కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు మొదలైన నామినేషన్ల పర్వం

నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అలాగే 7 కార్పొరేషన్‌లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు, ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా, ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. శనివారం నామినేషన్ల పరిశీలన చేపటనున్నారు. పోటీ చేయని అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.
ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.
• శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం
• పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు
• కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి
• గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల
• ప్రకాశం జిల్లా దర్శి
• చిత్తూరు జిల్లా కుప్పం
• కర్నూలు జిల్లా బేతంచర్ల
• వైఎస్సార్‌ జిల్లా కమలాపురం, రాజంపేట
• అనంతపురం జిల్లా పెనుకొండ