Suryaa.co.in

National

ఎన్టీఆర్‌ స్ఫూర్తి, కీర్తి, సిద్ధాంతాలు అజరామరం

– 2024లో టీడీపీ గెలుపులో ఎన్నారైల కృషి మరువలేనిది
– ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్ధన్‌, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలలో ఒకటైన మెల్బోర్న్‌ నగరంలో ‘ఎన్నారై తెలుగుదేశం, స్ధానిక తెలుగు సాంస్కృతిక సంస్థ’ల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుక వేలాదిమంది మధ్య ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పలు కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ హైలైట్‌గా నిలిచాయి. స్ధానిక కళాకారులు ఎన్టీఆర్‌, బాలకృష్ణ చిత్రాల పాటలు పాడి అందర్నీ అలరించారు. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘చిత్రంభళావిచిత్రం’ పాటకు ‘రూప’ అనే నృత్యకారిణి అద్భుతంగా నర్తించారు.

కాగా, ఈ కార్యక్రమంలో ఇండియా నుంచి ముఖ్య అతిధులుగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌ టి.డి.జనార్ధన్‌, మాజీమంత్రి , ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్‌, నారా రోహిత్‌, అశ్విన్‌ అట్లూరి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ బాటలోనే బాబు: నందమూరి రామకృష్ణ్జ

అన్న ఎన్టీఆర్‌ తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాకనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై తెలుగులో రాసిన బోర్డులు వెలిశాయి. ఎన్టీఆర్‌ స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఎన్టీఆర్‌ బాటలోనే నారా చంద్రబాబునాయుడు నడుస్తున్నారు. తెలుగువాడు ఎక్కడుంటే తెలుగుదేశం పార్టీ అక్కడుటుంది.

అదీ లోకేష్ సత్తా: సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఓ గొప్ప అవకాశం. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి గెలుపునకు చేసిన కృషిని ఎంత చెప్పినా తక్కువే. 2019`24 మధ్య ఏపీలో అవినీతి, రాక్షస పాలన సాగింది.

నా మీద 18 కేసులు పెట్టి, నన్ను జైలుకు పంపారు. గతంలో నేను వైఎస్సాఆర్‌, నేదురుమల్లి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు గట్టిగా ఫైట్‌ చేసినా వారు కేసులు పెట్టలేదు. జగన్‌ జమానాలో ‘మద్యం’ కుంభకోణంలో వేల కోట్లు కొల్ల గొట్టారు. నాసిరకం బ్రాండలతో ఎంతో మంది అమాయకుల ఉసురు తీశారు. నా నియోజకవర్గంలోనే 68 మంది ప్రాణాలు పోగొట్టుకొన్నారు.

కొత్త ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోంది. చంద్రబాబు కి ఇపుడు లోకేష్‌బాబు అండగా, తోడుగా ఉన్నారు. లోకేష్‌బాబు పని తీరు చూసి, స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ లోకేష్‌బాబు కుటుంబాన్ని ఆహ్వానించి వారితో 2 గంటలపాటు గడిపారంటేనే.. లోకేష్‌బాబు ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

భరతమాత ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌ : టి.డి.జనార్ధన్‌

సినిమాల్లోగానీ, రాజకీయాల్లోగానీ అన్న ఎన్టీఆర్‌.. ఆయనకు ఆయనేసాటి. ప్రపంచ సినీ చరిత్రలోనే ఎన్టీఆర్‌ ధరించినన్ని వైవిధ్యభరిత సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రల్ని మరెవ్వరూ ధరించలేదు. సమాజంలోని అన్ని పాత్రలు ధరించారు.

అంతేకాదు.. సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్మాణంలో పాలు పంచుకొన్నారు. తన సొంత సినిమాల్లో తోటి ఆర్టిస్ట్‌లకు స్వయంగా మేకప్‌ వేసేవారు. ఇన్ని పాత్రల్ని నిర్వహించడం ఆయనకే సాధ్యమైంది. సినిమాలలో నిలదొక్కుకొనే సమయంలోనే.. రాయలసీమ ప్రాంతంలో కరువొస్తే దర్శక నిర్మాతలకు చెప్పకుండానే.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తన ప్రథమ కర్తవ్యం అని భావించి తోటి కళాకారులతో కలిసి నాటకాలు వేసి, జోలెపట్టి విరాళాలు సేకరించి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొన్నారు.

ఆ క్రమంలో ‘నిర్మాత’ ఆగ్రహాన్ని చవి చూడాల్చి వచ్చినా వెరవకుండా.. ఆయన సంస్థ నుండి బయటకొచ్చి.. సొంత సంస్థ ఏర్పాటు చేసి సొంత సినిమాలు తీసిన భరతమాత ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌. చైనాతో జరిగిన యుద్ధం, దివిసీమ తుఫాను వంటి విపత్కర స్థితులలో ప్రజలకు అండగా నిలబడిన మనవతావాది అన్న ఎన్టీఆర్‌.

సినిమాల్లో నాయక, ప్రతినాయకల పాత్రలు ధరించిన ఏకైక నటుడు ఎన్టీఆర్‌. 32 సంవత్సరాలలో 330 చిత్రాల్లో నటించారు. ఏడాదికి సగటున 10 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు. 100 రోజులు ఆడిన ఎక్కువ చిత్రాల్లో నటించిన ఏకైక నటుడు అన్న ఎన్టీఆర్‌. పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే సమయంలోనే.. దానిని లెక్కచేయక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేశారు.

ఎండనక, వాననక లెక్కచేయక 30,000 కిలోమీటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏసీలేని చైతన్యరధంలో పర్యటించారు. ప్రజలను చైతన్య పరిచారు. అవినీతి పాలనకు అంతం పలకాలని కోరారు. ‘రా.. తెలుగుదేశం పిలుస్తోందిరా’ అంటూ పిలిస్తే ఆయన వెంట ప్రజలు పరుగులు తీశారు. అఖండ మెజార్టీతో గెలిపించారు.

అధికారంలోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చరిత్ర సృష్టించాయి. పేదవాడి ఆకలి తీర్చాలని, పక్కా గూడు అందించాలని తపించి.. ఆవిధంగానే చేశారు. 2 రూ.ల కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతావస్త్రాలు.. మొదలైన ఎన్నో విశిష్ట పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న మహోన్నత లక్ష్యాన్ని 40 ఏళ్ల క్రితమే సంకల్పించారు. ఇపుడు ప్రపంచం అంతా ఆహార భద్రత గురించి మాట్లాడుతున్నాయి.

దేశంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధులు, వికలాంగులు, విడోలకు సంక్షేమ పెన్షన్‌లు అందించారు. ఆనాడు స్వల్ప బడ్జెట్‌లోనే నెలకు రూ. 30ల పెన్షన్‌లు ఇచ్చారు. ఇపుడు దాని విలువ రూ. 6,600. ఎన్టీఆర్‌ తర్వాత ఇపుడు నారా చంద్రబాబునాయుడు సామాజిక పెన్షన్లు నెలకు రూ. 4,000 చొప్పున అందిస్తున్నారు.

ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడం కోసం ఆనాడే కృష్ణ, పెన్నా నధుల్ని అనుసంధానం చేసి తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల్ని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కట్టారు. ఎన్టీఆర్‌ వచ్చేవరకు.. దేశంలో నదుల అనుసంధానం గురించి ఆలోచించిన నాయకుడేలేరు.

ఇపుడు ప్రధాని నరేంద్రమోదీ.. నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నారు. 2014లో చంద్రబాబుగారు పట్టిసీమ ఎత్తిపోతలు చేపట్టి గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానించారు. ఇపుడు బనకచర్ల ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తరలించే బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు గారు చేపట్టారు. సముద్రంలో కలిసే నీటిని సమర్ధవంతంగా వినియోగింలోకి తెస్తున్నారు.

అన్న ఎన్టీఆర్‌ వచ్చాకనే.. మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు కల్పించారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. అన్న ఎన్టీఆర్‌ పాలసీలు, పథకాల్ని నేడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారంటే.. ఆయన ముందుచూపు, సంకల్పం అర్ధం అవుతుంది.

ప్రజలు పన్నులరూపంలో డబ్బుకు ధర్మకర్తగా వ్యవహరించారు. పాత అంబాసిడర్‌లోనే ప్రయాణం చేశారు. కొత్తకార్లు కొనడానికి ఒప్పుకోలేదు. తనని అప్రజాస్వామికంగా ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దించివేసినపుడు, నెలరోజులపాటు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చేసి తిరిగి అధికారంలోకి వచ్చి.. తన సత్తా ఏమిటో ఇందిరా గాంధీకి తెలియజెప్పారు.

ఆ క్రమంలోనే.. దేశంలోని కాంగ్రెసేతర పార్టీలను లెఫ్ట్‌, రైట్‌ అనే తేడా లేకుండా ఏకత్రాటిపైకి తెచ్చారు. అన్నట్టుగానే 1989లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ప్రాంతీయ పార్టీ అధినేత అయినప్పటికీ దేశ సమగ్రతకు కృషి చేసిన జాతీయతా భావాలు గలిగిన జాతీయ నాయకుడిగా కీర్తించబడ్డారు.

ఎన్టీఆర్‌ జీవితం మహోన్నతమైనది, మహోజ్జ్వలమైంది. ఆయన స్ఫూర్తి, విధానాలు, సిద్ధాంతాలు నేటికీ ఆచరణీయం.అందువల్లనే ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితాలలోని ముఖ్య ఘట్టాలను గ్రంధస్థం చేసి భావితరాలకు అందిస్తున్నాం. తెలుగువారి అస్థిత్వం, ఆత్మగౌరవం.. ఆయన ద్వారానే ప్రపంచానికి తెలిసింది.

నాలాంటి యువతకు రాజకీయ జన్మనిచ్చారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పోలిట్‌బ్యూరో స్థాయి వరకు ఎదగడానికి, ఆప్కాబ్‌ చైర్మన్‌ వంటి పదవులు రావడానికి ఆయనే కారణం. ఆ మహానుభావుడి రుణం తీర్చుకోవడానికే నేను.. ఎన్టీఆర్‌ లిటరేచర్‌ అండ్‌ గ్లోబల్‌నెట్‌ వర్కింగ్‌ అనే కమిటీ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్‌ అభిమానుల్ని, పార్టీ వారిని ఒక వేదిక మీదకు తెచ్చి.. ఎన్టీఆర్‌ భావజాలాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నారు.

ఈ బృహత్తర కార్యక్రమానికి నాకు అండగా నిలుస్తున్న ప్రియతమనేత నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ , నారా లోకేష్‌బాబు కి కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన మొల్బోర్న్‌ ఎన్నారై తెలుగుదేశం పార్టీకి, తెలుగు సంఘాల వారికి ధన్యవాదాలు.

LEAVE A RESPONSE