Suryaa.co.in

Telangana

రాష్ట్రానికి కొత్త రైళ్లు లేవు, కొత్త రైల్వే లైన్లు లేవు

– పాత లైన్ల ఆధునికీకరణ తప్ప కొత్తగా కేటాయింపులేవీ లేవూ
– కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు
– కాజీపేట పిరియాడిక్ ఓవర్ హాలింగ్ ( పీ.ఓ.హెచ్ ) కు కేవలం రూ. 45 కోట్ల నామమాత్రపు కేటాయింపులా..?
– బండి సంజయ్..గాంధీ ఘాట్ వద్ద కాదు.. పార్లమెంటులో నిరసన తెలుపండి
– రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నట్లు..?
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో రాష్ట్రానికి కొత్త రైళ్లు లేవు. కొత్త రైల్వే లైన్లు లేవు. కేవలం పాత పూర్వపు లైన్ల ఆధునికీకరణ, ఎలక్టరీఫికేషన్ కు తప్ప కొత్తగా కేటాయింపులు ఏవీ లేవూ. కేంద్రం కొత్తగా రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు.. అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

బడ్జెట్ లో రైల్వే శాఖకు జరిపిన వివిధ అంశాల్లో కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేకుండా పోయిందని వినోద్ కుమార్ అన్నారు.కాజీపేట వేగన్ పిరియాడిక్ ఓవర్ హాలింగ్ ( పీ.ఓ.హెచ్ ) కు కేవలం రూ. 45 కోట్లు మాత్రమే నామమాత్రపు కేటాయింపులు చేయడం ఎంత వరకు సమంజసం అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.

వందేళ్ల కిందటి రైల్వే లైన్లను త్రిప్లింగ్ చేసేందుకు మాత్రమే నిధులు కేటాయించారని ఆయన తెలిపారు.రైల్వే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే పూర్వపు లైన్ల ఆధునికీకరణ చేయనున్నారని, కొత్తగా రాష్ట్రానికి ఒనగూడేదేమి లేదన్నారు.
1) కాజిపేట్ – హుజురాబాద్ – కరీంనగర్
2) ఆర్మూర్ – నిర్మల్ – ఆదిలాబాద్
3) మణుగూరు – భూపాలపల్లి – రామగుండం
4) జడ్చర్ల – నంద్యాల
5) మంచిర్యాల – ఆదిలాబాద్ వయా ఉట్నూర్
6) హైదరాబాద్ – సూర్యాపేట – విజయవాడ
పైన పేర్కొన్న రైల్వే కొత్త లైన్ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..! ఢిల్లీ గాంధీ ఘాట్ వద్ద కాకుండా.. పార్లమెంటులో నిరసన తెలుపాలని వినోద్ కుమార్ సూచించారు.రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు ఎంపీలు కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్ల కోసం ఎందుకు కేంద్రం వద్ద పట్టుబట్టడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. అసలు బీజేపీ నలుగురు ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వివక్ష పూరిత విధానాన్ని వెంటనే మానుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE