Suryaa.co.in

Devotional

హిందూ ఏక్తా యాత్రకు వేలాదిగా తరలిరండి

తెలంగాణలో హిందూ సమాజ ఐక్యతను చాటి చెబుదాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు
దోచుకున్న సొమ్ము దాచుకునేందుకు కేటీఆర్ విదేశీ పర్యటనలు
తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్మును పంజాబ్ కు పంచడమా?
రాష్ట్రాన్ని అప్పలపాల్జేసి ప్రజలకు చిప్పచేతికిచ్చి రాష్ట్రాల టూర్లు చేయడమా?
మీడియాలో హెడ్ లైన్ల కోసమే కేసీఆర్ సంచలనాలు…

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 25న కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని హిందూ సమాజ ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించే ఈ యాత్రకు వేలాదిగా హిందూ బంధువులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జి.కృష్ణారెడ్డి తోపాటు పార్టీ నేతలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గత 12 సంవత్సరాలుగా ప్రతి ఏటా కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నాం. కోవిడ్ కారణంగా గత రెండేళ్లపాటు ఈ యాత్రను నిర్వహించలేకపోయాం. ఈసారి భారీ ఎత్తున కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నాం. వేలాది మంది హిందూ బంధువులంతా ఈ యాత్రకు తరలివచ్చి తెలంగాణలోని హిందూ సమాజ సంఘటిత శక్తిని, ఐక్యతా స్పూర్తిని మరోసారి చాటి చెప్పాలి.

గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో హిందూ ఏక్తా యాత్రకు తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సింగపూర్, దుబాయి సహా విదేశాల నుండి పెద్ద ఎత్తున యువత ఈ యాత్రలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈసారి హిందూ ఏక్తా యాత్రకు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనందస్వామి అతిథిగా హాజరై భక్తులకు మార్గదర్శనం చేయబోతున్నారు. యాత్రలో భాగంగా భక్త హనుమాన్, శ్రీరామ చంద్ర స్వామి విగ్రహాలను తయారు చేశాం. ఈసారి పెద్ద ఎత్తున హనుమాన్ వేషధారులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈనెల 25న సాయంత్రం 4.30 గంటలకు కరీంనగర్ వైశ్యా భవన్ నుండి ప్రారంభం కానున్నా హిందూ ఏక్తా యాత్రను జయప్రదం చేసి తెలంగాణ హిందూ సమాజ సంఘటిత శక్తిని, ఐక్యతా స్పూర్తిని చాటాలని మరోసారి కోరుతున్నా.

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందున ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు హ్రుదయ పూర్వక ధన్యవాదాలు చెబుతున్నాం. దీనివల్ల రూ.లక్ష కోట్ల అదనపు భారం పడుతున్నా పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. రష్యా-ఉక్రెయిన్ యుద్దం, కరోనా మహమ్మారితో దేశ ఆర్దిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ పేరుతో లీటర్ పెట్రోలు పై రూ.30లకుపైగా దోచుకుంటోంది. గత 8 ఏళ్లలో పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పేరుతో రూ.65 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని దండుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గిస్తే రాష్ట్రంలో లీటర్ పెట్రోలు ధర రూ.80లకే అందించవచ్చు. కానీ కేసీఆర్ మాత్రం ఆ పని చేయకుండా ప్రజలపై భారం మోపుతూ కేంద్రంపై నెపాన్ని నెట్టడం సిగ్గు చేటు.

రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి కేసీఆర్ కొడుకు విదేశాలకు వెళుతుంటే కేసీఆర్ మాత్రం సంచలనం స్రుష్టిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. పత్రికల్లో, టీవీల్లో హెడ్ లైన్ల కోసమే కేసీఆర్ సంచలనం చేస్తానంటున్నారే తప్ప ఆయన చేసేదేమీ లేదు. కేసీఆర్ ను ఇతర రాష్ట్రాల నేతలు జోకర్లా చూస్తున్నారు.

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాళా తీసింది. ప్రజల చేతికి చిప్పి చేతికిచ్చారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. పేదలకు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఒక నెల పెన్షన్ సొమ్మును ఎగ్గొట్టారు. గతంలో సీఎం పేరిట ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడం సిగ్గు చేటు.

రాష్ట్రంలో ఎంతో మంది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ మూర్ఖత్వ పాలనవల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినప్పటికీ ఏనాడూ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా ఏ ఒక్క కుటుంబానికి నయా పైసా సాయం చేయని కేసీఆర్ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు సాయం చేస్తానని చెప్పడం సిగ్గు చేటు.

కోవిడ్ సమయంలో ఏ ఒక్క ఆసుపత్రిని సందర్శించకుండా.. ఏ ఒక్క రోగిని ఆదుకోవాలనే సోయి లేని కేసీఆర్… ఈరోజు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆదుకుంటానని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అథో:గతి పాల్జేసి ఇక్కడి ప్రజలకు చిప్ప చేతికిచ్చి… ఇక్కడి సొమ్మును కేసీఆర్ పేరు ప్రఖ్యాతుల కోసం పంజాబ్ రైతులకు డబ్బులిస్తాననం ఎంత వరకు న్యాయమో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నారంటేనే కేసీఆర్ వెన్నులో వణుకుపుడుతోంది. అందుకే ప్రధాని వస్తున్నారని తెలిసినా ఆయనకు ముఖం చూపించే దమ్ము లేక పర్యటన పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు.

 

LEAVE A RESPONSE