-ఢిల్లీలో జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతలు,అసవరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి
అమరావతి, నవంబర్, 25: ఢిల్లీ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతలు,అసవరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్య,వైద్యం,సామాన్య ప్రజలకు అండగా ఉండడంపైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. మూలధన వ్యయంపై ఇచ్చే స్వల్పకాలిక రుణాలను వచ్చే ఏడాదికి కూడా పొడిగించాలన్న ప్రతిపాదనను సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ సుజన సవ్రంతికి నిధులు ఇవ్వాలని కోరినట్లు మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా గృహ నిర్మాణాలకు నిధులిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర భాగస్వామ్యం లేనందున ఈ అంశాన్ని కూడా పీఎంఏవైలో చేర్చాలని సూచించిన విషయాన్ని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న పోలవరం, సుజల స్రవంతి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి మరింత దృష్టి పెట్టి కేంద్రం సహకరించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం తోడ్పాటునందించే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడంలో కేంద్రం చొరవతీసుకోవాలని కోరామన్నారు. యువతకు ఉపాధి అందించే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధిలో కేంద్రం మరింత సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట్రాల ద్వారా 62 శాతం కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే, రాష్ట్రాలకు అదే 62 శాతం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నందున జీఎస్టీ వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపమని కోరినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు.