Suryaa.co.in

Telangana

అసలు దోషి టీఆర్ఎస్ ప్రభుత్వమే

– 17 రాష్ట్రాల్లో వ్యాట్ ను తగ్గించినా కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదు?
– యూపీ తరహాలో పెట్రోలు, డీజిల్ పైనా వ్యాట్ తగ్గించాల్సిందే
– లేనిపక్షంలో ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
– వంట నూనెలపైనా ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఘనత కేంద్రానిదే
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు రూ.5, డీజిల్ పై రూ.10 ల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించకపోవడం సిగ్గుచేటు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ దేశంలోని 17 రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్ పై ఇప్పటికే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయి. ఉత్తర ప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ.12, డీజిల్ పై రూ.12 లను తగ్గిస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుని ప్రజలకు ఊరట కలిగించింది.
త్రిపుర, సిక్కిం, కర్నాటక, హర్యానా, గోవా, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, పుదుచ్చేరి, అసోం, గుజరాత్, మణిపుర్ రాష్ట్రాలు లీటర్ పెట్రోల్ పై రూ.7లు, డీజిల్ పై రూ.7లు తగ్గించాయి. అరుణాచల్ ప్రదేశ్, గోవా, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలు సైతం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను రూపాయి నుండి రూ.5 వరకు తగ్గించాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వ్యాట్ ను తగ్గించకపోవడంవల్లే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రోలు, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి.
హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతిరోజూ టీఆర్ఎస్ నాయకులు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై దుష్ర్పచారం చేశారు. కేంద్రాన్ని దోషిగా చూపుతూ రాజకీయ లబ్ది పొందాలని చూసినా హుజూరాబాద్ ప్రజలు విజ్ఝతతో వ్యవహరించి బీజేపీ పక్షాన నిలిచారు. ఎన్నికలైనంక కూడా టీఆర్ఎస్ నాయకులు ఇంకా హుజూరాబాద్ ఓటమి నుండి కోలుకోనట్లుంది. ప్రజలు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో అల్లాడుతున్నా కనీసం పట్టించుకోవాలనే సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో అసలు దోషి రాష్ట్ర ప్రభుత్వమే. తక్షణమే పెట్రోలు, డీజిల్ పై రాష్ట్రం విధిస్తున్న పన్ను తగ్గించాలని తెలంగాణ బీజేపీ శాఖ డిమాండ్ చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తే ప్రజలకు తక్కువ ధరకే పెట్రోలు, డీజిల్ ధరలు అందుబాటులోకి వస్తాయి. ఆర్టీసీ సంస్థ సైతం డీజిల్ పై స్టేట్ వ్యాట్ ను తగ్గించుకోవాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది. స్టేట్ వ్యాట్ తగ్గిస్తే ప్రజా రవాణా మరింత చౌకగా అందుబాటులోకి వస్తుంది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వ్యాట్ పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకుంటోంది.
ఇప్పటికే ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. ఒకవైపు ప్రభుత్వ భూములను ఎడాపెడా అమ్మకానికి పెడుతోంది. ఇంకోవైపు మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజలను మద్యం బానిసలుగా మారుస్తూ వేల కోట్ల రూపాయలు ఖజానాకు మళ్లిస్తోంది. ఓవర్ డ్రాఫ్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుంటూ రాష్ట్ర ఆర్దిక వ్యవస్థను దిగజార్చింది.
రాష్ట్ర ప్రజలు వాస్తవాలను అర్ధం చేసుకుంటున్నరు. టీఆర్ఎస్ ను దోషిగా నిలబెడుతున్నరు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజా తీర్పే ఇందుకు నిదర్శనం. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం వాస్తవాలను గ్రహించాలి. లేనిపక్షంలో ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా యూపీ తరహాలో తక్షణమే పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలి. అదే విధంగా టీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా బీజేపీపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోంది.
కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో తగ్గిన వంట నూనె ధరలు
వంట నూనెల ధరలపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ గతనెల (అక్టోబర్) 14న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేడు పామాయిల్, వేరుశెనెగ, సన్ ఫ్లవర్ సహా ఒక్కో వంట నూనె ప్యాకెట్ పై రూ.5 నుండి రూ.20 ల వరకు ధర తగ్గింది. అంతర్జాతీయంగా వంట నూనె దిగుమతి కొరత ఏర్పడి మార్కెట్లో ధరలు పెరగడంతో ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని 32.5 శాతం నుండి 17.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఒకవైపు వంట నూనె, మరోవైపు పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో కేంద్రంపై పెద్ద ఎత్తున ఆర్దిక భారం పడినప్పటికీ ప్రజల శ్రేయస్సు ద్రుష్ట్యా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతం.

LEAVE A RESPONSE