Suryaa.co.in

National

గురి కుదిరినా గిరి దాటలేదు!

కన్నప్ప..

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తీసిన ఈ సినిమా చాలా బాగుందని చెప్పలేను..
అలాగని అస్సలు నచ్చలేదని అనలేను..కాస్త నిడివి ఎక్కువైనా సినిమా చూసాను గాని ఎందుకో ఒక గొప్ప భక్తిరస చిత్రాన్ని చూసిన
అనుభూతి అయితే కలగలేదు.
మంచు విష్ణు నిర్మాతగా..
కన్నప్ప పాత్రధారిగా తాను చెయ్యగలిగినదంతా చేశాడు.
అయినా సినిమాలో ఎక్కడో
ఆ ఫీల్ మిస్సయింది.కన్నప్ప కథలోని ఎమోషన్ సరిగ్గా క్యారీ అవ్వలేదు.

దీనికి ప్రధాన కారణాలు..
మొదటిది స్క్రీన్ ప్లే లోపం..
కథలో బిగిని కొనసాగించలేకపోయారు.
అలాగే తెలుగు నేటివిటీ
కనిపించలేదు.అక్షయ్ కుమార్లో
శివుడు దర్శనం ఇవ్వలేదు.
ఆయన ఆహార్యం..అభినయం
సీరియల్లో మాదిరి అనిపించాయి.సినిమాలో కీలకమైన శివయ్య ఇలా తేలిపోవడం పెద్ద లోపంగా
పరిణమించింది.

మొహమాటం లేకుండా చెప్పాలంటే సినిమా మొత్తం మీద సంగీతం సరిగ్గా
సెట్ కాలేదు.ఇటు నేపథ్య సంగీతం కానీ..అటు పాటలు కానీ కుదరలేదు.సంగీతం మ్యాచ్ కాకపోవడం వల్ల
కొన్ని సన్నివేశాల్లో విష్ణు ఎంత బాగా చేసినప్పటికీ
రక్తి కట్టలేదు.
భక్తి భావం కలగలేదు.

సినిమా మొత్తాన్ని కన్నప్ప చుట్టూ తిప్పేసారు.దాని వల్ల
కథ దెబ్బతింది.పోనీ ఆ కన్నప్ప పాత్రను ఉదాత్తంగా చూపించారా అంటే నాయికా నాయకుల మధ్య రొమాంటిక్ సన్నివేశాల్లో మోతాదు బాగా ఎక్కువైంది. పాత సినిమాల తర్వాత వచ్చిన ఈ తరహా సినిమాల్లో నేటివిటీ లేక ఇబ్బంది పెట్టిన సినిమా మంజునాథ..కొంతలో కొంత నమో వెంకటేశ..
రొమాన్స్ ఎక్కువైపోయి ఇబ్బంది కలిగించిన సినిమాలు
పాండురంగ..
కొంత శ్రీరామదాసు..
అన్నీ చక్కగా కుదిరాయి గనుకనే అన్నమయ్య
సూపర్ డూపర్
హిట్టయింది.ఈరోజుకీ
ఆ సినిమా పాటలు అలా మారుమ్రోగుతూనే ఉంటాయి.
శ్రీరామదాసు పాటలు కూడా
అంతే..కన్నప్ప పాటల్లో
ఆ ఊపు గాని..ఆ తాదాత్మ్యత గాని లేవు.మళ్ళీ మళ్ళీ వినాలనిపించడం సంగతి అటుంచితే సినిమా చూస్తున్నపుడే భక్తి భావన ఎక్కడా కలగలేదు.

సినిమా హైప్ కోసం ప్రభాస్ ను
పెట్టారు గాని సినిమా ప్రభాస్ కోసమే వెళ్ళాలి అన్న దశలో ప్రచారం జరిగిపోయింది.
అలాగని ప్రభాస్ ఉన్నంతసేపు
సినిమా అదిరిపోయిందన్న స్థాయి కూడా లేదు.
మోహన్ లాల్..ప్రభాస్..
అక్షయ్ కుమార్..శరత్ కుమార్..నాలుగు దిగ్గజాలు ఉన్నా సినిమాకి
మల్టీ స్టారర్ కళ రాలేదు.
ఇక ముఖేష్ రుషి..బ్రహ్మాజీ
అసలు సినిమాలో ఉన్నట్టే
అనిపించలేదు..వారి పాత్రలకు
అస్సలు గుర్తింపే లేని పరిస్థితి.

ఇక మోహన్ బాబు..
ఆయన తన అపారమైన అనుభవాన్ని..అద్భుతమైన
తన స్వరాన్ని కలబోసి కొడుకు సినిమా హిట్టు చేయించాలన్న
సంకల్పంలో తన వంతు పాత్రను చక్కగా పోషించారు.
అయితే ఆయన పాత్ర విషయంలో కొంత కన్ఫ్యూజన్
తప్పలేదు.

ఇప్పుడు కంపారిజన్ విషయానికి వద్దాం..
సహజంగానే రీమేక్ లు చేసేటప్పుడు గతంలో వచ్చిన సినిమాతో పోలిక అనివార్యం.
మరీ రాజ్ కుమార్ అద్భుతంగా నటించిన
కన్నడ కన్నప్ప(తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అయింది)వరకు వెళ్లొద్దు గాని
కృష్ణంరాజు కన్నప్ప పాత్రధారిగా బాపూ దర్శకత్వంలో వచ్చిన
భక్త కన్నప్ప సినిమానే తీసుకుందాం..ఈ సినిమా ఆద్యంతం అద్భుతమైన రీతిలో నడిచింది.సినిమాలో
కథ నాటి వాతావరణం హృద్యంగా కనిపించింది.
కృష్ణంరాజు.. వాణిశ్రీతో
పాటు నటీనటులందరూ తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు.ఆ సినిమాకి హైలైట్ గా నిలిచిన పాత్రల్లో రావుగోపాలరావు పోషించిన కైలాసనాధ శాస్త్రి
పాత్ర ప్రత్యేకం.
మరి మంచు వారి కన్నప్పలో
మోహన్ బాబు పోషించింది
కైలాసనాథ శాస్త్రి పాత్రా అనుకుంటే ఆ ఛాయలు లేవు సరికదా పాత్ర పేరే మహదేవ శాస్త్రి..సరే.. పేరేదైనా మోహన్ బాబు తన వంతు పాత్రను
చక్కగా పోషించారు.

చివర్లో శ్రీకాళహస్తి సెంటిమెంటును కూడా చొప్పించే ప్రయత్నం చేసినా
గ్రాఫిక్స్ హడావిడి తప్ప
ఆ భావన ఎక్కడా కలగలేదు.

ఇక ప్రధాన పాత్రధారి విష్ణు
సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని పండించే
ప్రయత్నం తన పరిధిని..
స్థాయిని మించి చక్కగా చేశాడు.కన్నప్పను కళ్లెదుట
ఆవిష్కరించినా కృష్ణంరాజు స్దాయిలో ఆ పాత్ర పండడలేదు.దీనికి ప్రధాన కారణం స్క్రీన్ ప్లే..దర్శకత్వ లోపమే గాని విష్ణు ప్రయత్న లోపం కాదు.సినిమా మొత్తం
చివరి ఇరవై నిమిషాలపైనే
ఆధారపడి ఉన్నా ఆ ఇరవై నిమిషాల వరకు
కూర్చోబెట్టే బిగిని
మెయింటైన్ చెయ్యడంలో దర్శకుడు చాలా వరకు కృతకృత్యుడు కాలేకపోయాడని చెప్పక తప్పదు.దర్శకుడు సీరియల్ ఫేం కాబట్టి ఆ వాసనలు సినిమాలో కూడా పొడ చూపాయి.

మొత్తంమీద ఈ స్పీడ్ యుగంలో ఇలాంటి సినిమాని తియ్యడానికి పూనుకోవడం
పెద్ద సాహసమే..అలాంటి
రిస్కు చేసిన విష్ణుని అభినందించాల్సిందే.
అయితే స్టార్లను చొప్పించి
సినిమాని హిట్ చెయ్యాలనే తాపత్రయం కంటే స్క్రిప్ట్..
సంగీతం..ఇతర తారాగణం..
అభినయం విషయంలో
ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే
సినిమా ఇంకా బాగా వచ్చేది.

 

– సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286
9030296286

LEAVE A RESPONSE