కోడెలది చంద్రబాబు చేసిన హత్యే

కోడెల ఆత్మహత్యకు తెలుగుదేశం పార్టీ, ఆయన కుటుంబమే కారణం
అయ్యన్నకు పిచ్చెక్కి నట్టు ఉంది
ముఖ్యమంత్రి, ఇతర మంత్రులుపై అవాకులు పేలితే సహించేది లేదు
మాజీ మంత్రి అయ్యన్న వ్యాఖ్యలను ఖండించి.. ఘాటు విమర్శలు చేసిన శాసనసభ్యులు అంబటి రాంబాబు
సత్తెనపల్లి: మాజీ సభాపతి స్వర్గీయ కోడెల శివప్రసాదరావుది ముమ్మాటికి చంద్రబాబు చేసిన హత్యేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం వైకాపా నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అయ్యన్న సీనియర్ నాయకులు, ఐదు సార్లు శాసన సభ్యునిగా చేసిన వ్యక్తి హుందాగా ప్రవర్తించి మాట్లాడలన్నారు. ఈ విధంగా అభ్యంతరకరంగా, అమానవీయంగా.. ముఖ్యమంత్రిని సైతం దుర్భాషలాడటం సమంజసం కాదన్నారు. అవాకులు, చవాకులు పేలితే ప్రజలు నాలుక తెగ్గోస్తాతారని హెచ్చరించారు. కీర్తి శేషులు అయిన వారి గురించి మేము మాట్లాడటం లేదని.. ఆ సభ్యత, సంస్కారం మాకు ఉందన్నారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు నెల రోజుల క్రితం మొదటిసారి బలవన్మరణానికి ప్రయత్నించగా ఆయన అల్లుడు కు చెందిన వైద్యశాలలో చికిత్స పొందుతుండగా కనీసం పరామర్శించడానికి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాకపోవడం, కోడెలను వదిలించుకునేందుకు వారు సిద్ధపడటంతో శివప్రసాదరావు తీవ్ర మనస్థాపం చెందారన్నారు. మరోవైపు పార్టీ పట్టించుకోకపోవడం, కుటుంబ సభ్యుల నుంచి కూడా వేధింపులు రావడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకొనే పరిస్థితికి వచ్చారన్నారు. ఈ వాస్తవం అంతా సత్తెనపల్లి చుట్టుపక్కల వారికి స్పష్టంగా తెలుసునని.. అయ్యన్నపాత్రుడు ఇది గమనించుకోవాలన్నారు.
నకరికల్లు మండలం లోని కళ్ల కుంట గ్రామంలో కోడెల విగ్రహావిష్కరణ ముందు రోజు ఏం జరిగిందో తెలుసుకుంటే మంచిది హితవుపలికారు. అక్కడి మీ పార్టీ నాయకుల ఆవేదనను గుర్తిస్తే పరిస్థితి మీకు అర్థం అవుతుందని చురకలంటించారు. అయ్యన్న పాత్రుడు తక్షణం క్షమాపణ చెప్పాలని, లేదా ఆయనకు పిచ్చెక్కిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడైనావప్రకటించాలని అంబటి డిమాండ్ చేశారు.
నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కోడెల చేసిన అభివృద్ధి గురించి మీరు చర్చించుకోండి, భజన చేసుకోండి మాకు వచ్చే నష్టమేమీ లేదని.. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, మా ఎమ్మెల్యేల పైన దుర్భాషలాడుతూ మాట్లాడటం అయ్యన్నలాంటి సీనియర్ నాయకులకు పద్ధతి కాదని హెచ్చరించారు. ఇలా స్థాయిని తగ్గించుకుని దిగజారి మాట్లాడితేనే ప్రజల గుర్తిస్తారనుకోవడం సరైంది కాదన్నారు. ఈ తరానికి మీలాంటి వారు ఆదర్శంగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి, మీకు, కోడెల పై ఆయన కుటుంబం పైనా.. అంత ప్రేమ, అభిమానం ఉంటే మీకు చేతనయితే.. వారి ఇద్దరు పిల్లలకు సత్తెనపల్లి, నర్సారావుపేట నియోజకవర్గాల్లో చెరో స్థానం కేటాయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని చురకలంటించారు.
మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్ నాయకులు ఈవిధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, తక్షణం ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను విమర్శించేటప్పుడు హుందాగా ఉండాలన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు మాట్లాడిన దుర్భాషణలకు చట్టాలను దాటి మేము ప్రయత్నించి ఉంటే నరసరావుపేట కూడా దాటే వాడిని కాదని హెచ్చరించారు అయ్యన్న తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి అయ్యన్నపాత్రుడు జిల్లాలో అడుగుపెట్టాలంటే ముఖ్య మంత్రికి, ఇతర మంత్రులకు, ఎమ్మెల్యేలకు.. భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. చెప్పకపోతే ఖబర్దార్ ప్రజలు జిల్లాలో కాలు పెట్టనివ్వరని రాజనారాయణ హెచ్చరించారు.
పాత్రికేయుల సమావేశంలో మున్సిపల్ నాయకులు చలంచర్ల సాంబశివ రావు,. వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయపాటి పురుషోత్తమరావు, కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, కట్టా సాంబయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply