– తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంది
– ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వికారాబాద్ : ఒక మంచి ఎకో టూరిజం పార్క్ ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉంది.ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లింది. రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది. దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం.
రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నాం. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నాం.
ఎక్స్పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుంది. వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ ఈ పార్క్ ను అభివృద్ధి చేయడం అభినందనీయం.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంది. వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నాం.
పార్కుని చూసి నేను, రేవంత్ రెడ్డి షాక్ అయ్యాం: చిరంజీవి
విలువైన భూమి ఉంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారని, కానీ రాందేవ్ రావు ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కును ఏర్పాటు చేశారని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. హైదరాబాద్‌కు విలువైన మొక్కలను తీసుకువచ్చారన్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో 150 ఎకరాల్లో రాందేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో 25 వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ పార్కులో రూ.1 లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఉన్నాయి.
“రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్‌పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశాను. 2000వ సంవత్సరంలోనే దీని గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నాను. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు. కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్కుని నిర్మించారు. ఈ రకంగా రాం దేవ్ ఓ మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఈ ఎక్స్‌పీరియం పార్కుని చూసి నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ అయ్యాం. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పార్కుని చూసి షూటింగ్‌కు ఇస్తారా? అని రాందేవ్‌ను అడిగాను. ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామని అన్నారు. కానీ ఈ ఎండలో నేను ఇక్కడ హీరోయిన్‌తో స్టెప్పులు వేయడం అంటే కాస్త కష్టమే. వర్షాకాలం తరువాత ఇక్కడ మరింత పచ్చదనం వస్తుంది. ఆ టైంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువైనదిగా ఉంటుంది.
దేశవిదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం అభినందనీయం. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకు రావడం ఆనందంగా ఉంది” అని చిరంజీవి వివరించారు.