Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరి ప్రజలిచ్చే మెజారిటీనే నాకు కొండంత బలం

మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఆర్కే చేతగాని మాటలు
పరిశ్రమలు తెచ్చి, ఉద్యోగాలిచ్చి మేమేంటో నిరూపిస్తాం
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చే మెజారిటీనే కొండంత బలాన్నిఇస్తుంది, రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి మంగళగిరి సమగ్రాభివృద్ధికి నేను చేపట్టబోయే కార్యక్రమాలకు ఊతమిస్తుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పూజిత అపార్ట్ మెంటు వాసులతో యువనేత శనివారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మంగళగిరికి పరిశ్రమలు రావని ఎమ్మెల్యే ఆర్కే చేతగాని మాటలు మాట్లాడుతున్నారు, అలాంటి అవకాశం లేకపోతే కాంటినెంటల్ కాఫీ, కోకోకోలా యూనిట్, ఆటోనగర్ లో గత ప్రభుత్వ హయాంలో ఐటి పరిశ్రమలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గత అయిదేళ్ల విధ్వంసక పాలనతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమగానీ, ఒక్క ఉద్యోగం గానీ రాలేదు. పరిశ్రమలు ఎలా తేవాలన్న ఆలోచన పాలకులకు లేదు. దీంతో ఉద్యోగాల కోసం మన పిల్లలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.

అధికారంలో లేకపోయినా గత అయిదేళ్లుగా 29 సంక్షేమ పథకాలు అమలుచేశా. ఒక ఐటి కంపెనీని రప్పించి 150 మందికి ఉద్యోగాలు కల్పించా. చేనేతల కోసం వీవర్స్ శాలను ఏర్పాటుచేసి, టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. దేశంలోనే మేటిగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని వనరులు మంగళగిరిలో ఉన్నాయి. ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుచేస్తాం. దీనిద్వారా 40వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయి. అప్పులు చేసి సంక్షేమం చేయడంవల్లే ప్రజలపై వివిధ పన్నులు, ఛార్జీల రూపంలో భారం పడుతోంది. అభివృద్ధి ద్వారా సంపద సృష్టించి సంక్షేమం చేయాలన్నదే టిడిపి విధానం. కష్టసాధ్యమైనా ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం.

అయిదేళ్లలో పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించడం ద్వారా 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. దీనిద్వారా రాష్ట్ర సంపద రెండున్నర రెట్లు వృద్ధి చెంది, ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని అందించగలమని అన్నారు. ఎయిర్ పోర్టు అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు అధికారంలోకి వచ్చిన 2నెలల్లో అమరావతిలో భూమి కేటాయిస్తామని లోకేష్ చెప్పారు.

లోకేష్ దృష్టికి అపార్ట్ మెంటు వాసుల సమస్యలు

పూజిత అపార్ట్ మెంట్ వాసులు లోకేష్ కు సమస్యలను చెబుతూ… మా అపార్ట్ మెంట్ సమీపంలో రిటైనింగ్ వాల్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుచేయాలి. తక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారికి సెట్ బ్యాక్ నిబంధనలు సవరించాలి. అపార్ట్ మెంట్ యజమాని ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంతో రెండున్నర కోట్ల సొంతనిధులతో అభివృద్ధి చేసుకున్నాం. డాక్యుమెంట్లు యజమాని వద్దే ఉంచుకొని ఇబ్బంది పెడుతున్నారు. అమరావతిని కల్చరల్ అండ్ హెరిటేజ్ సెంటర్ గా అభివృద్ధి చేయాలి. రివర్ ఫ్రంట్ ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేయాలి.

1950కి ముందే మంగళగిరి ప్రాంతంలో పెయింటింగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పసుపు ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. వాటర్ స్పోర్ట్స్, గేమ్స్ అభివృద్ధి చేయాలి. సీనియర్ సిటిజన్లకు వైద్య సౌకర్యం కల్పించాలి. అమరావతిలో విట్, ఎస్ఆర్ఎం తదితర విద్యాసంస్థలకు వెళ్లే రహదారి అడవిని తలపిస్తోంది. ఈ రోడ్డును సొంతగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదు. డిజిటల్ లైబ్రరీ, వర్క్ షాపు, రీసెర్చి సెంటర్ ఏర్పాటుచేయాలని కోరారు.

యువనేత లోకేష్ మాట్లాడుతూ… అధికారంలో వచ్చాక అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేస్తాం. కృష్ణానది ఎగువన, ప్రధాన కాల్వపై చెక్ డ్యామ్ లు ఏర్పాటుచేస్తాం. కొండ ప్రాంతాల్లో హైకింగ్ ట్రయల్స్ ను అభివృద్ధి చేస్తాం. రాబోయే అయిదేళ్లలో దేశంలోనే మేటిగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని నారా లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE