Suryaa.co.in

Telangana

దేశంలో ఎన్నో పార్టీలున్నయ్….మరి బీజేపీయే ఎందుకంటే……?

-నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు వెనుకాడని పార్టీ బీజేపీ మాత్రమే
-భారత్ ను విశ్వగురుగా నిలబెట్టడమే పార్టీ లక్ష్యం
-అధికారం కంటే సిద్ధాంతమే ముఖ్యం
-తెలంగాణలో అరాచక పాలన రాజ్యమేలుతోంది
-టీఆర్ఎస్ అవినీతి-నియంత-కుటుంబ పాలన అంతమే బీజేపీ పంతం
-కార్యకర్తల్లారా…ఇదే ఆఖరి పోరాటం
-గడప గడపకూ వెళ్లి టీఆర్ఎస్ అరాచకాలపై ప్రజల్లోకి వెళదాం రండి…
-గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించే రోజులు రాబోతున్నయ్
-బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం

‘‘ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినయ్. మరి బీజేపీ మాత్రమే ఎందుకు కావాలి?… ఎందుకంటే… నమ్మిన సిద్ధాంతం కోసం చావుకు వెనుకాడని ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. అధికారం కంటే సిద్ధాంతమే ముఖ్యమని నమ్మి ఆచరిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. ప్రపంచానికి భారతీయ జీవన గమనమే ఉత్తమ మార్గమని చాటి చెబుతూ భారత్ ను విశ్వగురుగా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. అందుకే ఈ దేశానికి బీజేపీ మాత్రమే శ్రీరామరక్ష’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.

తెలంగాణలో అధికారంలో లేకపోయినా కార్యకర్తల త్యాగాల పునాదులపై నిలదొక్కుకున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాల స్పూర్తితో తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించి గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ అవినీతి-కుటుంబ-నియంత పాలనను ఎండగట్టేందుకు బీజేపీ కార్యకర్తలంతా గడపగడపకూ వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాస్, బంగారు శ్రుతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కార్యదర్శి ఉమారాణి, బొమ్మ జయశ్రీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు.

అందులోని ముఖ్యాంశాలు….
దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పోలింగ్ బూత్ ల వారీగా ఉత్సాహంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది.
బీజేపీ ఆవిర్భవించి 41 ఏళ్లయింది. అనేక మంది ఆశయాలు, లక్ష్యాల కోసం త్యాగాలు చేశారు. నమ్మిన సిద్దాంతాల కోసం దేనికైనా కొనసాగించే కార్యకర్తలున్నారు. సిద్ధాంతాలను విస్తరించేందుకు చావుకు కూడా స్వీకరించేందుకు సిద్ధమైన కార్యకర్తలు బీజేపీలోనే ఉన్నారు.
ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తల శ్రమ, త్యాగాల మీద ఏర్పడిన పార్టీ. ఏ ఒక్క వ్యక్తి సొంతమో కాదు. పదవులు ముఖ్యం కాదు… సిద్దాంతాలే ముఖ్యం అని చాటిన పార్టీ. ప్రజల కోసం సిద్ధాంతాల ప్రచారమే ధ్యేయంగా అధికారం కావాలనుకుందే మరో స్వార్ధం కోసం కాదు.
బీజేపీ లక్ష్యం చాలా పెద్దది. భారతీయ జీవనమే ప్రపంచానికి ఉత్తమమైన మార్గం అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పి విశ్వగురుగా భారత్ ను నిలబెట్టాలన్నదే బీజేపీ లక్ష్యం.

ఈ దేశంలో ఎన్నో పార్టీలున్నయ్. బీజేపీయే ఎందుకు? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం మనం చేస్తున్న పనే. అన్ని పార్టీల్లాగా అధికారం లక్ష్యమైతే బీజేపీ ఎందుకు? కాంగ్రెస్, టీఆర్ఎస్ చాలు కదా… భారత్ ను విశ్వగురుగా నిలబెట్టాలనే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తూ ప్రపంచంలోని హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నిరంతరం క్రుషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఇంత గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగడం నా పూర్వ జన్మ సుక్రుతంగా భావిస్తున్నా.

ఈ రోజు నాకు పార్టీ స్థాపించిన నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980 ఏప్రిల్ 6న ఆ మహనీయుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ముంబైలో చీకటి నిండిన హాలులో భారతీయ జనతా పార్టీని స్థాపిస్తూ ‘చీకట్లు చీలిపోతాయి.. సూర్యుడు ఉదయిస్తాడు.. మన కమలం వికసిస్తుంది..’ అని అన్న మాటలు నా చెవుల్లో రింగుమంటున్నాయి.

ఆనాడు అటల్ జీ చెప్పిన మాటలను దేశం నిజం చేసింది. పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండంటే రెండే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా…. వాజ్ పేయి, అద్వానీ సహా ఆనాడు ఎందరో మహనీయులు చేసిన క్రుషి, త్యాగాల ఫలితంగా ఈనాడు 303 ఎంపీ సీట్లతో తిరుగులేని శక్తిగా పార్టీ ఎదిగింది.

మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ ఏనాడూ అదరకుండా బెదరలేదు. కారణం సిద్ధాంతాలే పునాదిగా… అధికారమే లక్ష్యంగా…. ప్రజాసేవ పరమావధిగా ముందుకు సాగుతున్న మహోన్నత పార్టీ కాబట్టి.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన రథయాత్రతో దేశవ్యాప్తంగా హిందువుల ఐక్యత ఎంత అవసరమో దేశానికి చెప్పిన పార్టీ నా బీజేపీ. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ లోక్ సభలో మెజారిటీ లేకపోవడంతో అటల్ జీ ప్రధాని పదవి చేపట్టిన 13 రోజులకే ప్రభుత్వం పడిపోయంది. ఆ తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అటల్ జీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణలో 13 నెలలకే మళ్లీ గద్దె దిగాల్సి వచ్చింది.

199లో ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి అటల్ జీ ఆధ్వర్యంలో ఐదేళ్ల పాటు కొనసాగింది. ఆ తరువాత 2014లో మరో నవశకం మొదలైంది. 282 ఎంపీ స్థానాలను గెలిచి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు చరమ గీతం పాడారు.
మోదీజీ నాయకత్వం, అమిత్ షా చాణక్యం… నడ్డా నేత్రుత్యంలో బీజేపీ ప్రభ దేశం నలమూలలా విస్తరించింది. మోదీ సారథ్యంలో భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. భారత్ ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి నిరంతరం పనిచేస్తూ మోదీజీ చేస్తున్న క్రుషి అసామాన్యం.

మోదీ ఆధ్వర్యంలో ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదే. కరోనా కాలంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడమే కాకుండా ఆత్మనిర్బర్ భారత్ పేరుతో ప్రజలను ఆదుకున్న ఘనత మోదీజీ ఆలోచనా ఫలితమే. ఈరోజు ప్రజలు దేశంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారంటే అది మోదీ ప్రభుత్వ విధానమే కారణం.

కానీ బీజేపీ తను నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేసేందుకు ఏనాడూ వెనుకాడలేదు. దేశం ఫస్ట్… పార్టీ నెక్ట్స్… వ్యక్తి లాస్ట్ అనే గొప్ప సిద్ధాంతమే బీజేపీ బలం. ఈ దేశం కోసం.. నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన నాయకులు శ్యామా ప్రసాద ముఖర్జీ.. వారి త్యాగాల ఫలితంగా ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. దాదాపు 20 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ ఏనాడూ అధికారంలో లేదు. అయినా సిద్ధాంతాల కోసం నిరంతరం కొట్లాడుతూ ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొంటూ నిలిచిన పార్టీ బీజేపీ.

మరి తెలంగాణలో పరిస్థితి ఏంది? తెలంగాణలో పార్టీని బతికించడానికి, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎందరో నాయకులు, కార్యకర్తలు తమ జీవితాలను ధారపోశారు. ప్రాణాలకు ఫణంగా పెట్టారు. నక్సలైట్లకు ఎధురొడ్డి బలిదానాలు చేశారు. జిహాదీలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలారు.

వీరందరి ఆశయం ఒక్కటే. పేదల కోసం అధికారం రావాలన్నదే వారి లక్ష్యం. టీఆర్ఎస్ అరాచక పాలనను గద్దె దించడమే లక్ష్యంగా తెగించి కొట్లాడాలని కార్యకర్తలందరినీ కోరుతున్నా. ఈరోజు కార్యకర్తల త్యాగాలు, బలిదానాలు ఫలితంగా ఈరోజు తెలంగాణలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో నెలకొంది. ఇదంతా కార్యకర్తల శ్రమ ఫలితమే.

కార్యకర్తల స్పూర్తితో టీఆర్ఎస్ గద్దె దించడానికి ఇదే మన ఆఖరి పోరాటం కావాలి. కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జనం అల్లాడుతున్నారు. ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను మోసం చేస్తుండు. వీటిపై చర్చ జరగకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని బదనాం చేస్తూ కేసీఆర్ చేస్తున్న డ్రామాలు చేస్తూ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నారు.

దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా మనందరం గడప గడపకూ వెళదాం. వాస్తవ విషయాలను ప్రజలకు వివరిద్ధాం. టీఆర్ఎస్ కుటుంబ-అవినీతి-నియంత పాలనపై చైతన్యం కలిగిద్దాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండాను గొల్లకొండ కోటపై ఎగరేద్దాం. ఆ సన్నివేశాన్ని మనందరం చూసే రోజు దగ్గర్లోనే ఉంది.

LEAVE A RESPONSE