– ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన
-ఎక్కడ చూసినా కాంగ్రెస్ కండకావరం
-కూల్చివేతలు,కాల్చివేతలు,పేల్చివేతలు
-కేసీఆర్ హయాంలో పాడిపంటలు
-రేవంత్ రెడ్డి వచ్చాక అగ్నిమంటలు
-సీఎం సోదరులది అంతులేని అవినీతి
-రేవంత్ సోదరులు భూకబ్జా కోరులు
-నిన్న లగచర్ల.. నేడు దిలావర్ పూర్
-రైతులతో పెట్టుకున్నోళ్లెవరూ బాగుపడలేదు
-చిట్టినాయుడికీ చంద్రబాబు కు పట్టిన గతే
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
నిజామాబాద్: తెలంగాణలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కాండకావరమే. అక్రమ అరెస్టులు, లాఠీ దెబ్బలు, కూల్చివేతలు, కాల్చివేతలు, పేల్చివేతలు-ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే? అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అని మండిపడ్డారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఏ ముహూర్తం లో వచ్చారోగానీ ఆయన పాదం తెలంగాణకు ప్రమాదంగా పరిణమించిందన్నారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ భూములు పాడిపంటలతో విలసిల్లితే రేవంత్ రెడ్డి వచ్చాక అగ్నిమంటలతో కాలిపోతూ కనిపిస్తున్నాయన్నారు. సీఎం సోదరులది అంతులేని అవినీతి అని, చిట్టినాయుడి దుర్నీతికి తెలంగాణ ఆహుతి అవుతోందని ఆయన విరుచుకుపడ్డారు. “రేవంత్ సోదరులు భూకబ్జా కోరులు. వారిభూదోపీడీకి అధికారులు వంత పాడుతున్నారు. పల్లెల్లో అధికారుల దురంహకారం పెరుగుతుండగా సర్కారుపై రైతులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
నిన్న లగచర్ల.. నేడు దిలావర్ పూర్ వరకూ గ్రామం ఏదైనా కాంగ్రెస్ సర్కారుపై ప్రజల సంగ్రామమే కనిపిస్తోంది. నిత్యం ప్రజల తిరుగుబాటుతో తెలంగాణ శ్రీలంకను తలపిస్తున్నది. రైతులతో పెట్టుకున్నోళ్లెవరూ బాగుపడలేదు. బషీర్ బాగ్ లో రైతులను చంపించిన చంద్రబాబు నాయుడు తట్టా బుట్ట సర్దుకొని పోయిండు. చిట్టినాయుడికీ చంద్రబాబు కు పట్టిన గతే పడుతుంది. సీఎంగా రేవంత్ రెడ్డి పాలనలో విఫలం కాగా అవినీతి, ఆరాచకాల్లో సఫల మవుతున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనం కావడం తెలంగాణ ప్రజలకు మరణశాసనంగా మారింది.హోమ్ శాఖ మంత్రి కూడా రేవంత్ ,శాంతిభద్రతలు గల్లంతు. రేవంత్ వద్దే విద్యా రంగం
గురుకులాలలో మరణ మృదంగం.11నెలల్లో 48మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. నిన్న శైలజ అనే విద్యార్థిని మరణిస్తే ఆమె గ్రామానికి ఎవరూ వెళ్లకుండా నిర్బంధం అమలు చేశారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మిని నిర్బంధించారు. కాంగ్రెస్ నికృష్ట పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?.
చివరకు నీ అవసరానికి ఒట్లు పెట్టిన కొండగట్టు అంజన్న నుంచి భద్రాద్రి రామయ్య దాకా, సిద్ధులగుట్ట శివయ్య నుంచి యాదగిరి గుట్ట నరసన్న దాకా, బాసర నుంచి కీసర దాకా ,దేవుళ్లకే శఠగోపం పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అవినీతికి అంతు లేకుండాపోయింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బంధు గణం అవినీతి కి జిల్లా బలవుతోంది. ఆ పార్టీ నాయకులు ఈరావత్రి అనిల్ ఇసుక దందాలో, సుదర్శన్ రెడ్డి అనేక జిల్లాల్లో లిక్కర్ వ్యాపారంలో మునిగితేలుతున్నారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి అవినీతికి పాల్పడుతూ ప్రజలను దోచు కుంటున్నాడు.
కాగా ‘దీక్షా దివస్’ స్పూర్తితో రేవంత్ సర్కారుపై సమరభేరి మోగిస్తామన్నారు. నేటి దీక్షా దివస్ ను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ లోని తెలంగాణ భవన్ లోనే దీక్షాదివస్ కార్యక్రమం జరుగుతుందని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు,బోధన్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్,సీనియర్ నాయకులు రాంకిషన్ రావు,సుజీత్ సింగ్ ఠాకూర్, ప్రభాకర్,సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.