Suryaa.co.in

Andhra Pradesh

మహిళాభివృద్ధితోనే సమాజ పురోభివృ

– మహిళల భద్రత, గౌరవం, సాధికారత లక్ష్యం
– రామచంద్రపురంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
– మహిళలపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు
– మహిళల రక్షణ కోసం శక్తి యాప్
– కార్మిక శాఖ మంత్రి సుభాష్

రామచంద్రపురం : సృష్టికి మూలం, అన్నిటిలో సగభాగం ఐన మహిళలు నింగి నుంచి నేలదాకా అన్ని రంగాల్లో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతున్నారని, మహిళల భద్రత, గౌరవం, సాధికారత లక్ష్యంగా, మహిళా అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సుభాష్ అన్నారు.

సోమవారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రామచంద్రపురం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు డాక్టర్ చెలికాని రామారావు స్మారక భవనంలో ఐసిడిఎస్ సిడిపిఓ వరహాలక్ష్మి అధ్యక్షతన వైభవంగా, కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పని చేస్తుందన్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం రూ. 4,332 కోట్లు హెచ్చించిందన్నారు. మహిళలు శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో రక్షణ పొందాలని సూచించారు.

మహిళలు ఉన్నతంగా చదువుకోవాలని, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. భారత సంతతికి చెందిన హ్యోమగామి సునీతా విలియమ్స్, మదర్ థెరిసా,ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్త్రీ లేకుండా సృష్టి లేదని, మహిళలు విద్యతోనే మనుగడ సాధించగలరన్నారు.

కుటుంబ వ్యవస్థను సక్రమంగా నడపగలిగిన సత్తా, ఘనత మహిళకే సాధ్యమన్నారు. మహిళకు ఆస్తి హక్కు కల్పించడం ద్వారా పురుషులతో సమాన హోదా కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అంగన్వాడీలు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్ ను, మరో అతిధి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీనాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్, ఎంఈఓ నాగేశ్వరి, డాక్టర్ కవిత, అంగన్వాడి అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దుర్గ, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు వీరలక్ష్మి, సూపర్వైజర్లు, టీచర్లు ఆయాలు పాల్గొన్నారు. అనంతరం కేకు కోసి శుభాకాంక్షలు తెలియజేశారు.

మహిళలకు మెండుగా ఉపాధి అవకాశాలు
రామచంద్రపురం నియోజవర్గంలోని మహిళలకు ఆర్థిక పరిపుష్టి కలిగేలా త్వరలో 30 చిన్న,మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు రానున్నాయని మంత్రి సుభాష్ వెల్లడించారు. వీటి ఏర్పాటుతో మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఇప్పటికే కుట్టు మిషన్ శిక్షణ, ఎంబ్రాయిడరీ, బ్యూటీ పార్లర్, ఆర్గానిక్ ఫార్మింగ్, పచ్చళ్ళు తయారీ వంటి శిక్షణ ఇచ్చేందుకు కృషి జరుగుతుందన్నారు.

శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అర్హులైన మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుపేదలు లేని, నిరుద్యోగం లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని తన ఆశయమని మంత్రి సుభాష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE