నిన్న రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సీఆర్డీఏ భవనంలోకి వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. వారు వెళ్లి మరి కొందరికి చెప్పారు. తండోపతండాలుగా వచ్చి తిరిగి, ఫోటోలు తీసుకున్నారు.
ఈ రోజు ఉదయం వెళ్లలేని ఒక రైతు మాట్లాడుతూ.. “మా వాళ్లు వెళ్లారండి. వామ్మో.. అమెరికాలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా.. భూతల స్వర్గం లాగా ఉంది అని అంటున్నారు. మీరు కూడా వెళ్లి రండి సార్” అని అన్నారు.
అక్కడ పిల్లలతో పోటీపడుతూ సంబరంగా పెద్దలు కూడా ఫోటోలు దిగగడాన్ని గమనిస్తున్న మరొక వ్యక్తి చెబుతూ.. ఓ చిన్నారి సంతోషంగా సెల్ఫీలు తీసుకొంటుంటే.. “బాగా చదువుకొని ఇలాంటి ప్లేసులో ఉద్యోగం తెచ్చుకొంటే ఎంతబావుంటుంది కదా..” అని ఆ చిన్నారి తల్లి అన్నారట.
పొలం పనులకు వెళ్లాలని ఇంకా వేకువన దిగ్గున లేచి కూర్చుని, మళ్లీ మన పొలాలు రాజధానికి ఇచ్చేశాం కదా అని సర్ది చెప్పుకొంటూ ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. తరాలుగా వచ్చిన తమ భూముల్లో వెలసిన తొలి శాశ్వత భవనం అది మరి, వారి ఆనందం అలాగే ఉంటుంది.
సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించాక ఉపన్యాసం చివరలో ఇది ఆరంభం మాత్రమే అంటూ.. జై అమరావతి అని నినదిస్తూ జై జై అమరావతి అంటూ అమరావతి మానసపుత్రిక తండ్రి చంద్రబాబు కూడా భావోద్వేగానికి గురయ్యారు.