( మార్తి సుబ్రహ్మణ్యం)
జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి.. కాంగ్రెస్‌ను లెక్కలేనన్నిసార్లు కష్టాలకడలి నుంచి బయట పడేసిన మహామనీషి పాములపర్తి వేంకట నరసింహారావు అనే పివి నరసింహారావును.. ఆయన చివరి వరకూ శ్వాసించిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు కరుణించింది.కొత్త కార్యాలయంలో పివి చిత్రపటానికీ కాసింత చోటిచ్చింది. మరింకేం? పివి పుణ్యం పుచ్చిపోయినట్లే కదా? ఆయన ఆత్మ ఆనందభైరవి రాగంతో నర్తించినట్లే కదా?
అంతలావు మేధావి పరమపదించినప్పుడు, ఆయన భౌతికకాయం నిమిషం కూడా హస్తినలో ఉండకూడదని భావించిన ఆనాటి యుపీఏ ఏలికలు.. చివరి చూపుకోసం ఆయన కాయాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో పది సెకన్లు కూడా ఉంచేందుకు వీల్లేదన్న కఠిన పాషాణ హృదయంతో, హైదరాబాద్‌కు తరలించిన కాంగ్రెస్ నాయకత్వం.. ఇప్పుడు అర్జంటుగా తనపై ప్రేమ పొంగి పరవళ్లెత్తి, ముచ్చటగా మూడు చిత్రపటాలు పెట్టి.. మొహాన ఓ దండవేయించిన సోనియమ్మ దాతృత్వానికి, పాములపర్తి వారు పైనుంచే మురిసిముక్కలవ్వాలి కదా? ఆ ప్రకారంగా ఆయన పుణ్యం పుచ్చిపోయినట్లే కదా?!
అసలు పాములపర్తి గతించిన ఇరవైఏళ్ల తర్వాత, ఆయన అర్జెంటుగా గుర్తుకు రావడమే వింత. ఇందిరమ్మ నుంచి ఇందిరాకుమారుడి జమానా వరకూ, ఇందిరాకుమారురుడి నుంచి ఇంది‘రాకుమారి’ సోనియమ్మ హయాం వరకూ.. కాంగ్రె సుకు గొడ్డుచాకిరీ చేసిన తెలంగాణ బిడ్డ పాములపర్తి అంతిమయాత్ర కూడా అసంపూర్తిగా, ఆయన కట్టె కూడా పూర్తిగా కాలనంత అవమానించిన కాంగ్రెస్ నాయకామణికి.. ఇరవై ఏళ్ల తర్వాత పివి గుర్తుకు రావడం వింతల్లో వింత. అది కూడా ఢిల్లీ ఎన్నికల కాలంలో! పోనీలే.. అసలు పాత కార్యాలయంలో ఫొటోకు నోచుకోని పాములపర్తి వారికి, కనీసం కొత్త కార్యాలయంలోనయినా కాసింత చోటిచ్చినందుకు మెచ్చవలసిందే.
ఎందుకంటే ఐదేళ్లు మైనారిటీ సర్కారును, మెజారిటీగా మలిచి సుస్ధిర పాలన అందించి.. రెండేళ్లు అధ్యక్షుడిగా ఏఐసిసిని వెలిగించిన పివిని, ఈ ఇరవైఏళ్లలో ఏఐసిసి ఆఫీసులో పట్టించుకునే దిక్కులేదు. రాష్ట్రపార్టీ కార్యాలయాల్లోనూ అదే అవమానపరంపర. ఆయన చిత్రపటానికి మూర దండవేసి, దణ్ణం పెడితేఒట్టు.
ఐదేళ్లు పార్టీకి నిధులందించిన వైఎస్ మృతి చెందితే.. సకుటుంబ సమపరివార సమేతంగా హైదరాబాద్ వచ్చి వాలిపోయి, వైఎస్ కుటుంబాన్ని ఓదార్చిన సోనియమ్మ అండ్ ఫ్యామిలీ.. అదే తన పార్టీకి అధ్యక్షుడితోపాటు, ప్రధానిగా చేసిన పివి కన్నుమూస్తే కనీసం ఆయన కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి సానుభూతి చెప్పిన దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఎందుకంటే అయోధ్యలో మసీదు కూల్చివేతను అడ్డుకోకుండా పివి ప్రేక్షకపాత్ర పోషించారు కాబట్టి! దానితో అప్పటివరకూ తన భుజమెక్కిన ముస్లిములు, భుజం నుంచి దిగిపోయారు కాబట్టి!! ప్రధానిగా, పార్టీ అధ్యక్షుడిగా టెన్, జనపథ్ ఆదేశాలు పాటించలేదు కాబట్టి!!!
తెలంగాణ ముద్దుబిడ్డడన్న గౌరవంతో పివి స్మారకార్ధం పివి ఘాట్ ఏర్పాటుచేసి.. ప్రభుత్వపరంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించిన, నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. పైగా పివి బిడ్డకు ఎమ్మెల్సీ సీటు కూడా గౌరవించిన కేసీఆర్ రాజనీతి- హుందాతనంతో పోలిస్తే, సోనియా చాలా చిన్నగా కనిపిస్తారు. పోనీ పివి సంస్మరణ కోసం ఢిల్లీలో యుపిఏ సర్కారు, గజం జాగా ఇచ్చిన పాపానపోలేదు.
అలాంటి కాంగ్రెస్ నాయకామణి సారథ్యంలో జరిగిన కొత్త కార్యాలయ ప్రారంభోత్సంలో.. తెలంగాణ ముద్దుబిడ్డయిన తన ఫొటోలు మూడు కనిపించడంతో, పైనుంచి చూసిన పివి పుణ్యం పుచ్చిపోయింది! అయితే ఆ ఫొటోలు పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం కాబట్టి, మొక్కుబడిగా శాస్త్రప్రకారం పెట్టారా? లేదా అన్నది మరో రెండురోజుల్లోగానీ తెలియదు. ఎందుకంటే అప్పుడే కదా వాటిని తొలగించారా? లేదా? అని తెలిసేది?!