Suryaa.co.in

Family

కాలగమనం..ఓ చిన్న మననం..! అప్పుడు మనం..!!

ఒక్కసారి వెనక్కి వెళ్తే..
కాలచక్రం నన్నోసారి
గతంలోకి తీసుకుపోతే..
చేజార్చుకున్న అవకాశాలు..
మరచిపోయిన అనుభూతులు..
వెళ్లిపోయిన మనుషులు..
నిర్లక్ష్యం చేసిన సమయం..
ఒడిసిపట్టుకోలేనా..

అసాధ్యమే..
కానీ..కాస్త అనుభూతిస్తే..
ఓ వింత హాయి..
అందమైన గతం..
కొంతైనా అవగతం..!

ఒక్కసారి వెనక్కి వెళ్తే..
తీసుకున్న నిర్ణయాలు
మార్చగలమని కాదు..
తీసుకునే ముందు
ఒకటికి రెండుసార్లు
ఆలోచించవచ్చని..!

చిన్నపిల్లాడిని అయిపోతే..
మళ్లీ బుడిబుడి అడుగులు
వేయాలని కాదు..
నేను వేస్తున్నప్పుడు మురిసిపోయిన
అమ్మ మోము చూడాలని..!

బడి రోజులు తిరిగి రావాలని..
ఏదో నేర్చుకోవాలని కాదు..
బడి వదిలేసిన తర్వాత ఇప్పటివరకు కలవలేకపోయిన స్నేహితులతో ఇంకాస్త ఎక్కువ సమయం గడపాలని..!

మళ్లీ కాలేజీకి వెళ్ళగలిగితే..
లెక్చరర్ల మీద తిరగబడ్డానికి
కాదు..చదువుకున్నది సరిగ్గా అర్థం చేసుకోవాలని..!

ఉద్యోగంలో చేరిన
తొలినాళ్లలోకి తిరిగి వెళ్తే..
పని ఎగ్గొట్టం మరింత నేర్చుకోవాలని కాదు..
మొదటి జీతం అందుకున్న
ఆనందాన్ని మరింతగా
ఆస్వాదించనా..!

నా పిల్లలు మళ్లీ
చిన్న వాళ్ళయిపోతే..
వాళ్ళకి ఇంకా మంచి చదువు ఇవ్వాలని కాదు..
నేను వాళ్ళతో..వాళ్ళు నాతో
ఇంకాస్త ఎక్కువ సమయం గడపవచ్చని..!

గతం గతః
గత జలం సేతుబంధనం

వర్తమానంలోకి వస్తే..
జీవితంలో మిగిలిన కాలం తక్కువే..
నూరేళ్ళు బతికి ఊళ్లేలాలని కాదు..
ఇప్పుడైనా పది మందికి ఏదో ఒకటి చెయ్యాలనే ప్రయత్నంలో పడదామని..!

పోయిన సమయం..
వెళ్లిపోయిన మనుషులు..
తిరిగి రావడం కల్ల..
అది అత్యాశ..
చేయాలనుకున్నవి ఇప్పటికైనా చేసేయ్..
తర్వాత ఎప్పుడో చెయ్యవచ్చని అనుకుంటే
ఈ ఆలోచన మొత్తం వ్యర్థం..
ఈ టైం మెషీన్ ఒక పాఠం..!

సురేష్ కుమార్..ఇ
9948546286

LEAVE A RESPONSE