– ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఇబ్రహీంపట్నం: జగన్ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రజలు అప్పగించిన అధికారంతో 74 ఏళ్ళ వయసులో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో మంగళవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలను పట్టాలెకిస్తుందన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండరుల పథకం అమలు చేస్తామన్నారు.
వరదల కారణంగా కొటికలపూడి పొలాల్లో మేట వేసిన ఇసుక దిబ్బల తొలగింపునకు కృషిచేస్తానన్నారు. కొటికలపూడి గ్రామంలో ఎన్యూమరేషన్ పూర్తయిన వెంటనే ప్రభుత్వం నుంచి వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ చేస్తామన్నారు. ఎవరూ అధైర్య పడవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నష్టపరిహారం కూడా అతి త్వరలోనే చెల్లిస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో 20 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాలలో సేవలు అందించడానికే సరిపోయిందన్నారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఆవిష్కరించారు.
మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల), ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.