Suryaa.co.in

Telangana

ఇది ‘ఆపరేషన్ కార్పొరేట్ కబ్జా

– అపరేషన్ కగార్ – భద్రత పేరిట ఆదివాసులపై కార్పొరేట్ కంపెనీల దాడి
— బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్

హైదరాబాద్ : ఇందిరాపార్క్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన “మహాధర్నా” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ , కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ పై తీవ్రంగా స్పందించారు.

ఈ ఆపరేషన్‌లో జరిగే మానవహక్కుల ఉల్లంఘనలపై గళమెత్తుతూ, ఆయన అన్నారు.

ఇది మాకైతే ‘ఆపరేషన్ కార్పొరేట్ కబ్జా’ లాంటిది. ఇది గిరిజనులపై, వారి జీవనావకాశాలపై, సహజ వనరులపై కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న కబ్జా యుద్ధం. ఇది భద్రత పేరిట నడిపే సంఘటిత నిరంకుశత. ఇది రాజ్యాంగానికి, మానవతకు విరుద్ధం

ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు తుపాకులు సమాధానమా?

“భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు కల్పించింది. కానీ ఈ ప్రభుత్వం ప్రశ్నించిన గొంతులను గౌరవించడం లేదు… గట్టిగా అణచేస్తోంది.
మావోయిస్టులు కోరేది శస్త్రాలతో కాదు — సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం. ఇవే విషయాలను మన రాజ్యాంగం కూడా వాగ్దానిస్తుంది.

కానీ విద్య, ఉపాధి, న్యాయం, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కుల్లో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీ పేదలు తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. బ్యాంకుల రుణాలే అందని పరిస్థితుల్లో, చిన్న వ్యాపారమే మొదలుపెట్టలేని స్థితిలో, ప్రజలు ప్రశ్నించక తప్పదు.

అసమానతలు ఉన్నంతవరకు ప్రశ్నలు ఆగవు

అసమానతలు కొనసాగుతున్నంతవరకు ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రశ్నలకు గౌరవంగా స్పందించాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు తుపాకులతో సమాధానమిస్తున్నది. ఇది తాత్కాలిక శాంతి కాదు — దీర్ఘకాలిక విధ్వంసానికి నాంది.

ప్రశ్నలను అణచడం నేరం. సమస్యల పరిష్కారం కోసం చర్చలు, విధాన మార్పులు, రాజ్యాంగ నిబద్ధతలతో ముందుకు సాగాలి. ప్రజల విశ్వాసం సంపాదించాలి — భయం రేపితే కాదు.

ఇది తాలిబాన్ పాలన కాదు – చర్చలే శాశ్వత మార్గం

ఇది పాకిస్తాన్ కాదుగాక, తాలిబాన్ పాలన కాదుగాక — ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యం. ఇక్కడ తుపాకులకు కాదు, చర్చలకు స్థానం ఉండాలి. అడవులు, జీవనవనరులు కార్పొరేట్ సంస్థల ఖాతాలోకి వెళ్లకూడదు. ఆదివాసుల ఆత్మగౌరవాన్ని రక్షించాల్సిన బాధ్యత పాలకులదే. మానవత్వం కోల్పోతే అధికారాలు శూన్యం.

బీఆర్ఎస్ పార్టీ వైఖరి స్పష్టమైంది

కేసీఆర్ వరంగల్ సభలో స్పష్టంగా పేర్కొన్నారు. కాల్పులు బేషరతుగా ఆపాలి. కేంద్రం చర్చల బాట పట్టాలి. అదే బీఆర్ఎస్ అధికారిక వైఖరి. మేము ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కార మార్గాన్ని కోరుకుంటాం. కానీ తుపాకులతో ప్రజలను అణచాలనే కుట్రలు కొనసాగితే, విపక్షంగా మేము మౌనంగా ఉండము.

మేము రాజ్యాంగ పునాదుల కోసం, ఆదివాసుల భద్రత కోసం, బలమైన రాజకీయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.

ప్రజల గొంతు అణచలేరు

ఒకవేళ పాలకులు తమ భద్రత పేరుతో ప్రజలను కాల్చితే, ప్రజల భద్రత ఎక్కడ ఉంటుంది?కార్పొరేట్ వ్యాపారాలకు రక్షణ కల్పించేందుకు ప్రాణాలను తీయడం అభివృద్ధి కాదు. అది రక్తంతో రాసిన విధ్వంసం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుంది. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుంది. రాజ్యాంగం పునాది అయిన సమానత్వాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని కాపాడుతుంది. ఇదే మా రాజకీయ మానవతా వాగ్దానం.

ఒపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలి. ఈ ఆపరేషన్‌లో మరణించినవారిపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. గిరిజనుల హక్కులు, భూమి స్వామ్యాన్ని కేంద్రం గౌరవించాలి.5వ షెడ్యూల్ ప్రకారం గ్రామసభల అనుమతి లేకుండా ఆదివాసుల భూముల్లో ఏ చర్యలూ చేపట్టకూడదు. మావోయిస్టు సమస్యపై కేంద్రం చర్చల బాట పట్టాలి — శాంతియుత పరిష్కారానికి మార్గం వేసుకోవాలి.

 

LEAVE A RESPONSE