Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ కు శ్రీకాకుళం ప్రజల వినతుల వెల్లువ

శ్రీకాకుళం: శంఖారావం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన యువనేత లోకేష్ కు వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఇస్లాం బ్యాంక్ ద్వారా మైనార్టీల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, టీడీపీ అధికారంలోకి వస్తే తమవర్గం సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని యువనేతను కోరారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని శ్రీకాకుళం జిల్లా టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున న్యాయవాదులు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం వల్ల పేదలు, బడుగు, బలహీనవర్గాల వారికి అన్యాయం జరుగుతుందని, ఆస్తులపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ఉత్తరాంధ్రలో నివసించే తెలగ కులస్థులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, తమ కులాన్ని బీసీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని ఆ వర్గ ప్రతినిధులు యువనేతను కలిసి కోరారు.

టీటీడీ బోర్డు మెంబర్ గా పద్మశాలీలకు అవకాశం కల్పించాలని, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని శ్రీకాకుళం జిల్లా పద్మశాలీ సంఘం సభ్యులు యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. కళింగ కోమటి కులానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాలని, తమ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్పించేందుకు కృషిచేయాలని ఆ సంఘం ప్రతినిధులు యువనేతను కోరారు.

సొండి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చడంతో పాటు ప్రత్యేక బీసీ కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఆదుకోవాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. అందరి సమస్యలు సావధానంగా విన్న లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE