– కమలం క్యాడర్లో కొత్త జోష్ నింపుతున్న రామచందర్‌రావు
– ఆయన నడిచొచ్చే కమలం జెండా.
– అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటి నుంచి జిల్లాల్లో విస్తృత పర్యటనలు
– అక్కరకొస్తున్న ఏబీవీపీ బంధం
– పర్యటనల్లో జనంతో మమేకం
– వందరోజుల్లో జిల్లాలను చుట్టేసిన ‘రామన్న’
– నేతలను హైదరాబాద్‌లో ఉండవద్దని ఆదేశం
– కాంగ్రెస్ సర్కారుపై ‘లాయర్ సాబ్’ కదనం
హైదరాబాద్: కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు రాంచందర్ రావు ప్రయాణం పార్టీలో కార్యకర్తల సేవలకు గుర్తింపు లభిస్తుందనడానికి తార్కాణం. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికై గళమెత్తుతూ సాగుతుంది రాంచందర్ రావు ప్రయాణం. రాంచందర్ రావు ని గమనిస్తే.. ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన నడిచొచ్చే కమలం జెండా.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తిచేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునుండే ఆయన దూకుడుతో, నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు, ర్యాలీలు, సదస్సులు, ప్రజాసమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ, మెదక్, ఖమ్మం, వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయినుండి జెడ్పీటీసీ దాకా బిజెపి అభ్యర్థులు బలంగా పోటీ చేసేలా పార్టీని సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి జెడ్పీటీసీ వరకు బీజేపీ ప్రత్యక్షంగా పోటీ చేస్తుందని, అభ్యర్థులను గెలిపించే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ, తెలంగాణకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు.
జీఎస్టీ తగ్గింపు ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఈలు లాంటి వర్గాలకు లబ్ధి చేకూర్చేలా తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ళు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, మహిళా పొదుపు సంఘాలకు బ్యాంక్ రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు కేంద్ర సహకారంతోనే జరుగుతున్నాయని తెలిపారు.
‘పల్లె నిద్ర’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతూ, గ్రామాల నాడి తెలుసుకుంటూ, ప్రతి నియోజకవర్గంలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడ్డారు.
రైతులకు ఎరువులను సక్రమంగా సరఫరా చేయకుండా, బ్లాక్ మార్కెట్‌కి తరలించేందుకు కారణమవుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సకాలంలో రైతులకు ఎరువులు అందేలా చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని, బీసీ రిజర్వేషన్లలో అవ్యవస్థలను ఎండగడుతూ, రైతులకు ఎరువులు అందేలా ఒత్తిడి తీసుకువచ్చి ప్రజా సమస్యల పక్షాన నిలిచారు. జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి, చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూర్చిన మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించారు. రాజకీయ జీవితంలో నాలుగు దశాబ్దాలుగా నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజా సేవకు అంకితమైన ఈ జాతీయవాది, ఇప్పుడు తెలంగాణలో బిజెపి ని ప్రతి పల్లె, ప్రతి ఇంటి దాకా తీసుకెళ్లే రథసారథిగా ముందుకు నడిపిస్తున్నారు.
కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా నాలుగు దశాబ్దాల ప్రయాణం అపూర్వంగా నిలుస్తోంది. విద్యార్థి నేతగా రాడికల్లతో పోరాడి, ప్రజాసేవలో క్రమశిక్షణతో ఎదిగిన నాయకుడు రాంచందర్ రావు. రాష్ట్రంలో అధికార పీఠం సాధించడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నారు. పుట్టుక నుంచీ సిద్ధాంతానికి నిబద్ధుడైన నిఖార్సైన జాతీయవాది. విద్యార్థి దశ నుంచే దేశానికి అంకితమైన కాషాయ సైనికుడు, ఇప్పుడు రాష్ట్ర బిజెపి కి సారథ్యం వహిస్తున్నారు.
రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదల సమస్యలపై అడుగడుగునా పోరాడుతూ బిజెపి ని ఇంటింటికీ, ప్రజా మనసుల్లోకి తీసుకెళ్తూ కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని అందరు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం కల్పిస్తూ బీజేపీని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేర్చే దిశగా ఎన్. రాంచందర్ రావు కృషి చేస్తున్నారు.