఏవైనా కంటితుడుపు చర్యలు చేపడితే వాటితో సర్ధుకుంటారా? చూడాలి. ఏదేమైనా ఏమి చేసినా పాపం ఉద్యోగుల ఇజ్జత్ తీసిన గవర్నమెంట్ గా, జగన్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE