(భూమా బాబు)
నేడు దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుడుతోంది. లక్షలాది తల్లుల కళ్ళలో ఆశల జ్యోతిని వెలిగించే చరిత్రాత్మక ఘట్టమిది! తమ బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే, అనంతమైన త్యాగాలతో జీవించే ప్రతి తల్లికీ, కూటమి ప్రభుత్వం అందించే “తల్లికి వందనం” పథకం ఒక భరోసా. ఇది వారి గుండె బరువును దింపి, బిడ్డల చిరునవ్వులను మురిపెంగా చూసుకొనేలా చేసే శుభ దినం.
రాష్ట్రంలోని 67,27,164 మంది విద్యార్థుల తల్లుల జీవితాల్లో అపూర్వమైన మార్పును తేబోయే ఈ నిర్ణయం, కేవలం నిధుల బదిలీ కాదు, అది భావి తరాల రాతలను మార్చబోతోంది.
మూగవేదనకు ముగింపు… ఆశల ఆకాశం!
ప్రతి తల్లికీ తన పిల్లలే ప్రాణం. వారి చదువు, వారి ఉన్నతి తప్ప మరో ధ్యాస ఉండదు. కానీ దారిద్ర్యం, ఆర్థిక ఒడిదొడుకులు ఆ సుందర స్వప్నాలను పదే పదే కలవరపరిచేవి. బడి ఫీజులు, పుస్తకాల ఖర్చులు, యూనిఫామ్‌ల భారం… ఈ ఆలోచనలన్నీ తల్లిదండ్రుల గుండెలపై బండగా కూర్చునేవి.
తమ బిడ్డలు ఉన్నత చదువులు చదవాలనుకున్నా, చేతిలో చిల్లిగవ్వ లేని నిస్సహాయత వారిని మూగవేదనలోకి నెట్టేది. ఆ భారాన్ని, ఆ వేదనను మౌనంగా భరించిన వేలాది తల్లుల ప్రార్థనలకు, నిరీక్షణలకు ఇప్పుడు ప్రతిఫలం లభిస్తోంది.
నేడు రూ. 8745 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇది కేవలం అంకెల చేరిక కాదు, అది లక్షల తల్లుల కలలకు, శ్రమకు దక్కిన నిజమైన గౌరవం! వారి కళ్ళలో వెలిగే ఆనందపు తళుకులు, మనసుల ఆనందం ఒకటే చెబుతాయి: “నా బిడ్డల చదువు ఇక ఆగదు! నిన్నటి వరకు మసకబారిన భవిష్యత్తుకు రేపు కొత్త రంగులద్దుతాను!”
వివక్షలేని విద్య… దేశానికే దిక్సూచి!
ఈ పథకం వెనుక ఉన్న దార్శనికత అద్భుతం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా, ప్రతి ఒక్కరికీ సమాన విద్యావకాశాలు కల్పించడం దీని ముఖ్య లక్ష్యం. ఒకే కుటుంబంలో పలువురు పిల్లలుంటే, వారి చదువుల భారం మరింత పెరిగిపోతుంది. అలాంటి వారికి అండగా నిలవడం, ప్రతి బిడ్డకూ నిస్సంకోచంగా ఆర్థిక సహాయం అందించడం – ఇది భారతదేశ విద్యా విధానంలోనే ఒక నూతన శకం, విప్లవాత్మక అడుగు!
లింగ భేదం లేకుండా (అబ్బాయి అయినా, అమ్మాయి అయినా), వయసుతో సంబంధం లేకుండా (ఒకటో తరగతిలో అడుగుపెట్టే చిన్నారుల నుంచి ఇంటర్ పూర్తి చేసే విద్యార్థుల వరకు), ప్రతి బిడ్డకూ చదువుకునే హక్కుకు ఆర్థిక అండ లభిస్తుంది.
“ఆడపిల్లకు చదువు ఎందుకు?” అనే పాత ఆలోచనలు సమసిపోతాయి. “వెనుకబడిన రెండో బిడ్డకు చదువు ఆపేయాలి” అని గుండె పగిలిన తల్లికి ఇప్పుడు “అమ్ములూ! నీకూ, నీ అన్నయ్యకీ, నీ అక్కయ్యకీ కూడా చదువుకు ఢోకాలేదు!” అని సంతోషంగా చెప్పగల ధైర్యం వస్తుంది. ఇది కేవలం చదువుల పథకం కాదు, సామాజిక సమానత్వానికి పునాది వేసే ఒక గొప్ప సంస్కరణ!
సామాజిక పరివర్తన… ఉజ్వల భవిష్యత్తుకు బాటలు!
బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే ఆ మొత్తం… కేవలం డబ్బు కాదు, అది ఆత్మవిశ్వాసం! నిరాశ నుంచి ఉపశమనం వైపు, భయం నుంచి భరోసా వైపు తల్లులు చేసే ప్రయాణానికి అది ప్రతీక. ఆ ఒక్క క్షణం, వారి కళ్లలో తడి, పెదాలపై చిరునవ్వు… విశ్వాసంతో భరించిన ప్రతి కష్టానికీ లభించిన అమూల్యమైన ఫలితం అది!
“తల్లికి వందనం” కేవలం ఒక పథకం పేరు కాదు.
ఇది ఆర్థిక సంకెళ్లను తెంచే వరం.
ఇది ఆడపిల్లల విద్యపట్ల ఉన్న వివక్షకు అడ్డుకట్ట వేసే బలం.
సంతానం ఎంతమంది వున్నా సంతోషంగా బడికి పంపే సంక్షేమ పాలనా సంస్కరణ.
జనాభాను పెంచే తల్లుల త్యాగాన్ని గుర్తించి, వారి మొహాన్ని చిరునవ్వులతో వెలిగించే ఒక సామాజిక గౌరవం!
ఈ పథకం ద్వారా గ్రామీణ ఇళ్లల్లో పిల్లలు పుస్తకాలతో పరిగెత్తే దృశ్యాలు ఇక నిత్యం కనిపిస్తాయి. నిశ్శబ్దం అలముకున్న బడుల్లో ఇప్పుడు ఆనందపు సందళ్లు మార్మోగుతాయి. తల్లుల భుజాలపై ఉన్న చదువుల భారం తగ్గడంతో, వారు మరింత గర్వంగా, నిటారుగా నిలబడతారు.
ఈ రోజు తల్లుల కళ్లలో వెలిగే ఆశల దీపం, రేపు రాష్ట్రాన్ని ఉన్నత విద్యావంతులతో నింపుతుంది. ఒక్కరూ వెనుకబడకుండా, ప్రతి బిడ్డనూ ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దే సంకల్పానికి ఇదే తొలిమెట్టు!
ఈ పథకం ద్వారా ప్రతి చిన్నారికి చదువు అందించడం తనకు చేతకాదు, విద్యాశాఖ మంత్రిగా యువకుడు లోకేశ్ అమలు చెయ్యలేడని, ముందే కూసిన కోయిల లెక్కన మాట్లాడిన జగన్ మాటలు మారుమోగిపోవాలి రేపటి నుండి. జగనే బ్రాండ్ అంబాసిడర్ లోకేశ్ తల్లికి వందనం పథకానికి.