Suryaa.co.in

Andhra Pradesh

ఇది ఆ‘మోదీ’యోగ్య ప్రజాపాలన

– ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విజయవాడలో రాష్ట్ర స్థాయి లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. ఈ 11 ఏళ్లలో సాధించిన విజయాలను వివరించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

విజయవాడ: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని అన్నిరంగాల్లో సమాన అభివృద్ధికి బాటలు పడ్డాయి.
దేశంలోని అన్ని వర్గాలకు సమానమైన న్యాయం జరగడంతోపాటుగా.. అంతర్జాతీయంగానూ భారతదేశ ఖ్యాతి పెరిగింది.

మోదీ ఈ 11 ఏళ్లలో దేశంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపించారు.

ఈ 11 ఏళ్లలో మోదీ నేతృత్వంలో జరిగిన పురోగతి కారణంగా.. జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. 2014లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (10వ స్థానం) నుంచి తాజాగా 4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) స్వయంగా వెల్లడించింది.

త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగే దిశగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కృషిచేస్తోంది.

ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం.. త్వరలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం. గత 9 ఏళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అన్నదాతలు పండించిన పంటకు.. ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు అధిక ధర దక్కేలా కనీస మద్దతు ధరను పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 3,310 లక్షల టన్నులకు పెరిగింది.

2016లో ఉరి క్యాంప్ పై ఉగ్రదాడి జరిగిన తర్వాత మన సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి, పాక్ కు ముచ్చెమటలు పట్టించింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లో ఎయిర్ స్ట్రైక్ చేసి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.

తాజాగా జరిగిన అత్యంత దారుణమైన పుల్వామా దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోకి వెళ్లి ఉగ్ర స్థావరాలను పేల్చి.. మన వాయుసేన శక్తియుక్తులను ప్రపంచానికి చాటిచెప్పాం.

.మేకిన్ ఇండియా ద్వారా దేశీయంగా ఉత్పత్తులు తయారు చేసి, ఎగుమతులు పెంచి మన ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టపరిచారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్ గత పదేళ్లలో భారీగా మెరుగుపడింది.
2014లో 350 ఉన్న స్టార్టప్ ల సంఖ్య 2024 నాటికి 1.5 లక్షలకు చేరింది.

వీటిలో 110కి పైగా యూనికార్న్ (రూ.100 కోట్లకు పైబడిన) సంస్థలు ఉన్నాయి. దాదాపు 50 వేల స్టార్టప్ లకు మహిళలే డైరెక్టర్లుగా ఉన్నారు. అంటే మోదీ హయాంలో మహిళా సాధికారత మరింతగా పెరిగింది.

దాదాపు 17 లక్షల మందికి ఈ స్టార్టప్ ల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి.

జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి.. దేశ విద్యా వ్యవస్థలో చరిత్రాత్మక మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పీఎం శ్రీ కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అద్భుతంగా తీర్చి దిద్దుతున్నాం. గత దశాబ్ద కాలంలో ‘భారత్ మాల ప్రాజెక్టు’ ద్వారా హైవే నెట్ వర్క్, స్మార్ట్ సిటీల అభివృద్ధి, రైలు కనెక్టివిటీ ప్రాజెక్టులకు భారీగా నిధులు పెరిగాయి.

2014 లో దేశవ్యాప్తంగా 91 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, 2024 నాటికి ఇది 1.46 కిలోమీటర్లకు పెరిగింది.2014 వరకు దేశవ్యాప్తంగా 4.2 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లుండగా.. ఈ 11 ఏళ్లలో.. 7.7 లక్షల కోట్లకు పెంచాం. 2014లో రూ.29,055 కోట్లుగా ఉన్న రైల్వే మూలధన వ్యయం..

2024లో రూ.2లక్షల 42వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

రీజనల్ ప్రాంతాలకు విమాన సేవలు అందిచేందుకు ఉడాన్ (హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా హవాయి జహాజ్ లో ప్రయాణించాలనేది మోదీ గారి కల) పథకం కింద ప్రస్తుతం 88 ఎయిర్ పోర్టులు, 625 రూట్లు సేవలు అందిస్తున్నాయి.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (PMJDY) కింద 2014లో 14.72 కోట్ల ఖాతాలు తెరవగా, 2025 నాటికి 54.58 కోట్ల ఖాతాలు తెరిచారు.
ఈ ఖాతాల్లో రూ.2.46 లక్షల కోట్ల మేర డిపాజిట్ చేశారు. ఈ మొత్తం ఖాతాల్లో.. మహిళల పేరిట 30.37 కోట్ల ఖాతాలు (55%) ఉన్నాయి. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రూ.33.65 లక్షల కోట్లు రుణాలు మంజూరు చేశాం.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలోని 50 కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు, మరుగుదొడ్లు నిర్మించేందుకు, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.95 వేల కోట్లు ఖర్చు చేశాం.

ఆడపిల్లల సంఖ్యను పెంచి వారికి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ‘బేటీ బచావో-బేటీ పఢావో’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం.ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 7 కోట్ల మందికి పైగా మహిళా లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. సుందరమైన అయోధ్య ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి.. కోట్లాది మంది హిందువుల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చింది.

రావణ కాష్టంలా నిత్యం మండుతూ ఉన్న జమ్మూ కశ్మీర్ లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రెండ్రోజుల క్రితం చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అతి ఎత్తయిన బ్రిడ్జ్ ను మోదీ ప్రారంభించారు. ఇది జమ్మూకశ్మీర్ కు ప్రపంచంతో అనుసంధానతను మరింత పెంచింది.

ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ మన తెలుగువారందరికీ గర్వకారణం. మన తెలుగు ఇంజనీర్ మాధవీలత .. చీనాబ్ బ్రిడ్జ్ డిజైనింగ్ లో కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాధవీలత ని మనమంతా చప్పట్లతో అభినందించుకుందాం.

‘డిజిటల్ ఇండియా – పవర్ టు ఎంపవర్’ అనే నినాదంతో ప్రజలకు సాంకేతికతను చేరువ చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా పథకాన్ని తీసుకొచ్చారు. 1.3 బిలియన్ ఆధార్ కార్డులు, 100 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు.. 70 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు. దీంతో మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ డెమొక్రసీగా అవతరించింది.

విప్లవవీరుడు, అగ్గిబరాటా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అయిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని మోదీ ప్రభుత్వం మన భీమవరం వేదికగా ఘనంగా నిర్వహించింది. తెలుగు ప్రజల అభిమాన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.

.బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు మన తెలుగువాడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి మోదీ ప్రభుత్వం మాత్రం ‘భారతరత్న’ అవార్డును ఇచ్చి గౌరవించుకుంది. మన తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకునే.. రామోజీ రావు , వెంకయ్య నాయుడు, చిరంజీవి, డాక్టర్ నాగేశ్వర రెడ్డి, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కి పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించుకున్నాం అని కిషన్‌రెడ్డి వివరించారు.

తొలుత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి ఇరువురు వాయు మార్గం లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.బిజెపి రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు.

గన్నవరం నుండి కార్లు ర్యాలీ నిర్వహించారు.రామవరప్పాడు సెంటర్ కు చేరుకున్న తర్వాత ఇరువురు నేతలు మొక్కలు నాటారు.

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11సం పరిపాలన పై నూతన పుస్తకం ఆవిష్కరణ చేశారు.

అనంతరం ప్రథాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎగ్జిబిషన్ తిలకించారు.

పాత్రికేయుల సమావేశంలో తొలుత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రసంగించారు.అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నరేంద్ర మోడీ 11సం పరిపాలన కార్యక్రమం రాష్ట్ర ఇంఛార్జి గారపాటి సీతారామంజనేయ చౌదరి (తపన), బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి లు వల్లూరు జయప్రకాష్, యామిని శర్మ, బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిజెపి ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి బ్రహ్మం, బిజెపి రాష్ట్ర నేత సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE