-
పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన అనుచరుల చేతిలోనే హోటళ్లు
-
వారి అనుచరుల చేతిలోనే సబ్‌లీజుల యవ్వారం
-
అనధికార బుట్టల వ్యాపారాలకు లెక్కే లేదు
-
రోజా హవాతో హోటళ్లు దక్కించుకున్న బెంగళూరు కాంట్రాక్టరు
-
పేరు టూరిజం.. పెత్తనమంతా ప్రైవేటు వ్యక్తులదే
-
లీజు ఒకరిది.. సబ్ లీజు మరొకరికి
-
సబ్ లీజు నిబంధనలు బేఖాతరు
-
మీడియా ప్రతినిధులకూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, షాపులు
-
ఇద్దరు జేఈఓల జమానాలో మీడియా ప్రతినిధులకు షాపులు
-
అందుకే మీడియాలో కొండపై వెలుగుచూడని అవినీతి
-
వాటిని రద్దు చేసే ధైర్యం కొత్త బోర్డుకు ఉందా?
-
‘కొండె’క్కిన నిబంధనలు
-
కొత్త కమిటీ నిబద్ధతకు పరీక్ష
-
గ‘లీజు’ గబ్బు వదిలిస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
వెంకన్న నామస్మరణతో పులకించాల్సిన తిరుమల కొండ.. ప్రైవేటు నామ స్మరణతో ప్రతిధ్వనిస్తోంది. కొండపై అన్యులకు స్థానం ఉండకూడదన్న నిబంధన కొండెక్కింది. కాదు.. కొండెక్కించేశారంతే! లీజు-సబ్ లీజుల వ్యాపారం మూడు హోటళ్లు- ఆరు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లుగా వర్ధిల్లుతోంది. లీజులు తీసుకున్న వ్యాపారులు-స్థానిక జర్నలిస్టులు, వాటిని ఇతరులకు సబ్‌లీజులకు ఇస్తున్నా కొండపై కొలువుదీరిన పాలకులది ఇప్పటికీ ‘ధృతరాష్ట్ర’ దర్శనమే. వీటికి మించి… కూటమి సర్కారు కొలువుదీరి ఇన్ని నెలలయినా, ఇంకా కొండపై వైసీపీ హవానే నడుస్తోంది. వారిని కదిలించే సాహసం కొత్త కమిటీ చేస్తుందా? సబ్ లీజుల యవ్వారానికి పాతర వేస్తుందా? అక్రమాలకు పాతర వేసి తన నిబద్ధత చాటుకుంటుందా? లేక ఇదంతా ‘మామూలే’ అనుకుని, టీటీడీ దర్శనాల సిఫార్సు లేఖలతోనే సరిపెట్టుకుంటుందా? ఇదీ ఇప్పుడు కూటమి వర్గాల్లో హాట్ టాపిక్.
కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతోంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తిరుమల కొండపై మాత్రం.. ‘కూటమి ఇంకా అధికారంలోకి వచ్చిన దాఖలాలు’ ఏమీ కనిపించడం లేదు. ఇంకా వైసీపీ హవానే నడుస్తోంది. ఎందుకంటే అప్పటి అధికారులే… వైసీపీ నేతల హోటళ్లే కొనసాగుతున్నాయి కాబట్టి! కాకపోతే కొత్తగా భూమన కరుణాకర్‌రెడ్డి పోయి బీఆర్ నాయుడు వచ్చారు. అంటే రెడ్డి గారు వెళ్లి నాయుడుగారొచ్చారు. ఇంకా చెప్పాలంటే.. రెడ్డిపోయి నాయుడొచ్చె ఢాం..ఢాం..ఢాం అన్నమాట. మిగిలినదంతా సేమ్‌టు సేమ్.
వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా అనుచరులు తిరుమల కొండను తమ అనుచరులతో నింపేశారన్న ఆరోపణలు ఉండేవి. ముఖ్యంగా చెవిరెడ్డి అనుచరులు కొండపై హోటళ్లు యధేచ్చగా లీజుకు తీసుకుని, వాటని సబ్లీజుకు ఇచ్చేశారన్న ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవి వారి పెత్తనం కిందే నడుస్తుండటం విశేషం.
అప్పట్లో కొండపై చెవిరెడ్డి అనుచరులకే హోటళ్లు ఎక్కువగా ఉండేవి. వాటిని లీజుకు తీసుకున్న చెవిరెడ్డి అనుచరులు, ఎక్కువ ధరకు సబ్లీజుకు ఇచ్చేవారన్న ఆరోపణలు, అప్పుడే వచ్చినా పట్టించుకున్న దిక్కులేదు. నిజానికి అది నిబంధనలకు విరుద్ధం. సబ్‌లీజు పద్ధతి టీటీడీలో లేదు. ఇక ఇద్దరు జేఈఓల జమానాలో కొండపై ప్రముఖ చానెళ్లు, పత్రికల్లో పనిచేసే విలేకరులకు ఫాస్ట్ఫుడ్సెంటర్లు, చిన్న హోటళ్లు లీజుకు ఇచ్చారు. ఇందులో ఒకరు టీడీపీలో ఉన్నప్పుడు వెలిగిపోయిన జేఈఓ కాగా, మరొకరు మొన్నటి వరకూ హవా సాగించిన జేఈఓ కావడం గమనార్హం.
ఇక పెద్ద మీడియా సంస్థలు, చానెళ్ల ప్రతినిధులకు దర్శనం కోటాలు కూడా ఇవ్వడం మరో విశేషం. ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను లీజులకు తీసుకున్న స్థానిక విలేకరులు.. వాటిని రోజుకు 25 వేల రూపాయల చొప్పున, సబ్లీజుకు ఇస్తున్న వ్యవహారం విజయవంతంగా కొనసాగుతోంది.
అందుకే ఆ ఇద్దరు జేఈఓలు ఉన్నప్పుడు, కొండపై జరిగే అవినీతి బయటకు పొక్కేది కాదు. అవి మీడియాలో రాకుండా ఉండేందుకే.. ఆ ఇద్దరు జేఈఓలు, ఈవిధంగా క్విడ్‌ప్రోకో సిద్ధాంతం పాటించారన్న ఆరోపణలుండేవి. ఇక హోటళ్లను రోజూ లక్ష నుంచి 5 లక్షల అద్దెపేరిట సబ్లీజుకు ఇస్తున్న పద్ధతి ఇంకా కొనసాగుతోంది. వీరంతా చెవిరెడ్డి అనుచరులేనన్నది ఒక ఆరోపణ.
ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి జమానాలో కొండపై నుంచి కిందవరకూ.. ఫుట్‌పాత్, బుట్టలపై వ్యాపారాలు విచ్చలవిడిగా సాగేది. వాటికి లైసెన్సులు ఉండాలి. కానీ అవేమీ లేకుండా వారికి అనధికార లైసెన్సులు ఇచ్చేశారు. వైసీపీ కార్యకర్తలు వాటిని తీసుకుని, వ్యాపారులకు రోజువారీ చెల్లింపుల కింద ఇస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. భూమన అనుచరులకూ, కొండపై హోటళ్లు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. పలు హోటళ్లను టూరిజం శాఖ పేరిట లీజుకు తీసుకుని, వాటి నిర్వహణను బెంగళూరుకు చెందిన ఒక బడా వ్యాపారికి అనధికారికంగా అప్పగించడం వివాదమయింది. ఆ వ్యవహారంలో దాదాపు 5 కోట్లు చేతులు మారాయాన్న ఆరోపణలు లేకపోలేదు. విచిత్రంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. రోజా కట్టబెట్టిన కాంట్రాక్టరే, టూరిజం పేరుతో హోటల్ నడుపుతున్నారు.
ఒక కులానికి చెందిన చౌల్ట్రీ కూడా అనధికారికంగా హోటల్ నడుపుతుంటే, దానిని కూడా సబ్‌లీజుల పేరుతో లక్షలు గడిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కొండపై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నుంచి హోటళ్ల వరకూ అంతా టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ అజమాయిషీలోనే ఉంటుంది. ఆ విభాగం లైసెన్సు ఇచ్చి, సర్టిఫై చేస్తేనే హోటళ్లను కొనసాగించాలి. కానీ ఆ నిబంధనలు కూడా కొండెక్కించేశారు. అసలు ఇప్పటిదాకా హెల్త్ డిపార్టుమెంట్, ఎన్ని హోటళ్లకు లైసెన్సు ఇచ్చింది? ఎన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను తనిఖీ చేసింది? ఎన్నిటిని సీజ్ చేసిందనే లెక్కలే లేకపోవడం ఆశ్చర్యం.
మరి వీటిని రద్దు చేసే ధైర్యం కొత్త పాలకవర్గానికి ఉందా? అన్న చర్చకు తెరలేచింది. ప్రధానంగా రోజా బెంగళూరు కాంట్రాక్టరుకు అనధికారికంగా ఇచ్చిన సబ్లీజును రద్దు చేస్తారా? కొనసాగిస్తారో చూడాలి. వైఎస్ హయాంలో వుడ్‌సైడ్ హోటల్‌కు ఇచ్చిన లీజును దుర్వినియోగం చేసి, సబ్లీజుకై ఇచ్చిన వైనంపై టీటీడీ బోర్డు కన్నెర్ర చేసి, ఆ లీజు రద్దు చేసింది. అంటే టీటీడీ ఇచ్చిన లీజులను, ఎప్పుడనా రద్దు చేసే అధికారం ఉంది. మరి ‘మంచిప్రభుత్వం’లో.. కొండపై వైసీపీ హవాకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? రెడ్‌సిగ్నల్ వేస్తుందా చూడాలి.