-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జాలర్లు ప్రస్తుతం పాకిస్తాన్ జైళ్ళలో బందీలుగా ఉన్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు.
పాకిస్తాన్‌తో సహా వివిధ దేశాలలో బందీలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాలర్ల విడుదల, వారిని క్షేమంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జాలర్లు మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్‌లోని వివిధ జైళ్ళలో బందీలుగా ఉన్నారని చెప్పారు.
అనేక దేశాలలో అమలులో ఉన్న కఠిన రహస్య చట్టాల కారణంగా తమ వద్ద బందీలుగా ఉన్నవారి అనుమతి లేకుండా ఖైదీల వివరాలను వెల్లడించడానికి స్థానిక అధికారులు విముఖత చూపుతుంటారు. బందీల వివరాలు వెల్లడించే దేశాలు సైతం తమ వద్ద జైళ్ళలో ఉన్న విదేశీయులకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ముందుక రావని మంత్రి చెప్పారు.
విదేశాల్లో జైళ్ళలో నిర్బంధంలో ఉన్న జాలర్ల భద్రత, రక్షణ, బాగోగులు చూసుకోవడం వంటి విషయాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు.
వలస చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై వివిధ విదేశీ జైళ్ళలో నిర్బంధంలో ఉన్న భారతీయ జాలర్లకు ఆయా దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తుంది. నిర్బంధంలో ఉన్న జాలర్లు భారతీయులని నిర్ధారించుకున్న తర్వాత వారి విడుదలకు దౌత్యపరంగా అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు విడుదల అనంతరం వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంలో దౌత్య కార్యాలయాలు నిర్విరామంగా పని చేస్తుంటాయని మంత్రి వెల్లడించారు.
జైళ్ళలో బందీలుగా ఉన్న భారతీయ జాలర్లను ఆయా దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల అధికారులు తరచుగా డిటెన్షన్ సెంటర్లను సందర్శిస్తూ వారికి అవసరమైన న్యాయపరమైన సహాయాన్ని అందిస్తాయని చెప్పారు.
ఆరు భారతీయ భాషలకు ప్రాచీన హోదా
దేశంలో తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాళం, ఒడియా వంటి భాషలకు భారత ప్రభుత్వం ప్రాచీన భాష హోదా కల్పించినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ ప్రాచీన భాషలను యునెస్కో బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఒడియా వంటి ప్రాచీన భాషతోపాటు అన్ని భారతీయ భాషల ప్రోత్సాహంపై నూతన విద్యా విధానం దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు.