Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ కు నరసన్నపేట ప్రజల విన్నపాలు

నరసన్నపేట: నరసన్నపేట నియోజకవర్గంలో వివిధ వర్గాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. మీ సేవ నిర్వాహకులు తమ సమస్యలను విన్నవిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము రోడ్డున పడ్డామని, మీరు అధికారంలోకి వచ్చాక తిరిగి తమ సేవను సమర్ధంగా వినియోగించుకోవాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ దివ్యాంగ విభాగం ప్రతినిధులు తమ సమస్యలను తెలియజేస్తూ.. దివ్యాంగులకు అంత్యోదయ రైస్ కార్డుల ద్వారా నెలకు 35 కిలోల బియ్యం అందించాలని, రూ.5 లక్షలతో పక్కా గృహాలు నిర్మించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లా యాదవ సాధికార సమితి సభ్యులు తమ సమస్యలు చెబుతూ.. యాదవులను బీసీ-డి నుంచి బీసీ-బికు లేదా, ప్రత్యేక కేటగిరీకి మార్చాలని, గొర్రెల కాపలాదారులు ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోతే రూ.15 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, నిరుద్యోగులైన యాదవ యువకులకు 50 శాతం సబ్సీడీతో రుణాలు ఇప్పించాలని కోరారు. గోపాల మిత్ర పథకాన్ని పునరుద్ధరించి, గోపాల మిత్రలకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

సీపీఎస్ తో పాటు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మోసపూరిత జీపీఎస్ ను కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. అందరి సమస్యలను సావధానంగా విన్న యువనేత.. త్వరలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE