దాదాపు ఐదు లక్షల గ్రంథాలతో కూడి ఉన్న ఒక పెద్ద గ్రంథాలయం ఉన్నది. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మహాభారతం అంత పెద్ద గ్రంథం. ఆ గ్రంథాలయంలో ప్రవేశించడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ అతి అరుదైన గ్రంథాలు. వాటిని ఎవరూ చదువరాదని, ఆ పుస్తకాలు అలాగే చెద పట్టి నశించి పోవాలని ఆ గ్రంథాలు తయారు కావడానికి కారకులైన వారే స్వయంగా కోరుకుంటున్నారు! అయితే వివేక్ అగ్నిహోత్రి ఏదో ఒకలా సాహసం చేసి అందులో ప్రవేశించాడు. కాని, రెండున్నర గంటల లోపలే ఆ గ్రంథాలయం నుండి బయటపడాలి. జీవితకాలమంతా ఆ గ్రంథాలయంలోనే ఉండనిచ్చినా అన్ని గ్రంథాలను పూర్తిగా చదవటం ఎవరికీ జన్మలో సాధ్యం కాదు. ఆ రెండున్నర గంటలలో ఏదో ఒక పుస్తకాన్ని మాత్రమే తెరిచి కొద్దికొద్దిగా చూడటం సాధ్యమౌతుంది. అందువల్ల అక్కడ కనిపించిన అన్ని పుస్తకాలలోనూ వివేక్ అగ్నిహోత్రి అతి చిన్న పుస్తకాన్ని మాత్రమే ఎంచుకున్నాడు.
ఆ గ్రంథాలయం పేరు కాశ్మీర్. అతడు ఎంచుకున్న పుస్తకం పేరు కాశ్మీర్ ఫైల్స్. ఆ పుస్తకంలో అతడు చదివిన కథ పేరు పుష్కరనాథ్ పండిత్ కుటుంబ కథ.
కృష్ణ పండిత్ అనే ఒక యువకుడి తాతగారు పుష్కర నాథ పండిత్. మూడు దశాబ్దాల క్రితం కాశ్మీర్లో ఒక ఉపాధ్యాయుడుగా పని చేసేవాడు. కృష్ణపండిత్ కు ఊహ తెలిసేసరికి కాశ్మీర శరణార్థుల శిబిరంలో తన తాతగారితో కలిసి పెరుగుతున్నాడు. తాతగారు మనం కాశ్మీరానికి చెందినవారమని చెబుతున్నాడు. కాశ్మీర్ ని ఎందుకు వదిలి రావలసి వచ్చింది అని అడిగితే మీ తల్లిదండ్రులు మీ అన్న ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు అనే సమాచారం మాత్రమే అతడికి ఆయన చెబుతూ వచ్చాడు. కృష్ణ పండిత్ అదే నిజమని నమ్ముతూ వచ్చాడు. ఎప్పటికైనా నా మనం తిరిగి మన జన్మభూమి అయిన కాశ్మీరానికి తిరిగి వెళ్ళవలసిందే అని తాత గారి పట్టుదల. కాశ్మీరు పండితులు తిరిగి కాశ్మీర్ కు రావాలంటే ఆర్టికల్ 370 అడ్డంకిగా ఉన్నదని దానిని తొలగించాలని అతడు భారత ప్రధాన మంత్రికి మూడు దశాబ్దాలలో దాదాపు ఆరు వేల ఉత్తరాలు వ్రాశాడు. ఏదో ఒకరోజు ఒక ప్రధానమంత్రి వీటన్నిటిని చూసి ఆర్టికల్ 370 ని తొలగిస్తాడని ఆశతో బ్రతుకుతున్నాడు.
కృష్ణ పండిత్ యువకుడిగా ఎదిగి విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీలో తన తాతగారి స్నేహితులు నలుగురిని అతడు కలుసుకున్నాడు. పుష్కర నాథ్ పండితుని మనుమడు అనేసరికి వారు అతడిని ఎంతో ప్రేమతో చేరదీశారు. తన కుటుంబం కాశ్మీర్లో రోడ్డు ప్రమాదంలో మరణించిందని అతడు చెబితే అతడికి నిజం తెలియదు అని గ్రహించిన ఆ నలుగురు మౌనంగానే ఉండిపోతారు తప్ప నిజం మాత్రం చెప్పరు.
కృష్ణ పండిత్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడున్న ఇతర కాశ్మీర్ విద్యార్థులతో, ప్రొఫెసర్ లతో అతడు మాట్లాడినప్పుడు కాశ్మీర్ ప్రసక్తి అనివార్యంగా వచ్చింది. ప్రొఫెసర్ రాధికా మీనన్ కృష్ణ పండిత్ ను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. 80ల దశకం చివరిలోను, 90ల దశకం చివరిలోను కాశ్మీరంలో నిజంగా ఏమి జరిగిందో ప్రత్యక్షంగా చూడని కృష్ణ పండిత్ ఆమె మాటలను చాలా సులువుగానే నమ్మేశాడు. చరిత్రలో కాశ్మీర్ ఎన్నడూ భారత్ లో ఒక అంతర్భాగం కానే కాదని, వివిధ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం నుంచి కాశ్మీర్‌ను విడిగానే గుర్తిస్తున్నాయి అని, వారు ప్రచురించే దేశ పటాలను పరిశీలిస్తే అది స్పష్టమవుతోంది అని, కాశ్మీర భూభాగాన్ని భారత ప్రభుత్వం బలాత్కారంగా ఆక్రమించిందని, మనం భారత ప్రభుత్వం నుంచి తిరిగి స్వాతంత్ర్యాన్ని (ఆజాదీని) సాధించాలని ఆమె ప్రబోధిస్తూ ఉంటుంది. భారత సైనికులు కాశ్మీర ప్రజలను అణచివేస్తూ ఉన్నారని మరి అలాంటి సైనికులు మీద కాశ్మీరు పిల్లలు రాళ్ళను కాకపోతే పూలను కురిపిస్తారా అని పరిహాస పూర్వకంగా విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది. విద్యార్థులందరూ మూకుమ్మడిగా ఆమె మాటలను నిజమేనని నమ్ముతూ ఉంటారు.
కృష్ణ పండిత్ విద్యార్థులందరిలోనూ చాలా చురుకైనవాడు. అతడి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని గ్రహించిన ప్రొఫెసర్ రాధిక మీనన్ అతడిని స్టూడెంట్ యూనియన్ లీడర్ గా గెలిపించాలని భావిస్తుంది. నువ్వు నాయకుడిగా ఎదగాలి అంటే ఒక కారణం కావాలి. కాశ్మీర్ సమస్యను ఆ కారణంగా ఎంచుకో. నువ్వు దెబ్బకొట్టవలసిన ఒక విలన్ ను అందరికీ చూపించాలి. కాశ్మీర్ లో ఆ విలన్ భారత ప్రభుత్వమే అని అందరికీ చాటాలి అని ప్రొఫెసర్ బోధిస్తుంది. ఆ మాటలను ఇష్టపడని కృష్ణ పండిత్ కు మనం కాశ్మీరుకు మేలు చేయాలంటే అధికారం సాధించక తప్పదు అని, అందుకు రాజకీయాలు చాలా అవసరం అని నచ్చజెపుతుంది. కృష్ణ పండిత్ చివరకు అందుకు అంగీకరిస్తాడు.
అయితే తన మనుమడు విశ్వవిద్యాలయంలో రాజకీయాలు చేస్తున్నాడని తెలుసుకున్న పుష్కర నాథ పండిత్ అందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. వేలాది కాశ్మీర్ పండితుల genocide కు కారణమైన వారికి నువు ఆజాదీ కావాలంటావా? అంటాడు.
అయితే కృష్ణ పండిత్ తనకు ప్రొఫెసర్ నూరిపోసిన కాశ్మీర్ పండితుల exodus సిద్ధాంతాన్ని బాగా నమ్ముతున్నాడు. అప్పట్లో అంటే 80ల దశకానికి పూర్వం) అతి తక్కువ జనాభా ఉన్న కాశ్మీర పండితులు అతి ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకుని అనుభవిస్తూ ఉండేవారని, వారినుండి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని లేనివారికి పంచిందని, దాంతో అక్కడ ఉండేందుకు ముఖం చెల్లక పండితులు వలసపోయారు అని అతడికి యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన సిద్ధాంతం.
తన మనుమడు సత్యానికి దూరంగా జరిగిపోతున్నాడు అని భావించిన పుష్కర నాథ పండితునికి నిరాశతో మతి చలించినట్లయింది. మూడు దశాబ్దాల క్రితం Raliv Galiv Chaliv (మతం మారు, వదిలి పారిపో, లేదా చావు) అనే నినాదాలతో ఉన్మాదతీవ్రవాదమూకలు విరుచుకుపడి, తన కుటుంబాన్ని అతి క్రూరంగా పొట్టన పెట్టుకున్నప్పటికీ, ఎలాగో ప్రాణాలు దక్కించుకుని, తన ఇంటికి, ప్రాణసమానమైన తన మాతృభూమికి దూరమైనప్పటికీ ఎవరు బాగుపడాలని తన ప్రాణాలను ఉగ్గబట్టుకుని జీవించాడో, ఎవరి స్కూలు ఫీజు చెల్లించడానికి డబ్బు తక్కువౌతుందనే భయంతో తన కంటిచూపు వైద్యానికి అయ్యే ఫీజును కూడా చెల్లించలేకపోయాడో, ఎవరి కడుపు నింపడం కోసం తనకు ఆకలి లేదని అబద్ధమాడి పస్తులుండేవాడో, ఆ తన మనుమడే తన కుటుంబానికి జరిగిన అన్యాయం తెలుసుకోలేక, తీవ్రవాదులు, మీడియా, దేశప్రయోజనాల మీద ఏ మాత్రం ఆసక్తి లేని ఒక రాజకీయపక్షము కలసి ఆడుతున్న నాటకంలో ఒక పావుగా మారిపోతున్నాడని గ్రహించిన అతడు ఇక తట్టుకోలేకపోయాడు. మనుమడు బాగుపడాలన్న తన ఆశలన్నీ ఆవిరైపోతుండగా హఠాత్తుగా అతడికి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. తన చితాభస్మాన్ని కాశ్మీరులో తన ఇంటిలో వెదజల్లమని, తన నలుగురు మిత్రులకు తన మరణ వార్తను తెలియజేయమని చెప్పి అతడు కన్నుమూస్తాడు. (ఆర్టికల్ 370 రద్దు ఇంకా జరగకముందరి కథ.)
ఆ సందర్భంలోనే కృష్ణ పండిత్ కు తన తండ్రి కాశ్మీర్ తీవ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలుస్తుంది.
తన తాత గారి చివరి కోరిక మేరకు అతని చితాభస్మాన్ని కాశ్మీరంలోన వెదజల్లేందుకు బయలుదేరిన కృష్ణ పండిత్ తో ప్రొఫెసర్ రాధిక మీనన్ కాశ్మీరులో ప్రజలను భారత ప్రభుత్వం ఎంతగా చిత్రహింసలు పెడుతుందో, కాశ్మీరులో అమాయకులు అందరిని ఎంతగా తీవ్రవాదులుగా చిత్రీకరించి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తోందో నీ నోటి ద్వారానే విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరికీ చెప్పాలని ఆదేశిస్తుంది. నువ్వు విద్యార్థి నాయకుడిగా ఎదగాలంటే ఈ పని తప్పక చేయవలసిందే అంటుంది. కాశ్మీరులో అతడు ఎవరిని కలిస్తే అక్కడున్న విషయాలన్నీ బాగా వివరించి చెబుతాడో ఆ వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది.
మేడమ్, మీకు కాశ్మీర్ లో ఇంత గట్టి పరిచయాలు ఉన్నాయని నాకు తెలియదు సుమా అని కృష్ణ పండిత్ ఆశ్చర్యపోతాడు.
ఎప్పటికైనా కాశ్మీర్ కు తిరిగి వెడతాను అనే ఆశతో జీవించిన తమ మిత్రుడు పుష్కర నాథ పండిత్ చివరకు చితాభస్మరూపంలో కాశ్మీర్ కు చేరుకున్నాడు అని అతడి మిత్రులందరూ వాపోతారు.
ప్రొఫెసర్ రాధిక మీనన్ ఆదేశాల ప్రకారం కృష్ణ పండిత్ కలుసుకున్న వ్యక్తులు తాము ఎంత అమాయికులమో, తమ మీద భారత ప్రభుత్వం ఎందుకు తీవ్రవాదులనే ముద్రవేసిందో తీయ తీయని మాటలతో నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారు. చివరకు తన తల్లిదండ్రులను హతమార్చిన బిట్టు అనే వ్యక్తిని కృష్ణ పండిత్ కలుసుకుంటాడు. అతడి ఇంటిలో అతడు తమ ప్రొఫెసర్ అయిన రాధిక మీనన్ కు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా అతడు గమనిస్తాడు. అయితే అతడు మీ తల్లిదండ్రులను చంపింది నేను కాదు, అది అబద్ధం అని తిరస్కరించి, వారిని చంపింది భారత సైన్యం అని చెబుతాడు.
కృష్ణ పండిత్ అతడి మాటలు నిజమేనని నమ్మేశాడు. సత్యం ఏమిటో తెలియని అతడు భారత దేశాన్ని భారత ప్రభుత్వాన్ని భారత సైన్యాన్ని అతడు ఇప్పుడు మనసారా ద్వేషిస్తున్నాడు.
తన తాత గారి ప్రియస్నేహితుడు, ఒకప్పటి ప్రభుత్వ అధికారి బ్రహ్మదత్తుడు. మీరే మా కుటుంబాన్ని హత్య చేసినవారు అని కృష్ణ పండిత్ ఆ బ్రహ్మదత్తును నిందిస్తాడు.
కృష్ణ పండిత్ అసత్య కథనాలను నమ్మి భారత వ్యతిరేకిగా తీవ్రవాదిగా మారబోతున్నాడు అని గ్రహించిన బ్రహ్మ దత్ ఇప్పటికైనా నిజం ఇతడు తెలుసుకోవలసిందే అని భావించి తాను ఎప్పటినుంచో సేకరిస్తూ వచ్చిన సత్యాలను కాశ్మీర్ ఫైల్స్ రూపంలో అతడి ముందు ఉంచుతాడు. వాటిని పరిశీలించిన కృష్ణ పండిత్‌కు జ్ఞానోదయం కలుగుతుంది. తన తల్లిదండ్రులను, అన్నను కూడా నిర్దయగా హతమార్చింది తీవ్రవాదులే అన్న విషయం అతడికి స్పష్టంగా తెలుస్తుంది.
తాతగారి అంతిమ సంస్కారాలు అన్నీ పూర్తి చేసుకుని తిరిగి ఢిల్లీ విశ్వవిద్యాలయం చేరుకున్న కృష్ణ పండిత్‌ను కాశ్మీరులోని వాస్తవ పరిస్థితులను (తన మనుషులు కృష్ణ పండిత్ కు చెప్పిన కట్టుకథలను) వివరించమని ప్రొఫెసర్ రాధికా పండిత్ ఆదేశిస్తుంది.
అప్పుడు కృష్ణ పండిత్ తన తోటి విద్యార్థుల సమక్షంలో ఏమి చెప్పాడు?
అది మిత్రులందరూ ప్రత్యక్షంగా సినిమాను థియేటర్లలో చూసి తెలుసుకోవలసిందిగా కోరుతున్నాను.
రెండున్నర గంటల సినిమాలో చివరి అర్ధగంటలో సినిమా సారాంశం అంతా స్పష్టమవుతుంది. మిగిలిన రెండు గంటలు తన మాతృభూమి అయిన కాశ్మీర్ విషయంలో సత్యాసత్యాలను తేల్చుకోలేక కృష్ణ పండిత్ అనుభవించిన అవ్యక్తమైన ఆవేదననే ప్రతిబింబిస్తాయి.
★★★
సినిమాలో కాశ్మీరు అందచందాలు, ఆయా నటుల నటనా వైదుష్యం, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకుని ప్రతిభ, సంభాషణలు ఇటువంటి వాటిని గురించి నేను మాట్లాడితే అసలైన విషయాన్ని పక్కదోవ పట్టించినట్లు ఉంటుంది కాబట్టి అవి ఎంత అద్భుతంగా ఉన్నా వాటిని గురించి ఇక్కడ నేను చెప్పటం లేదు. మనం ప్రతిరోజు మన గుండెకాయను గూర్చి మాట్లాడుకోము. అయినా అది పనిచేయకపోతే మన శరీరంలో ప్రాణం ఉండదు. అంత మాత్రం చెప్పగలను.
తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా, అప్పట్లో Kashmir Genocideకు పుష్కరనాథపండిత్ మిత్రులు కూడా ఏదో ఒక రకంగా కారణమైన విషయం, అందుకు వారు ఒకరినొకరు నిందించుకొనడం మనం నిస్సహాయంగా చూడవలసి వస్తుంది.
అప్పటి కాశ్మీరపు ముఖ్యమంత్రికి కాశ్మీరహిందువులను కాపాడటం కంటె తీవ్రవాదులతో సత్సంబంధాలను కలిగి ఉండటమే ప్రధానమైనదనే విషయాన్ని మనం నిశ్చేష్టులమై అర్థం చేసుకోవలసి వస్తుంది.
సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అతి భయానకమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కలిపినా సినిమా కథలో 10% కూడా ఉండవు. ఆ మాత్రం కూడా లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదా అనే ప్రశ్న రావచ్చు. అలా తీస్తే ముప్పై ఏళ్ల పాటు కాశ్మీరం గాని అక్కడి బాధలు కాని మనవి కాదన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోయిన కాశ్మీరవాసులం కాని మనం వ్యవహరించిన తీరు ఏమాత్రం మారదు. సినిమా తీసిన ప్రయోజనం నెరవేరదు.
విశ్వవిద్యాలయంలో తన తోటి విద్యార్థుల నడుమ కృష్ణ పండిత్ నిజాలను మాట్లాడుతూ ఉండగా అవన్నీ అబద్ధాలే అని, వాటిని తాము వినదలచుకోలేదని, కూర్చోమని కొందరు విద్యార్థులు అల్లరి చేస్తారు. అయితే మరి కొందరు విద్యార్థులు ఈ నిజాలు తమకు తెలియవని, వాటిని గూర్చి తాము మరింతగా తెలుసుకొనగోరుతున్నామని, కృష్ణ పండిత్ తన మాటలను ఆపరాదని కోరుతారు. ఈ సినిమా ద్వారా వివేక్ అగ్నిహోత్రి కోరుకుంటున్న మార్పు లేదా ఫలితం ఖచ్చితంగా ఇదే.
ఆ విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులలో మార్పు వచ్చింది. ఇక్కడ దేశంలో మార్పు రావలసింది మనలో. ముఖ్యంగా కాశ్మీరు genocide మోడల్‌ను బెంగాల్లో, కేరళలో ప్రారంభించి, క్రమంగా మహారాష్ట్రకు, పంజాబుకు, గోవాకు, తెలంగాణకు, చివరకు భారతదేశమంతటా విస్తరించాలని ప్రత్యక్షతీవ్రవాదులు, పరోక్షతీవ్రవాదులు, ప్రచ్ఛన్నతీవ్రవాదులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో మనలో తప్పక ఆ మార్పు రావలసిందే!
విన్నా వినబడనట్టు నటిస్తున్న సూడో చెవిటివాళ్లకు బాగా వినబడాలంటే సభ మధ్యలో బాంబు విసరాల్సిందే అని నిశ్చయించుకుని ధైర్యంగా ఎవరికీ ప్రమాదం కలగకుండా సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్, బటుకేశ్వర దత్ అప్పట్లో బాంబు విసిరారు. ఫలితం తెలిసిందే. అప్పుడు దేశమంతా ప్రతిస్పందించింది.
ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి కూడా అటువంటి బాంబును విసిరారు. ఎవరికీ ప్రమాదం కలగకుండా విసిరారు. విశ్వవిద్యాలయంలో తన సహాధ్యాయుల మధ్యలో కృష్ణ పండిత్ చెప్పిన మాటలతో సినిమా పూర్తవుతుంది. కాని, వెంటనే లేచి ఇంటికి బయలుదేరకండి. వివేక్ అగ్నిహోత్రి విసిరిన బాంబు ఆ తరువాతనే పేలుతుంది. ఆ బాంబు పేలిన తరువాతనే మనం థియేటర్ విడిచి ఇంటికి బయలుదేరుదాం.