Suryaa.co.in

Editorial

సింహం సిగ్గుపడింది!

– షర్మిల సవాలుకు జవాబు లేని జగన్
– తాను చెప్పడానికి సిగ్గుపడి నానితో చెప్పించిన జగనన్న
– మీ ఇళ్లలో కలహాలు లేవా అని టీడీపీ, చానెళ్ల యజమానులపై జగన్ ఎదురుదాడి
– కుటుంబ కలహాల గురించి పేర్ని చెప్పినా ఫర్వాలేదా?
– ఆస్తుల పంచాయతీ అసలు గుట్టు విప్పిన చెల్లెమ్మ
– ఆ తర్వాతయినా స్పందించని జగన్
– కనీసం భారతీతోనయినా ప్రకటన ఇప్పించే సాహసం చేయని తీరు
– తాను చెప్పకుండా పార్టీ నేతలతో చెప్పిస్తున్న వైచిత్రి
– చెప్పడానికి సిగ్గుపడ్డారా? అక్కచెల్లెమ్మకు భయపడ్డారా?
– మహిళల్లో జగన్ ఇమేజీకి భారీ డ్యామేజీ
– జగన్ లేదా భారతీ చెబితేనే బాగుంటుందన్న వైసీపీ సీనియర్లు
– ప్రకంపనలు సృష్టిస్తున్న ‘సూర్య’ కథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘సింహం సింగిల్‌గా వస్తుంది’.. ఇది ఎన్నికల ముందు నగ రి రోజక్క నుంచి గుడివాడ కొడాలి నాని వరకూ, తాదాత్మ్యంతో జగన్‌భక్తజనం తొడకొట్టి చెప్పిన డైలాగు. అంటే జగనన్న సింహం అన్నది వారి కవి హృదయం. సరే. ఆ సింహం ఓటమి పరాభవంతో కర్నాటక అడవులకు వెళ్లి, మళ్లీ ఇప్పుడు జనారణ్యంలోకి వస్తుందనుకోండి అది వేరే కథ. ఇప్పుడు ఆ సింహం అచ్చంగా.. చెల్లి సింహం పెను గర్జనకు సమాధానం లేక సిగ్గుపడింది. చెల్లి కళ్లలో కళ్లు పెట్టి, జవాబు చెప్పే ధైర్యం లేని జగన్ అనే మాజీ సింహం.. తన పరివారంతో సమాధానం చెప్పిస్తుండడమే విషాదం. ఇదంతా.. ‘సూర్య’లో వైఎస్ కుటుంబంలో పరాకాష్ఠకు చేరిన ‘పులివెందుల పైసల పంచాయతీ’ కహానీ ప్రకంపనలే.

వైఎస్ కుటుంబంలో అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న పైసల పెనుగులాట, చివరాఖరకు ఎన్‌సీఎల్‌టీకి చేరిన వైనంపై, ముందుగా రాసిన ‘సూర్య’ కథనం.. వైసీపీలో బాంబులా పేలింది. అంతకుముందు రోజు అన్నాచెల్లెల మధ్య రాయబారం జరుగుతోందని, కాంగ్రెస్‌లో చేరికకు చెల్లెమ్మ షర్మిలను, అన్నయ్య జగన్ వేడుకుంటున్నారన్న చర్చలకు టీవీ చానెళ్లు తెరలేపాయి. వాటిని జనం కూడా నిజమే కామోనసనుకున్నారు. ఎందుకంటే జగన్ ఈమధ్య కాలంలో కాంగ్రెస్ దారిలో నడుస్తున్నారు కాబట్టి!

అయితే అందుకు భిన్నంగా.. తన చెల్లి, తల్లికి చిల్లిగవ్వ ఇచ్చేది లేదని, ఆ మేరకు వారితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ జగన్,ఆయన భార్య భారతీరెడ్డి కోర్టుకె క్కారంటూ, ‘సూర్య’ బయటపెట్టిన కథనంతో.. చానెళ్లు తమ చర్చలను అర్జంటుగా, అన్నాచెల్లెల కోర్టు కిరికిరిపైకి మళ్లించారు. ఇంకేముంది? ఆగమాగం. గత్తర గత్తర! అచిరకాలంలోనే తెలుగు పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలు సంపాదించిన.. ‘సూర్య’ సృష్టించిన ఆ సంచలన వార్తపైనే, ఇప్పుడు నెట్టింట చర్చల రచ్చ.

‘‘అయ్యా చంద్రబాబూ.. అయ్యా ఏబీఎన్ రాధాకృష్ణా, అయ్యా ఈనాడు రామోజీ, అయ్యా టీవీ 5 నాయుడు, మీ ఇంట్లో ఏమీ గొడవలు లేవా? మా ఇంట్లో గొడవలపై పేపర్లలో వేసి గోల గోల చేస్తున్నారు. ఇవన్నీ ఘర్‌ఘర్‌కీ కహానీ. ప్రతీ ఇంట్లో ఉండేవే’’- ఇదీ.. తన మనస్తత్వంపై సొంత చెల్లి షర్మిల చేసిన ఆరోపణలకు, జగన్ ఆమెకు మినహా మిగిలిన వారికి.. బాధాతప్త హృదయంతో ఇచ్చిన జవాబు. తన కుటుంబ గొడవలపై మీడియాలో కథనాలు రావడం ఆయనను తెగ బాధించినట్లు జగన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

తల్లి-చెల్లికి ఇచ్చిన షేర్లు వెనక్కితీసుకున్న జగన్‌ను.. ‘‘నువ్వు ఇలా చేస్తావని వైఎస్ ఏనాడూ ఊహించి ఉండరు. విలువలు, విశ్వసనీయత అనేవి నీకు అసలు లేవు. నువ్వు దిగజారిపోయావు. ఇది సామాన్యం అంటూనే, అన్ని కుటుంబాల్లో జరిగేదే అంటూనే తల్లి-చెల్లిని కోర్టుకు ఈడ్చాడు. ఇది సామాన్యమైన విషయం కాదు సార్’’ అని నిక్కచ్చిగా నిందలు వేసింది స్వయంగా ఆయన మాజీ ముద్దుల చెల్లెమ్మ షర్మిల! దీనికి సంబంధించి సోషల్‌మీడియాలో జగన్‌ను విమర్శిస్తూ వస్తున్న పోస్టులు, గ్రాఫిక్స్ జగన్‌ను మహిళలకు దూరం చేసేలా ఉన్నాయన్న ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది.

మరి ఇందులో మీడియాకు ఏం సంబంధం ఉందని, వారిపై జగన్ విమర్శలు కురిపించారో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. తల్లి-చెల్లికి ఇస్తానన్న షేర్లు ఇచ్చేది లేదంటూ.. జగన్ స్వయంగా సంతకం పెట్టి, ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్‌పైనే కదా మీడియా కథనాలు రాసింది. దానిపై డిబేట్లు పెట్టింది. జగన్ సొంత మీడియా కూడా గతంలో ఇదే మాదిరిగా, చంద్రబాబు, పవన్, లోకేష్‌పై కథనాలు వండివార్చింది.

ఇంకొంచెం వెనక్కి వెళితే.. అనారోగ్యంతో ఉన్న చంద్రబాబునాయుడు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు దగ్గరకెళ్లి, ఆయన నోటి దగ్గర గొట్టం పెట్టిన జగన్ మీడియా.. ఆయనతో సొంత అన్న చంద్రబాబును తిట్టించింది. దానిని తర్వాత నానా రచ్చ చేసింది. ఆ తర్వాత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రామోజీరావు కొడుకు సుమన్ కొడుకుతో, అదే జగన్ మీడియా తండ్రిని తిట్టించింది. బుల్లితెర నటుడు ప్రభాకర్‌తో కలసి నిలువెత్తు పేజీలో ఇంటర్వ్యూ రాసింది. తామిద్దరం రాముడు-సీత లాంటివాళ్లమని చెప్పించడం ద్వారా, సుమన్ వ్యక్తిత్వాన్ని హననం చేసింది. లోకేష్ విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫొటోలతో నానా యాగీ చేసింది. ఎన్నికల ముందు ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మృతి చెందారు.

అయితే దానిని కూడా చంద్రబాబుతో ముడిపెట్టిన జగన్ మీడియా, ప్రధానంగా గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి గులేబాకావలి కథనాలు వండివార్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 54లోని, ఫలానా సర్వే నెంబర్‌లోని 6 ఎకరాల భూమి గురించి లోకేష్ ఆమెను దూషించారని రాశారు. హెరిటేజ్‌లో ఆమె పెట్టిన 500 కోట్ల పెట్టుబడికి సంబంధించి చంద్రబాబు ఆమెను బెదిరించారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవేందర్‌రెడ్డి ట్వీట్ చేశారు.

తర్వాత మీడియా ప్రతినిధులు రంగంలోకి దిగి, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 54లోని ఫలానా సర్వే నెంబర్‌లోని, 6 ఎకరాల భూమి గురించి ఆరా తీస్తే.. అసలు అక్కడ అంత స్థలం లేదని తేలిపోయింది. అంటే ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేసినట్లు ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతుంది.

కానీ ఇప్పుడు స్వయంగా తన సొంత తల్లి,చెల్లి జమిలిగా తనపై విరుచుకుపడి.. నీకు విశ్వసనీయత-విలువలేవని దుమ్ము దులిపేస్తుంటే.. దానికి నేరుగా-సూటిగా తల్లీచెల్లికి సమాధానం ఇవ్వకుండా, ఎన్‌సీఎల్‌టీలో జగన్ వేసిన పిటిషన్‌నే రాసిన మీడియాను విమర్శించడమే వింత. అంటే తన మీడియా ఇతరులపై రాస్తే, అది జాతి ప్రయోజనాల కోసం.. అదే తన కుటుంబంపై మీడియా రాస్తే అది గోల. బురద! ఇదేం సిద్ధాంతమన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

ఇక విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్.. తన కుటుంబ రగడ గురించి మీడియా చేస్తున్నరచ్చ గురించి బోలెడంత ఆవేదన వ్యక్తం చేశారు. మీకు అక్కాచెల్లెళ్లు లేరా అని అడిగినంత పనిచేశారు. మీ ఇంట్లో ఇవి జరగవా అని మీడియా యాజమాన్యాలను ప్రశ్నించారు.

అంటే తాను బురదలో ఉన్నందున, మిగిలిన వారికీ ఆ బురద అంటించాలన్నదే జగన్ అసలు లక్ష్యమన్నది విశ్లేషకుల వ్యాఖ్య. జగన్ చెప్పింది నిజమే. కలహాలు-మనస్పర్ధలు అన్ని చోట్లా ఉంటాయి. ఆయన ప్రశ్నించిన మీడియా అధిపతుల ఇళ్లలో కూడా ఉండి ఉండవచ్చు. కానీ జగన్‌కు ఉండకూడదు. ఉండటానికి వీల్లేదు కూడా! చాలామంది జగన్లు.. తల్లి-చెల్లిని మెడబట్టి బయటకు గెంటవచ్చు. వారి ఆస్తులు కాజేయవచ్చు. కానీ విలువలు-విశ్వసనీయత గోతాలకు గోతాలు, టన్నులకు టన్నులున్న పులివెందుల ముద్దుబిడ్డ జగన్ ఇంట్లో మాత్రం అవి ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఆదర్శప్రాయుడైన అన్న. కొడుకుగా ఉండాలని మహిళలు కోరుకుంటారు కాబట్టి!

నా తల్లులు, నా అక్క చెల్లెమ్మలంటూ పలవరించి, వారి నెత్తిన చేయి-ముద్దులు పెట్టే జగనన్నయ్యలో అక్కచెల్లెమ్మలు.. ఆస్తులు పంచే అన్నయ్యను చూస్తారే తప్ప, ఇచ్చిన ఆస్తులు గుంజుకునే పాత సినిమాలో విలన్ అన్నయ్యను చూడలేరు. ఎందుకంటే జగన్ తన గురించి తాను ఇప్పటిదాకా ఇచ్చుకున్న బిల్డప్ అది మరి!

ఇప్పుడు అందుకు భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నందుకే, అక్కచెల్లెమ్మల్లో అన్నయ్య ఇమేజీ దారుణంగా డామేజీ అవుతోంది. తల్లి-చెల్లికి ఇచ్చిన ఆస్తులు లాగేసుకునేందుకు, వారిని కోర్టుకు ఈడ్చిన జగన్.. వారి దృష్టిలో ఇకపై అఖిలాంధ్రకోటి అన్నయ్య’ ఎలా అవుతారన్నది మహిళల ప్రశ్న.

అసలు తనపై చెల్లి సంధించిన ప్రశ్నలకు జగన్ సమాధానం ఇవ్వకుండా, పేర్ని నానితో మాట్లాడించడమే ఆశ్చర్యం. నాని కాకుండా ఏ రోజాతోనో, ఏ లక్ష్మీపార్వతతితోనో, ఏ కల్యాణితోనో, ఏ విడదల రజనీతోనే మాట్లాడిస్తే బాగుండేది. ఎస్సీ లీడర్లపై ఎస్సీలను, బీసీలపై బీసీలను, కమ్మవాళ్లపై కమ్మవాళ్లతో తిట్టించే సూత్రం.. మహిళ ను మహిళతో తట్టించాలన్న ఆలోచన జగన్‌కు రాకపోవడమే విచిత్రం.

మీడియోముందుకొచ్చిన పేర్ని నాని.. దివంగత వైఎస్ తన ఆస్తులను పిల్లలు, భార్యకు అప్పుడే పంచేశారని, ఇప్పుడు ఉన్నవన్నీ జగన్ రెక్కలకష్టంతో, తినీ తినకుండా కడుపుకట్టుకుని సంపాదించిన ఆస్తులేనని సెలవిచ్చారు. వాటిలో కొన్ని వివరాలు కూడా వెల్లడించారు. చెల్లి షర్మిలంటే ప్రేమానురాగాలున్నందుకే, తన షేర్లు రాసిచ్చారని చెప్పిన పేర్ని… మళ్లీ వాటిని ఎందుకు లాక్కునే ప్రయత్నం చేశారో చెప్పలేదు.

ఇన్నేసి అంతఃపుర రహస్యాలు చెప్పిన నాని.. అసలు అన్నా చెల్లెలు ఎందుకు విడిపోయారు? తల్లిని ఎందుకు వెళ్లగొట్టారు? సొంత చెల్లి కంటే అవినాష్‌రెడ్డి ఎందుకు ఎక్కువయ్యారు? అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తే జగన్ ఎందుకు ఆగ్రహించారు? వంటి ీ‘సక్రెట్ రహస్యాలు’ కూడా చెబితే బాగుండేది. బహుశా ప్రెస్‌మీట్‌లో పేర్ని వారి పాత్ర, దానికే పరిమితం చేసినట్లున్నారు మరి.

తాజాగా అసలు తన తండ్రి వైఎస్, తమకు ఏయే ఆస్తులు పంచారు అన్న అంశంపై వైఎస్ అభిమానులకు రాసిన లేఖలో షర్మిల స్పష్టత ఇచ్చారు. ‘అవేమీ నీ సొంత ఆస్తులు కావు. నువ్వు కష్టపడి సంపాదించినవి కాదు. మా నాన్న సొమ్ము. వాటిని నువ్వు ఇచ్చేదేమిటి? నువ్వు జస్ట్ వాటికి గార్డియన్‌వి మాత్రమే’నని తేల్చిపారేశారు. షర్మిల తన తాజా లేఖలో ఆస్తులపై ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా జగన్, వాటికి సమాధానం ఇవ్వలేదంటే.. సింహం సిగ్గుపడినట్లే లెక్క అన్నది బుద్ధిజీవుల ఉవాచ.

అన్నాచెల్లెలు ప్రాపర్టీ ఎపిసోడ్ రోడ్డెక్కడంతో, మహిళాలోకంలో జగనన్న ఇమేజీకి భారీ డామేజీ జరుగుతోందని వైసీపీ పెద్దలు తల పట్టుకుంటున్నారు. ‘‘తల్లి-చెల్లిని గెంటేసి, వాళ్లకు ఇచ్చిన షేర్లు కూడా గుంజుకునే అన్నను, ఏ తల్లి, అక్కచెల్లెమ్మలు అభిమానిస్తారు? ఇది మా పార్టీకి భారీ డామేజీనే. అసలు షర్మిలపై పేర్ని నానితో మాట్లాడించడం ఏమిటి? జగన్ గారు మాట్లాడితేనే కన్విన్సింగ్‌గా ఉండేది. ఇది వాళ్ల ఫ్యామిలీ మ్యాటర్. ఏం జరిగిందో మాకేమీ తెలియదు కదా?

ఏదో ఇచ్చిన నోట్ మాట్లాటడమే తప్ప, మీడియా వాళ్లు ఏదైనా ప్రశ్నలు వేస్తే మేం ఏం సమాధానం చెప్పగలం? అసలు దీనిపై పార్టీ నేతలు కాకుండా నేరుగా జగన్ గారో, భారతమ్మ గారో మాట్లాడితేనే బాగుంటుంది. కనీసం భారతమ్మ పేరుతో ఒక నోట్ విడుదల చేసినా బాగుండేది. ఆ విషయం జగన్ గారికి చెప్పేవాళ్లెవరు?’’ అని ఓ మాజీ మంత్రి వాపోయారు.

ఒక తల్లి.. ఒక కొడుకు.. ఒక ట్వీట్
‘‘తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం, మూర్తీభవించిన మాతృమూర్తులందరికీ వందనాలు’’
– ఇది మదర్స్‌డే రోజు, వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్.
అమ్మపై అంత ప్రేమానురాగాలు కురిపించిన జగనన్న.. ఇప్పుడు అదే అమ్మను కోర్టుకు ఈడ్చడం ఏంటని ఆశ్చర్యపోవడం సహజమే. ఆయన కోర్టు పిటిషన్ భాషలోనే చెప్పాలంటే.. అవును. ఇప్పుడు అమ్మపై ప్రేమానురాగాలు కరిగిపోయాయి మరి! స్టేట్‌మెంట్లు మార్చనివాడు పొలిటీషియనే కాదు పొమ్మన్న గిరీశం ఉపదేశం.. పులివెందుల బిడ్డకు బాగా వంటబట్టినట్లుందన్నది అక్కచెల్లెమ్మల ఉవాచ.

జగన్ ఆత్మలతో మాట్లాడతారా?
వైసీపీ అధినేత జగన్‌కు ఆత్మలతో మాట్లాడటం తెలుసా? కొంపతీసి కేరళకు వెళ్లి, అలాంటి మంత్ర తంత్రాలు నేర్చుకున్నారా? ఇప్పుడు ఈ చర్చ సోషల్‌మీడియాలో తెగ నడుస్తోంది. గతంలో నేను రాత్రి వేళల్లో నాన్నతో మాట్లాడతానని చె ప్పిన జగన్.. ఇప్పుడు రెండు నెలల క్రితం చనిపోయిన ఈనాడు అధినేత రామోజీరావు ఆత్మతో కూడా మాట్లాడుతున్నారా? అన్న ఇంకో కొత్త అనుమానం, ఆయన మాటలతో నిజమైంది. తాజా ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన జగన్.. ‘అయ్యా ఈనాడు రామోజీరావు‘ అని సంబోధించడమే దానికి కారణం. ఎప్పుడో చనిపోయిన రామోజీని కూడా పిలుస్తున్నారేంటబ్బా? కొంపతీసి అన్నియ్య వాళ్ల నాన్నతో మాట్లాడినట్లే, రామోజీ ఆత్మతో మాట్లాడుతున్నారా ఏంటి’’ అని నెటిజన్లు సైటైర్లు విసురుతున్నారు.
* * *
ఒక వూళ్ళో ఒక దొంగ కుటుంబం ఊరివాళ్ళందరిని పిలిచి పంచాయితీ పెట్టింది. వాళ్ళు ఆ వూళ్ళో దోచుకొన్న సొమ్ము ఎలా పంచుకోవాలో చెప్పండి అని అడుగుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఆ సొమ్ము పోగొట్టుకొన్న వాళ్ళందరూ వచ్చి, ఎవరెవరికి ఎంత న్యాయంగా రావాలో లెక్కలు కడుతున్నారు.

కొసమెరుపు: ఈ కథకు ప్రస్తుతం కోర్టుకెక్కిన పులివెందుల ఎపిసోడ్‌కూ సంబంధం ఉందా అని అడగకండి.

LEAVE A RESPONSE