రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్‌కు సంబంధించి ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అదనపు అటెంప్స్ట్‌కు అవకాశాం కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని కోరిందా అని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
కోవిడ్ కారణంగా సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ విషయంలో సడలింపు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు సివిల్స్ అభ్యర్ధులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసినట్లు మంత్రి తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులను పరిశీలించింన అనంతరం అభ్యర్ధుల వయోపరిమితి సడలింపు, అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించేలా నిబంధనలలో మార్పు తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. పైన తెలిపిన కారణాల నేపధ్యంలో సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సడలింపులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ క్రీడల క్రమబద్ధీకరణపై అధ్యయనం
దేశంలో ఆన్‌లైన్ ఫాంటసీ క్రీడల ప్లాట్‌ఫార్మల క్రమబద్దీకరణకు జాతీయ స్థాయిలో అమలు చేయవలసిన మార్గదర్శకాలపై నీతి అయోగ్ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై వివిధ మంత్రిత్వ శాఖవు అధ్యయనం చేస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ చెప్పారు. రాజ్యసభలో గురువారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలో ఫాంటసీ క్రీడలు వాటితో అనుబంధమైన ఫ్లాంట్‌ఫారంలను ఆవిర్భవిస్తున్న రంగంగా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఫాంటసీ క్రీడలకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ, క్రీడల ప్రోత్సాహంలో వాటి పాత్రను ప్రభుత్వం గుర్తించిందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.