బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు రాజా సింగ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’ను అవమానిస్తూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ పేరుతో చేసిన విమర్శలు చేయడం ముమ్మాటికీ నిరుద్యోగులను అవమానించడమే. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఉద్యోగాలంటూ ఊరిస్తున్నారే తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారు.
ఇప్పటి వరకు దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చేందుకు ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతుంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఎఫ్పుడిస్తారో చెప్పకుండా మీరు నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారు.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊరించింది మీరు కాదా? తెలంగాణ వచ్చాక అసెంబ్లీ సాక్షిగా 1 లక్షా 7 వేల ఉద్యోగాలున్నాయని చెప్పింది సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా? ఈ ఏడేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా విడుదల చేయని మాట నిజం కాదా? రెండో సారి అధికారం చేపట్టాక గత మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయని మాట వాస్తవం కాదా?
ఈ విషయంలో మీకు సిగ్గన్పించడం లేదా? మీ ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ (పీఆర్సీ కమిటీ)యే తెలంగాణలో 1 లక్షా 92 వేల శాంక్షన్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చి చెప్పిన మాట నిజం కాదా? ‘ఈ ప్రశ్నలన్నీ మేం సంధించబోతున్నామని తెలిసి నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎదురుదాడి చేయడం సిగ్గుచేటు.మేం ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తుంటే… మీరు ప్రైవేటు ఉద్యోగాల గురించి మాట్లాడటం విడ్డూరం.
ఏటా 16 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్టుగా ఏవైనా అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించిందా? అలాంటి అవకాశం ఉన్నదా? కేంద్రం తెచ్చిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల కారణంగా రాష్ట్రానికి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయే తప్ప మీరు ఉద్దరించేదేమీ లేదనేది నిజం కదా? తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరేవర్చాలని మేం డిమాండ్ చేస్తుంటే కేంద్రం గురించి, పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతూ సమస్యను దారి మళ్లించాలనుకోవడం మీ అసమర్థతకు నిదర్శనం.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా క్రమం తప్పకుండా యూపీఎస్సీ, బీఎస్సార్బీ, ఆర్ఆర్ బీ, ఎస్ఎస్ సీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తదితర సంస్థల ద్వార లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఉంది. సెంట్రల్ వర్శిటీతోవ పాటు కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏర్పడే ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేయడం జరుగుతోంది.
స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అత్యధిక నిధులు కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. మద్రా రుణాల ద్వారా చిరు వ్యాపార రంగంలోఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.6 లక్షల కోట్ల నిధులను అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. తద్వార కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.
కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఎమ్ ఎస్ ఎమ్ ఈ లకు రూ.7 లక్షల కోట్ల నిధులు కేటాయించి పరిశ్రమలను మూత పడి కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోకుండా కాపాడిన గొప్ప ప్రభుత్వం మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.
ఈ ఏడేళ్లలో ఏ ఒక్క విశ్వవిద్యాలయంలోనైనా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ లో ఒక్క పోస్టునైనా భర్తీ చేశారా? మీ నిర్వాకంవల్ల పరిశోధనల్లో మన వర్శిటీలు వెనుకబడిన మాట వాస్తవం కాదా? దేశంలోనే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పడిపోయేలా చేసిన ఘనకార్యం మీది కాదా.
‘అతి తక్కువ నిరుద్యోగమున్న రాష్ట్రం తెలంగాణ’అని మీరు బహిరంగ లేఖ ద్వార చెప్పుకోవడం మీ అబద్దాల మటాలకు పరాకాష్ట. ఉద్యోగాల కోసం 25 లక్షల మందికిపైగా నిరుద్యోగులు టీఎస్పీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో నిరుద్యగ సమస్య ఏ స్ధాయిలో ఉందో అర్థం కావడం లేదా? ఉద్యోగాలు రాక, బతికేదారి లేక మీ పాలనలో దాదాపు 600 మంది నిరుద్యోగులు ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నది కఠోర వాస్తవం కదా? దీనికి బాధ్యులు మీరు కాదా? కాకతీయ విశ్వవిద్యాలయంలో బోడ సునీల్ నాయక్ వంటి ఎంతోమంది యువకులు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలివ్వకపోవడంవల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో పెట్టి సూసైడ్ చేసుకున్నది నిజం కాదా? అయినా సిగ్గులేకుండా అతి తక్కువ నిరుద్యోగమున్న రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవడం హేయం.
‘కొలువుల కల్పవల్లిగా తెలంగాణ’ అని చెబుతున్న మీరు ఈ విషయంలో చేసిన క్రుషి ఏమిటి? భౌగోళిక, వాతావరణం పరంగా ఐటీ, ఉద్యోగ సంస్థల ఏర్పాటుకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత అనువైన నగరం. అందుకే దశాబ్దాలుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక విదేశాలతో ఏర్పడ్డ సత్స సంబంధాలవల్ల అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటైన విషయం వాస్తవం కాదా? ఐటీఐఆర్ రద్దు కావడానికి మీ నిర్లక్ష్యం, మీ చేతకాని తనం కారణం కాదా. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తే స్పందించని మీకు ఐటీఐఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు.
తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్ అనే పదమే ఉండదని అసెంబ్లీ, అనేక వేదికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. రాష్ట్రంల కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మనెంట్ చేస్తారని ఉద్యోగులు, మేము అనుకున్నాం. కాని నిర్దాక్షిణ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులందరిని తొలగంచి రోడ్డున పడేస్తారని అనుకోలేదు. ఇప్పటిదాకా దాదాపు 50 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన మాట వాస్తవం కాదా? అందులో భాగంగా 12 వేల మంది విద్యా వలంటీర్లు, 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 22 వేల మంది స్కూల్ స్కావెంజర్స్, 400 మంది మిషన్ భగీరథ ఇంజనీర్లు, 1600 మంది స్టాఫ్ నర్సులను ఉద్యోగాల నుండి తొలగించి బజారు పాల్జేసిన దుర్మార్గ ప్రభుత్వం మీది కాదా? తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదామైన ‘నియామకాలు’ అనే అంశాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చిన మీ పార్టీ యువతకు ఉద్యోగాలివ్వకపోగా… సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి డజను పదవులను మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు పొందిన మాట వాస్తవం కదా?
తెలంగాణ వస్తే బతుకులు బాగైతాయని ఆశపడ్డ నిరుద్యోగ యువతీ, యువకుల నోట్లో మట్టి కొట్టడమే కాకుండా వాళ్ల జీవితాలను పెనం మీద నుండి పొయ్యిలోకి నెట్టిన మీరు బహిరంగ లేఖ పేరుతో ఎదురుదాడి చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’తో మీ ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు చేసిన ద్రోహం బట్టబయలవుతుందని, తద్వారా మీ పీఠం కదులుతుందనే భయంతోనే బహిరంగ లేఖ పేరుతో ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న విషయం అర్ధం చేసుకోలేనంత అమాయకులు ఎవరూ లేరు.
రాష్ట్ర ప్రజలు మీ చేష్టలన్నీ గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా, బహిరంగ లేఖ పేరుతో మరెన్ని జిమ్మిక్కులు చేసినా నిరుద్యోగుల పక్షాన మా ఉధ్యమం ఆగదు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యేదాకా పోరాటాలను ఉధృతం చేస్తాం.