Suryaa.co.in

Andhra Pradesh

ఈ గులకరాయి నాటకం…కోడికత్తి డ్రామా 2.0

-కాపులపై కక్షగట్టిన జగన్‌ రెడ్డి
-సానుభూతి డ్రామాలో బీసీ బిడ్డలను బలిచ్చారు
-కాపు నేతలను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు
-టీడీపీ నేతల ఆగ్రహం

కాపులను అణచివేయడమే లక్ష్యంగా జగన్‌ రెడ్డి అడుగడుగునా కుట్రలకు తెరలేపుతున్నాడని టీడీపీ నేతలు పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, పాలకొల్లు అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి డ్రామాను చంద్రబాబుకు ఆపాదించారు. ఎన్నికల్లో సానుభూతి పొంది తర్వాత కేసును నీరు గార్చారు. ఇప్పుడు మరోసారి కోడికత్తి 2.0 డ్రామాకు తెరలేపి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఆపాదించే కుట్ర చేస్తున్నారు. కాపు నాయకుడైన బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు.

గులకరాయి డ్రామాను చూసిన ప్రతిఒక్కరూ జగన్‌రెడ్డిని అసహ్యించుకుంటున్నారు. దీంతో దాన్ని తెలుగుదేశం పార్టీపైకి నెట్టి తెలుగుదేశం పార్టీ నేతలను ఇరికించేందుకు కుట్ర చేశారు. అధికార పార్టీకి ఊడిగం చేసే కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని తప్పుడు రిపోర్టులు తయారు చేయిస్తున్నారు. కాపులను తెలుగుదేశం పార్టీకి, కూటమికి దూరం చేయాలని శతవిధాలా ప్రయత్నించి జగన్‌రెడ్డి భంగపడ్డాడని విమర్శించారు. ఇప్పుడు కాపు నాయకులను ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా జగన్‌రెడ్డికి గులకరాయి తగిలితే ఆ రాయి ఎందుకు దొరకలేదు? అని ప్రశ్నించారు. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని బీసీ బిడ్డని బలిచ్చి ఆ కేసులో కాపులను కూడా ఇరికించే కుట్ర చేయడం దుర్మార్గమన్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తే కాపు జాతి జగన్‌రెడ్డిని సహించబోదని హెచ్చరించారు.

LEAVE A RESPONSE