Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో విద్య, వైద్యం అందని ద్రాక్ష

వెంటిలేటర్ పై వైద్యం
జగన్ పదవ తరగతి రిజల్డ్ గురించి ఎందుకు మాట్లాడలేదు?
ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు
చంద్రబాబునాయుడు హయాంలో 7 డిఎస్సీలు వేశారు
నాడు-నేడులో పూర్తి అవినీతి
దేవాలయంలాంటి అసెంబ్లీలో మాట్లాడే హక్కు జగన్ కు లేదు
రీయంబర్స్ మెంట్ ఎగ్గొట్టే నీవా అసెంబ్లీలో విద్య గురించి మాట్లాడేది?
ఉత్తుత్తి అడ్వర్ టైజ్ మెంట్ ఉత్తుత్తి శిలాఫలకం
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 

రాష్ట్రంలో విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారంది. జగన్ తన పాదయాత్రలో పదే పదే అబద్ధాలు, అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేశారు. శాసనసభలో జగన్ విద్య, వైద్యం మీద మాట్లాడారు. విద్య , వైద్యం రెండూ సమాజానికి అవసరం. జగన్.. నాడు నేడు అని మోసం చేయడం దుర్మార్గం. నాడు నేడు లో విప్లవాత్మకమార్పులు తెచ్చామన్నారు. నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారం చంద్రబాబు హయాంలో నాణ్యమైన విద్యను అందించడంలో రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఈ విషయం రికార్డుల్లో క్లీయర్ గా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2020-21 లో 19వ స్థానానికి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో జగన్ అసెంబ్లీలో చెప్పి ఉంటే బాగుండేది.

స్కూల్స్ లను అధపాతాళానికి నెట్టేశారు. విద్యా రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. రాష్ట్రంలోని 1,160 పాఠశాలల్లో రైతు భరోసా, గ్రామ సచివాలయాలను తొలగించవద్దని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అయినా ఖాతరు చేయడంలేదు. జగన్ రెడ్డి దృష్టిలో విద్య మిథ్యగా మారింది. అసెంబ్లీలో అనేక మాటలు మాట్లాడిన జగన్ పదవ తరగతి రిజల్డ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉండివుంటే పదవ తరగతి ఫలితాలలో తక్కువ మంది విద్యార్థులు ఎందుకు పాసయ్యారు?

నాణ్యమైన విద్య అందించి ఉంటే పదవ తరగతి రిజల్టులో కనిపించేది. 2018లో చంద్రబాబు హయాంలో పదవ తరగతిలో 94.80 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదికాస్త 2022లో జగన్ హయాంలో 67.26 శాతానికి పడిపోయింది. ఎందుకు తగ్గిందో జగన్ అసెంబ్లీలో చెప్పాల్సింది. తెలంగాణలో 90శాతం, తమిళనాడులో 90.07 శాతం, కర్నాటక 85.06 , కేరళలో 99 శాతం వచ్చింది. కరనా ప్రభావమైతే మిగతా రాష్ట్రాల్లో ఇంత రిజల్ట్ ఎలా వచ్చింది? ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలో ఇంత తక్కువ శాతం ఫలితాలు వచ్చాయి. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ పెడతానన్నారు. మూడున్నర సంవత్సరాలైనా ఒక్క డీఎస్సీని వేయలేదు, ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు.

చంద్రబాబునాయుడు హయాంలో 7 డిఎస్సీలు వేశారు. 2 లక్షల 70 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఉపాధ్యాయులను విద్యాబోధనకు ఉపయోగించకుండా కోవిడ్ సమయంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం షాపుల వద్ద క్యూలైన్లను సరిదిద్దడానికి పెట్టిన ఘనత జగన్ ది. ఉపాధ్యాయులను బాత్ రూములు కడిగి అప్ లోడ్ చేయమనడం అవమానకరం. సీపీఎస్ రద్దు లేదు. ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం హేయమైన చర్య. ఏకపక్షంగా అసెంబ్లీని నడిపారు. ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇవ్వకుండా బహిష్కరించారు. ప్రాథమిక విద్య అనేది 1వ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు. ప్రాథమిక విద్యను విడగొడుతూ 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియకు ఎందుకు శ్రీకారం చుట్టారో అసెంబ్లీలో చెప్పాల్సింది.

ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంవల్ల రాష్ట్రంలో 11 వేల పాఠశాలలు మూతపడుతున్నాయి. ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 41 ప్రాథమిక పాఠశాలలు మూతపడుతున్నాయి. రద్దు చేయడంలేదని ముఖ్యమంత్రి అతి తెలివిగా మాట్లాడుతున్నాడు. 1,2 తరగతులు చదివే క్లాసులలో 20 మంది కంటే తక్కువ పిల్లలున్నారు, 20 మంది కంటే తక్కువ పిల్లలున్నప్పుడు ఆ స్కూళ్లను రన్ చేయలేమని చెప్పి ఆ స్కూళ్లని రద్దు చేసేస్తారు. వచ్చే సంవత్సరం జరిగేది ఇదే. ఈ విషయం రాసి పెట్టుకోండి.

మా తాత, ముత్తాతల కాలం నుండి ఐఏఎస్, ఐపీఎస్ లుగా మార్చిన ప్రాథమిక స్కూళ్లను మూయించేస్తున్న జగనా విద్య గురించి మాట్లాడేది? నాడు-నేడులో పూర్తి అవినీతికి పాల్పడ్డారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. నాడు నేడు లో అవినీతికి పాల్పడి ఆ స్కూళ్లనే మూత వేసే పరిస్థితుల్లో ఉన్నారు. నాడు-నేడుకు పెట్టే నిధులు ఏమౌతాయి? కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్స్ లన్నింటిని మీరే రద్దు చేస్తారు. 30 వేల టీచర్ పోస్టులను ఎగ్గొట్టడానికి చూస్తున్నారు. ప్రాథమిక విద్య ను నాశనం చేస్తున్నారు. విద్య ప్రాథమిక హక్కని డాక్టర్ అంబేద్కర్ తెలిపారు. చిన్న పిల్లలను ఇబ్బందులపాలు చేయడం సరికాదు.

దేవాలయంలాంటి అసెంబ్లీలో మాట్లాడే హక్కు జగన్ కు లేదు. విద్య పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా స్కూల్స్ విలీనాన్ని తక్షణం నిలుపుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం అమలు చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ స్కూల్స్ విలీనాన్ని అంగీకరించడంలేదు. విదేశీ విద్యను అందించలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి హయాం నుండి ఫీజు రీయంబర్స్ మెంట్ అమలౌతోంది. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు పిల్లలకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో కంటిన్యూ చేశారు.

జగన్ అధికారంలోకి రాగానే తన తండ్రి పెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ ని కూడా ఎగ్గొట్టిన ఘనుడు. జగన్ విద్యా దీవెన అని పేరు పెట్టి నాలుగు ముక్కలు చేశారు. నాలుగు సార్లు ఫేక్ పేపర్ అడ్వర్ట్ టైజ్ మెంట్ ఇస్తున్నారు. గత సంవత్సరంలో ఫీజు రీయబంబర్స్ మెంట్ నాలుగో ముక్క ఎగ్గొట్టడంవల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బీటెక్, ఎంసీఏ, వందలాదిమంది తమ వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
తెల్లరేషన్ కార్డుదారుడు అర్హుడుగా ఉండే ఈ పథకాన్ని తూట్లు పొడిచారు. 15 సంవత్సరాలుగా పీజు రీయంబర్స్ మెంటు కొనసాగుతూ వస్తోంది. అలాంటిదాన్ని 300 యూనిట్లు కరెంటు వినియోగం దాటినా, 300 అడుగులకు మించి ఇల్లు ఉన్నా, బతకడానికి కారు తిప్పుకున్నా ఫీజు రీయంబర్స్ మెంటు ఉండదు. బ్యాంకు లోను కోసం వెళితే ఐటీ చూపిస్తే ఫీజు రీయంబర్స్ మెంట్ ఉండదు. రెక్కాడతేగానీ డొక్కాడని వారికి కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అనేక ఆంక్షలు పెట్టి ఫీజు రీయంబర్స్ మెంట్ ఎగ్గొట్టే నీవా అసెంబ్లీలో విద్య గురించి మాట్లాడేది?

ఓపెన్ డిబేట్ కు రెడీగా ఉన్నాం. రాష్ట్రంలో వైద్యం వెంటిలేటర్ పై ఉంది. సాక్షాత్తు నీతిఆయోగ్ రిపోర్టులే చెబుతున్నాయి. ఈ మూడున్నర సంవత్సరాల్లో ఆరోగ్యరంగం పనితీరు రెండు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. పనితీరు మెరుగులో 2 వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో జగన్ అసెంబ్లీలో మాట్లాడివుంటే బాగుండేది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా టీడీపీ హయాంలో కోటి 30 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం. వైసీపీవారు 18 లక్షల 75 వేలు మాత్రమే ఇచ్చారు.

సీఎంఆర్ ఎఫ్ ను తూట్లు పొడిచి ఎగ్గొట్టారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోలేకపోయినా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా బిల్లులు తీసుకొచ్చి ఇస్తే, ఆ సీఎంఆర్ ఎఫ్ ద్వారా చంద్రబాబునాయుడు ఆ కుటుంబాన్ని రోడ్డుమీద పడకుండా, అప్పులపాలు కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారు. టీడీపీ హయాంలో నా కార్యాలయంలోనే 50 నుంచి 60 మందికి ప్రతి వారం సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందజేసేవారం. నా నియోజకవర్గంలో రెండు నెలలు ఆలస్యమైతే 300 మందికి సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేశాం. వెయ్యి మంది అప్లై చేసుకుంటే ఒకరికి వస్తోంది. ముఖ్యమంత్రి ఎక్కడో ఉండి బటన్ నొక్కితే 16 ప్రాంతాలలో అక్కడి మంత్రులు శిలాఫలకాలను ఆవిష్కరించే పరిస్థితి నేడు ఉంది.
మెడికల్ కాలేజీ నిర్మాణం కావాలంటే 500 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 26 జిల్లాలలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెబుతున్నారు. 26 జిల్లాలకి 26 మెడికల్ కాలేజీలు 13వేల 500 కోట్లు కావాలి. బడ్జెట్ లో 300 కోట్లు మాత్రం పెట్టారు. అది ఏ మూలకు సరిపోదు. బటన్ నొక్కారు సాక్షిలో కలర్ ఫుల్ అడ్వర్ టైజ్ మెంట్ వేశారు.

మీ మంత్రులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిధులు మాత్రం బడ్జెట్ లో లేకపోవడంవల్ల ఉత్తుత్తి బటన్ అయింది, ఉత్తుత్తి అడ్వర్ టైజ్ మెంట్ ఉత్తుత్తి శిలాఫలకం అయింది. పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శిలాఫలకం వేసిన చోటికి వెళ్లాను. అక్కడ శిలాఫలకం లేదు, ఆ భూమి పీకల్లోతు నీళ్లతో ఉంది. ఆరోజు మా మీద ప్రెజర్ పెట్టి మా భూములు ప్రభుత్వం తీసుకుంది. మెడికల్ కాలేజీ కదా సహకరించండని మీరు చెబితే సహకరించాం మెడికల్ కాలేజీకి భూములిచ్చి మూడు సంవత్సరాలైంది ఆ భూములకు డబ్బులు కూడా మాకు ఇవ్వలేదని మెడికల్ కాలేజీకి స్థలం ఇచ్చిన రైతులు వాపోయారు. వైసీపీ ప్రభుత్వపు బూటకపు విద్య, వైద్య విధానాన్ని ప్రజల్లో ఎండగడతాం

LEAVE A RESPONSE