– నాడు లక్ష్మీపార్వతిని విమర్శించిన వ్యక్తిపై ఆగ్రహం
– నీకు అక్కచెల్లెళ్లు లేరా అంటూ ఆగ్రహం
– పిచ్చివాగుడు వాగద్దని శివమెత్తిన సాక్షి దంతాక్షరుడు
– మహిళలను గౌరవించాలని హితోక్తులు
– అమరావతి వేశ్యలరాజధాని అన్నా ఖండించని జస్టిస్ కొమ్మినేని చౌదరి
– ఇది జర్నలిజమా? జనరలిజమా? ఎర్నలిజమా?
– ‘నల్ల’బోతున్న పాత్రికేయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే.. అర్ధాలే వేరులే అని మనం పాటలు, సామెత రూపంలో వింటుంటాం. కానీ ఘనత వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు అనే ముదురు ‘జనరలిస్టు’.. చేతులు అటు ఇటూ ఊపుతూ చెప్పే ‘ఆడమాట’లకు మాత్రం నిస్సందేహంగా అర్ధాలే వేరు.
‘సాక్షి’ తెరపై తీర్పులిచ్చేసే ఈ ‘జస్టిస్ చౌదరి’ తెగోదారి సమక్షంలో, తాజాగా జరిగిన ఓ చర్చలో అమరావతిని ‘వేశ్యల రాజధాని’గా అభివర్ణించడం అనాగరికమే కాదు. నిలువెత్తు కులహంకారం-ఒళ్లు బలిసిన తనానికి పరాకాష్ఠ. కీచకులంటే నేరుగా ఆడవారిపై మానభంగాలు చేసేవారు మాత్రమే కాదు. ఇలా మాటలతోనూ మిడిసిపడే దుశ్శాసన ధూర్తులు కూడా కీచకుల కిందే లెక్క.
అమరావతి దేవతల రాజధాని అన్నది మొన్నామధ్య చంద్రబాబునాయుడు ఒక్కరే చెప్పింది కాదు. అది ఎప్పటినుంచో వినిపించే ఒక చారిత్రక-పౌరాణిక ముచ్చట. బహుశా బాబు దానినే ఉటంకించి ఉండవచ్చు. దానిని చర్చగా తీసుకున్న సాక్షి చానెల్‌లో, కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఓ ‘జనరలిస్టు’ నిర్వహించిన చర్చావేదికలో పాల్గొన్న, కృష్ణంరాజు అనే మరో జర్నలిస్టు సంఘ నేత(?).. అమరావతి దేవతల రాజధాని కాదు. వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు మహిళాలోకంలో గత్తర లేపుతోంది.
చర్చలో పాల్గొన్న ఆయన వాచాలత నివారించి, వాటిని ఖండించాల్సిన ‘పెద్దనోరు కొమ్మినేని’.. చేతులూపుకుంటూ, ‘దంతా’నందం పొందడం క్షమార్హం కాదు. పైగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చదివానంటూ, ‘నల్ల’బోయి..పరమానంద భరితుడవటం మరో సిగ్గుమాలిన తనం. గతంలో లక్ష్మీపార్వతిపై వ్యాఖ్యల చేసిన ఓ వ్యక్తిని.. ‘‘నీకు అక్కాచెల్లెళ్లు లేరా? రేపు నీ కుటుంబంలో కూడా అలా జరగని గ్యారంటీ ఉందా’’? అంటూ చేతులు అటు ఇటూ ఊపుకుంటూ, ‘ఆడ’మాటలతో విరుచుకుపడిన ఇదే‘దంతా’క్షర కొమ్మినేని.. ఇప్పుడు మరో చర్చలో, తన ముందే అమరావతిని వేశ్యల రాజధాని అంటూ దూషిస్తున్నా వారించకపోగా, ‘అఅవునవును నేనూ విన్నాన’ని శృతి కలపడం, కొమ్మినేని కండకావరానికి నిలువెత్తు నిదర్శనం. ఇదో ‘తాడేపల్లి తాలిబన్ల’ మార్కు పైశాచికత్వం!
ఈ డిబేట్ తర్వాత ఓ పాతకాలపు జర్నలిస్టు ఒకాయన.. ‘కొమ్మినేని డిబేట్ చూసిన తర్వాత నేను జర్నలిస్టు అని చెప్పుకునేందుకే సిగ్గుగా ఉంది. జర్నలిస్టుగా పనిచేసినందుకు నాపైన నాకే అసహ్యంగా ఉంది. పాత్రికేయ ప్రమాణాలు పడుపు వృత్తికంటే నీచంగా మారడం మన దౌర్భాగ్యం’’ అని వాపోయారు.
గతంలో టీవీ 5 అనే మరో చానెల్‌లో సినిమాపై చర్చ జరిగిన సందర్భంలో, సినిమా నటీమణులను నిస్సిగ్గు, నిర్లజ్జగా లంజలంటూ అభివర్ణించిన సాంబశివరావు అనే డిబేటర్ వాచాలత, అప్పట్లో తీవ్ర విమర్శలకు గురయింది. మరి ఈ బాపతు వ్యక్తులంతా జర్నలిస్టులా? జనరలిస్టులా? జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఎర్నలిస్టులా? చెప్పేదెవరు?
సందర్భం అమరావతిదే కాబట్టి ఇక్కడ ఇంకో ముచ్చట. అమరావతి ఉద్యమంలో పిడికిలి బిగించి ముందుండి నడిచిన మిహ ళల చీరల గురించి, వెకిలిగా మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి వాచాలత కూడా విమర్శలపాలయింది. దానికి ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికీ అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పకపోవడం, క్షమాపణ చెప్పాలని టీడీపీ-జనసేన కూడా డిమాండ్ చేయకపోవడం వేరే ముచ్చట.
తర్వాత అదే పార్టీ అమరావతి కోసం పాదయాత్ర చేయడం, ఆరేళ్ల క్రితం టీడీపీకి విడాకులిచ్చి మళ్లీ కలసి పోటీ చేసిన తర్వాత.. మళ్లీ అదే ప్రధాని మోదీ వచ్చి, అమరావతి పనులను ప్రారంభించడం ఒక వింత. సరే.. రాజకీయాల్గో సిగ్గు ఎగ్గులపై మాట్లాడితే అదో చర్చ లాంటి రచ్చ!
ఇక కొమ్మినేని సిగ్గుమాలిన జర్నలిజం సంగతికొస్తే.. ఇదే కొమ్మినేని ఇటీవల సాక్షిలో నిర్వహించిన ఓ చర్చలో లక్ష్మీపార్వతి హాజరయ్యారు. అదే సమయంలో భీమవరం నియోజకవర్గానికి చెందిన రాజు అనే వ్యక్తి కూడా అదే చర్చలో పాల్గొన్నాడు. ఆ సందర్భంలో సదరు రాజు అనే వ్యక్తి ‘ఆడవారి వల్ల రాజ్యాలు పోయాయని విన్నాం. ఇప్పుడు ఎన్టీఆర్‌ను రెండోపెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చి ఏదో చేసిందన్న ఆరోపణలున్నాయి. మొగుడ్ని వదిలేసిన ఆవిడిని తీసుకువచ్చి టీవీలో కూర్చోబెట్టి..’అంటుండగా, మధ్యలో అందుకున్న ఈ జస్టిస్ కొమ్మినేని చౌదరి, మొహంలో గంభీరం పులుముకి సదరు రాజుపై ఇంతెత్తున్న లేచి ఎగిరిపడ్డారు.
ఆ సందర్భంలో జస్టిస్ బులుగు కొమ్మినేని చౌదరి గారు ఎలాంటి తీర్పు ఇచ్చారు? ఎలాంటి ప్రవచానాలు బోధించారో ఓసారి విని తరిద్దాం. ‘‘ మీరు పిచ్చివాగుడు వాగమాకండి. నువ్వు ఎందుకు వచ్చావో అర్ధమయింది. నువ్వు పిచ్చివాగుడు వాడితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా?
అక్కచెల్లెళ్లు లేరా? ఎవరూ విడాకులు తీసుకోవడం లేదా? మీరంతా మద్దతిచ్చే ఓ పెద్ద నాయకుడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో మీకు తెలియదా? (పవన్‌నుద్దేశించి) అనవసరమైన విషయాల్లోకి వెళ్లి మహిళలను అవమానిస్తే ఒప్పుకునేది లేదు. మహిళలను అవమానించేవాళ్లు మీకు గొప్ప నాయకులా? వీళ్లేమో.. ఆవిడ జీవితం ఆవిడిష్టం. నువ్వెవరివయ్యా చెప్పడానికి? రేపు నీ ఇంట్లో ఇట్టాంటివి జరగవని గ్యారంటీ ఇస్తావా?బుద్ధుండాలి అలాంటి మాట్లాడటానికి. ఇలాంటి పిచ్చివాగుడు నేను అసలు ఒప్పుకోను. తీవ్రంగా ఖండిస్తా. నువ్వు చాలా నీచంగా మాట్లాడావు. ఇంక నిన్ను తిట్టడానికి నా సభ్యత, సంస్కారణ అడ్డువస్తోంది. పదిమందితో డాన్సులు చేసినోడు గొప్పోడా నీ దృష్టిలో’’ అంటూ రాజు అనే వ్యక్తిని జస్టిస్ కొమ్మినేని చౌదరి తలంటారు.
ఎదుటి వ్యక్తిని గౌరవించాలన్న ఇంగితం లేకుండా, తన పార్టీ నాయకురాలు ‘లపాతీ’ తరఫున వకాల్తా పుచ్చుకోవడం, ఏ రకమైన పాత్రికేయ విలువలో సదరు ‘దంతా’క్షరుడే సెలవివ్వాలి. అంటే విడాకులు తీసుకోవడం తప్పుకాదని తీర్పు ఇచ్చిన ఇదే జస్టిస్ కొమ్మినేని చౌదరి.. మళ్లీ పవన్‌నుద్దేశించి, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాడు మీ దృష్టిలో గొప్పొడా అనడం చూస్తే, ఈ తీర్పరికి మెదడు ఎక్కడుందో అర్ధమవుతుంది. విడాకులు తీసుకున్న తర్వాత నే, పవన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారని తెలియకపోవడం కొమ్మినేని అజ్ఞానానికి పరాకాష్ఠ.
మళ్లీ తాజాగా అమరావతి వేశ్యల రాజధాని అంటూ జరిగిన చర్చలోనూ, కొమ్మినేని ధృతరాష్ట్రత్వం బయటపడింది. ఆ ముచ్చట కూడా చూద్దాం. కృష్ణంరాజు అనే ఓ జర్నలిస్టు నాయకుడు(?)- ‘‘అమరావతి దేవతల రాజధాని ఎలా అవుతుంది? అది వేశ్యల రాజధాని. అక్కడ కొన్ని వేలమంది వేశ్యలు, ఎయిడ్స్ రోగులున్నట్లు ఓ సంస్థ చెప్పింది. పైగా దేవతల రాజధానిలో అవినీతి ఎలా జరుగుతుంది? అసలు దేవతల రాజధాని పైన ఉంటుంది తప్ప కింద ఎందుకు ఉంటుంది?.. ఇదీ ఆయన విమర్శ లాంటి వాదన.
సహజంగా అయితే జస్టిస్ కొమ్మినేని చౌదరి గారు.. లక్ష్మీపార్వతిని విమర్శించిన రాజుపై విరుచుకుపడినట్లే, ఈ జర్నలిస్టు రాజు గారిపైనా విడుచుకుపడతారని మెడపై తల ఉన్న ఎవరైనా భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా, రాజును సవరదీస్తూ మాట్లాడమే విడ్డూరం.
సాక్షి ‘దంతా’క్షరుడు.. రాజుని ఎలా సవరదీశారో ఓసారి చూద్దాం.‘‘మరీ మీరు అట్లా మాట్లాడటం బాగోలే దేమో? మళ్లీ మీ మీద ఎవరో ఒకళ్లు పడతారు. ఆ వార్త నేను కూడా చూశా. టైమ్స్‌లోనో, హిందూలోనో వచ్చింది. కరెక్టేగానీ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయ అనో, కృష్ణంరాజు గారు ఇట్లా అన్నారని సోషల్‌మీడియాలో నీచంగా ప్రచారం చేస్తారు’ అంటూ సవరదీసి, సానుభూతి ఒలకపోయటే విచిత్రం. అయినా.. పూర్వాశ్రమంలో హనుమాన్‌జంక్షన్‌లో గేదెలు తోలుకునే వారి నుంచి, అంతకుమించి సంస్కారం ఆశించడం కూడా అత్యాశే అన్నది, ఆయన ప్రారంభదశను చూసిన, జర్నలిస్టు భీష్మాచార్యుల ఉవాచ.
ఇంతకూ అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పించిన సాక్షి చానెల్‌కు యజమానురాలు భారతీరెడ్డి. ఇంకా నేరుగా చెప్పాలంటే.. నా అక్కలు, చెల్లెళ్లు అంటూ తలలు, బుగ్గలు నిమిరే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌రెడ్డి భార్య. సహజంగా మీడియాలో సతీమణి అని రాస్తుంటారు. సతీమణి అంటే సతులలో మణి వంటిది అని అర్ధం. అందువ ల్లే భార్య అనడం కరెక్ట్. మరి అమరావతి వేశ్యల రాజధాని అని తన చానెల్‌లో వాక్రుచ్చిన సదరు వ్యక్తి వ్యాఖ్యలను భారతీరెడ్డి సమర్ధిస్తారా? లేదా?.. నిజంగా వ్యతిరేకించినట్లయితే, ఆయన మాటలను పళ్లికిలిస్తూ సమర్ధించి, సవరదీసిన జస్టిస్ కొమ్మినేని చౌదరిని తొలగిస్తారా? లేదా? చూడాలి.
భారతీరెడ్డి సాక్షి చెప్పినట్లు ఒకవేళ అమరావతి వేశ్యల రాజధాని అయితే.. ఆ నియోజకవర్గం పరిథిలోని తాడికొండలో ఎస్సీలు 27.57 శాతం, రెడ్లు 23 శాతం, కమ్మ 18 శాతం, కాపులు 9 శాతం ఉన్నారు. ఇక అమరావతిని ఆనుకుని ఉన్న మంగళగిరి, పాత దుగ్గిరాల, ప్రత్తిపాడు, గుంటూరు-2, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రెడ్లు చాలాసార్లు విజయం సాధించారు. మరి ఆ ప్రకారంగా.. భారతీరెడ్డి యజమానిగా ఉన్న సాక్షి చానెల్ ఎవరినుద్దేశించి వేశ్యలని అభివర్ణించిందన్నది ప్రశ్న. అంటే సాక్షిలో ప్రసారమైన వ్యాఖ్యలు ఆ కులాలకూ వర్తిస్తాయా? లేవా ? అన్నది భారతీరెడ్డి సెలవివ్వాలి. ఎందుకంటే.. సాక్షి చానెల్‌కు యజమానురాలు ఆమెనే కాబట్టి!
బహుశా కొమ్మినేనికి నిజం చెబితే తల వేయి వక్కలవుతుందన్న శాపం ఉందేమోనన్నది సీనియర్ పాత్రికేయుల అనుమానం. ఎందుకంటే.. ‘అవునవును. నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా చదివా’నని, జర్నలిస్టు రాజు మాటలను సవరదీస్తూ సమర్ధించిన దంతాక్షరుడు, ఆ పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా చదివినట్లు లేదన్నది బుద్ధిజీవుల వ్యాఖ్య. ఎందుకంటే.. టైమ్స్‌లో ప్లోస్ గ్లోబల్ హెల్త్ ప్రచురించిన ఒక నివేదికలో, ఏపీ-తెలంగాణ హ్యూమన్ ట్రాఫికంగ్‌లో టాప్-5లో ఉన్నాయన్నది ఒక వార్త. ఆ నివేదిక ప్రకారమే చూస్తే.. ఒకటవ స్థానంలో కర్నూలు, రెండవ స్థానంలో కృష్ణ, మూడవ స్థానంలో కడప, నాలుగవ స్థానంలో అనంతపురం జిల్లాలున్నాయి.
ఆ టేబుల్‌ను చూస్తే.. సాక్షి టీవీలో కూర్చుని , అమరావతి వేశ్యల రాజధాని అన్న ధూర్తుల ఆరోపణ తప్పని తేలక తప్పదు. సహజంగా ఏదైనా ఒక అంశాన్ని ప్రస్తావిస్తే, దాని తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటారు. అంటే సెక్స్ వర్కర్ల తీవ్రతను చూడాలంటే, స్టేట్ పాపులేషన్‌తో కాలుక్యులేట్ చేయాలి. ఆ రకంగా చూస్తే ఏపీ ఆరవ స్థానంలో ఉంటుంది. ఆ టేబుల్ చెప్పినమ లెక్క అదే.
చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రిపేర్ చేసిన ఈ రిపోర్టును టైమ్స్‌లో వార్త రాస్తే, దాన్ని మహిళ అయిన భారతీరెడ్డి సాక్షి చానెల్‌లో.. ఒక డబ్బా పౌడర్ ముఖానికి రాసుకుని, వెకిలి వేషాలతో అబద్ధాలను నిజం చేసిన ఈ ‘బ్లాక్ అండ్ వైట్’ మేధావులను ఏం చేయాలో సమాజమే చెప్పాలి.
అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన కృష్ణంరాజు, ఆయనను ప్రోత్సహించిన ‘దంతా’క్షరుడు కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసేవరకూ పోలీసులు, టీడీపీ నాయకులు గుప్పెడు నిద్రమాత్రలు మింగిన మత్తులో నిద్రపోవడమే విడ్డూరం. జగన్ జమానాలో ఇలాంటి ఎపిసోడ్ జరిగితే.. పోలీసులు దానిని సుమోటోగా తీసుకుని, వాయువేగంతో అక్కడికి వాలిపోయి, సర్కారుపై విమర్శలు కురిపించిన వారిని జైల్లో పెట్టి కుళ్లబొడిచిన ఘటనలు బోలెడు.
గన్నవరం ఎయిర్‌పోర్టులో ఒక మహిళ బంగారంతో పట్టుపడిన వైనం టీ వీల్లో వచ్చింది. అప్పట్లో అదో సంచలనం. సరే.. ఈ ‘మంచి ప్రభుత్వం’ ఆమె భర్త రిటైరయినప్పటికీ, సాంస్కృతిక శాఖలో మళ్లీ తీసకుందనుకోండి. అది వేరే ముచ్చట. దానిని సీరియస్ కాకుండా ధనుంజయరెడ్డి, అప్పట్లో ఆ కేసును సమాధి చేశారు.
దానిని సోషల్‌మీడియాలో ఫార్వార్డ్ చేసిన 75 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును, వయసును కూడా గౌరవించకుండా రెక్కలు విరిచి జైల్లో పెట్టిన పోలీసుల తెంపరితనం తెలిసిందే. సరే.. తర్వాత తనకు నోటీసులిచ్చిన ఒక మహిళా కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ను ఇంటికి పిలిచి బట్టలు పెట్టిన సంస్కారం అంకబాబుది. అది వేరే విషయం.
ఈనాడు, ఉదయం వంటి పెద్ద పత్రికలు, హెచ్‌ఎంటీవీ వంటి చానెల్‌లో ఎడిటర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి.. టీడీపీ ఆవిర్భావ కాలంలో టికెట్ల ఎంపికలో కీలకపాత్ర పోషించి.. పివి సునీల్ వంటి అధికారికి జర్నలిజంలో అక్షరాలు నేర్పించిన అంకబాబు వంటి లబ్ధప్రతిష్ఠ జర్నలిస్టులనే చెరసాల పాలుచేసిన నియంతల కాలమది.
జగన్ జమానాలో, ధర్మాన చేత లంజాకొడుకులనిపించి..రోజా చేత ‘అక్కడ మగాళ్లు కొజ్జాగాళ్ల’నిపించి..ఇప్పుడు ఏకంగా అమరావతిని వేశ్యల రాజధాని అనిపించినప్పటికీ.. వారిని ఏసుప్రభు కూడా ఈర్ష్యపడేలా క్షమిస్తున్న, ఈ ‘మంచి ప్రభుత్వ’ క్షమాగుణానికి చేతులెత్తి మొక్కాల్సిందే. బహుశా ఈ క్షమాగుణమే.. ‘‘మళ్లీ మేమే వస్తాం. మీ బట్టలు విప్పి మీ తోలు తీస్తామ’ని, జగన్ హెచ్చరించడానికి కారణమేమో?!
మరిప్పుడు కూటమి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతిని వేశ్యల రాజధాని అని సాక్షి చానెల్‌లో వచ్చినా, మూతి-కాళ్లు ముడుచుకుని దుప్పటి కప్పుకున్న పోలీసులను.. అధికారం ఉన్నా వారిపై చర్యల కొరడా ఝళిపించకుండా, రాముడు మంచిబాలుడిగా ఉన్న ఈ మంచి ప్రభుత్వాన్ని ఏమనాలి? తనకు ఏమాత్రం సంబంధం లేని అంశమయినా, అమరావతిపైఅవ్యాజానురాగ ప్రేమతో రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసే వరకూ సోయి లేని ఈ సర్కారుకు ఎన్ని వీరతాళ్ళు వేయాలి? తమ ఓటర్లను వేశ్యలుగా అభివర్ణించినా ఏమాత్రం పట్టించుకోని, అమరావతి ప్రజలు ఓటేసిన ఎమ్మెల్యేలకు ఇంకెన్ని వీరతాళ్ళు వేయాలి?