Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులు వెంటనే వచ్చారు

రేపల్లె రైల్వే స్టేషన్‌లో అత్యాచారయత్నానికి గురై, ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన మంత్రులు  తానేటి వనిత,  ఆదిమూలపు సురేష్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ శ్రీమతి వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హోం మంత్రి వనిత.

పోలీసులు వెంటనే వచ్చారు:
– బాధితురాలు, ఆమె భర్త అర్ధరాత్రి ఊరికి వెళ్లే సదుపాయం లేకపోవడంతో నిన్న అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్‌లో పడుకున్నారు.
– మద్యం సేవించిన ముగ్గురు, ఆ మహిళపై కన్నేసి, అక్కడికి వచ్చి బాధితురాలి భర్తను టైమ్‌ అడిగినట్లు అడిగి, ఆయన మీద దాడి చేసి తన దగ్గర ఉన్న డబ్బు దోచుకున్నారు.
– తన భర్తపై దాడిని ఆపాలని ఆమె అడ్డుపడితే ఆ దళిత మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయారు. దాంతో ఆమెను కాపాడుకునేందుకు ఆమె భర్త అందరి దగ్గరికి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే స్టేషన్‌లో పడుకున్న వేరే ప్రయాణికులను కోరినా, వారు ముందుకు రాలేదు.
– దీంతో ఆయన రైల్వే స్టేషన్‌ బయట ఉన్న రిక్షావాళ్ల సూచన మేరకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో, వారు పెట్రోలింగ్‌ వాహనంతో వస్తుండగా, ఆ సైరన్‌ విని పారిపోయారు.

నేతాజీ కాలనీలో వెంటనే ఆరా:
– రైల్వే స్టేషన్‌ సమీపంలో నేతాజా కాలనీ ఉంది. అక్కడ ఉన్న నేర చరిత్రుల గురించి పోలీసులు ఆరా తీశారు.
– కాలనీలోకి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎవరైనా మద్యం సేవించి వచ్చారా? అని పోలీసులు ఆరా తీయగా ముగ్గురి గురించి తెలిసింది.

6 గంటల్లోపే అదుపులో నిందితులు:
– దీంతో వారిని ఉదయం 7 గంటల్లోపే వారిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 1 గంటకు ఫిర్యాదు రాగా, చాలా వేగంగా స్పందించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
– ఆ విధంగా కేవలం 6 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

పక్కాగా కేసుల నమోదు:
– 376 (డి) ప్రకారం గ్యాంగ్‌రేప్, బాధితురాలి భర్త దగ్గర డబ్బు దోచుకున్నారు కాబట్టి జీ–94 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేశాం.
– ఆమె భర్తపై దాడి చేశారు కాబట్టి, సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశాం.
– పోలీసులు చాలా వేగంగా స్పందించారు కాబట్టి, బాధితురాలిని సకాలంలో ఆదుకోగలిగాం.

ఇప్పటికే సహాయం:
– బాధితురాలిని ఇప్పుడే ఆస్పత్రిలో పరామర్శించాము. ఆమె 7 నెలల గర్భిణి కావడంతో, అనుకోని దుర్ఘటనతో ఆమె ఇబ్బంది పడుతోంది.
– నిన్ననే ఆమెకు రూ.2 లక్షల సహాయం చేశాం. నిందితుల్లో ఇద్దరు ఎస్సీ, మరొకరు యాదవ కులస్తుడు.
– అత్యాచార ప్రయత్నం జరిగింది కాబట్టి, అత్యాచారాల నిరోధ చట్టం ప్రకారం బాధితురాలికి రూ.8.50 లక్షల పరిహారం అందుతుంది. ఆ ప్రకారం ఇప్పుడే ఆమెకు అందులో సగం రూ.4.12 లక్షలు ఇచ్చాం
– అదే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా మరో రూ.50 వేలు వస్తాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడే రూ.12 వేలు ఇచ్చాం.
– మరోవైపు జిల్లాకు చెందిన మున్సిపల్‌ మంత్రిగారు వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు.

వదిలిపెట్టబోం:
– ఎట్టిపరిస్థితుల్లోనూ నిందితులను వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఈ ఘటన జరిగింది రైల్వే స్టేషన్‌లో. కాబట్టి అక్కడ భద్రత బాధ్యత రైల్వే పోలీసులది.
– అయినప్పటికీ రాష్ట్ర పోలీసులు చాలా వేగంగా స్పందించారు. బాధితురాలని కాపాడారు.

పాత నేరస్తులపై నిఘా:
– ఈ దాడులన్నీ కూడా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిపైనే జరుగుతున్నాయి.
– విజయవాడలో అత్యాచారానికి గురైన బాలిక, మానసిక దివ్యాంగురాలు కాగా, ఈ మహిళ దళితురాలు.
– ఇక్కడ రాత్రి ఈ ఘటనకు పాల్పడింది పాత నేరుస్తులే. అందుకే ఇక నుంచి అన్ని చోట్లా పాత నేరస్తులపై దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశిస్తున్నాం.

దిశ అమలు కాకపోవడం వల్లనే:
– ఇలాంటి దుర్ఘటనల్లో దర్యాప్తు, విచారణ చాలా వేగంగా జరిగి, నిందితులకు శిక్ష పడే విధంగా దిశ చట్టం రూపొందించాం.
– కానీ కేంద్రం క్లియరెన్స్‌ రాకపోవడంతో, చట్టం అమలు కావడం లేదు.
– రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కానీ పలు ఘటనల్లో ఆ పార్టీ వారే బాధ్యులుగా తేలుతున్నారు.
– ఈ విషయాన్ని విపక్షం గుర్తించాలి. అర్థం లేని విమర్శలు విడనాడాలి.

LEAVE A RESPONSE