Suryaa.co.in

Features

జాడలేని జాతీయ సేవా పథకం -విద్యాలయాలలో కనుమరుగవుతున్న సామాజిక సామరస్యం

మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఉంది ఇప్పుడు మన జాతీయ సేవా పథకం. విద్యార్థులు నిస్వార్థంగా సేవ చేస్తే కళాశాల ప్రోగ్రాం ఆఫిసరుకు అలాగే కళాశాలల్లో విద్యార్థులందరూ కలిసికట్టుగా పని చేస్తే విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ అధికారి ని రాష్ట్ర జాతీయ స్థాయిలో అభినందిస్తారు. కేవలం తమ కెరీర్ కోసం ప్రాకులాడే వారు కొందరు. ఖరీదైన అట్టముక్క చెక్క జ్ఞాపిక జీవన సాఫల్య పురస్కారాల కోసం, గణతంత్ర, స్వతంత్ర దినోత్సవం రోజు ప్రశంసా పత్రం కోసం ప్రాకులాడే వారు ఎక్కువయ్యారు.

వీరికి భిన్నంగా కొంత మంది సమాజ సేవకులు ఎలాంటి గుర్తింపు లేకుండా మెరుగైన పౌర సమాజం కోసం తపిస్తుంటారు. 2015 నాటి ప్యారిస్ ఒప్పందం ప్రకారం అత్యధిక కార్బన్ డైక్సైడ్ విడుదల చేస్తున్న అభివృద్ధి చేస్తున్న పెట్టుబడి దేశాలు, భారతదేశంతో సహా కార్బన్ ఉద్గారాలు తగ్గించకపోతే, తొందరలో ఈ పెరుగుదల 2 సి చేరుకుంటుంది హెచ్చరిస్తున్నారు. దాని పర్యవసానాలు ఒకవైపు మంచు తుఫాను, మరో వైపు వేడి గాలులు, అరణ్యాలు తగలబడడం అత్యధికంగా అవపాతం ఏర్పడి వాతావరణ సమతుల్యత దెబ్బతిని కరువు కాటకాలు ఉత్పన్నమవుతాయి.

ఉష్ణమండల ప్రాంతాలల్లో తుఫానులు, అల్పపీడనాలు, మంచు ఖండికలు కరిగి నదులు ఉప్పొంగి సముద్ర మట్టాలు పెరిగి జనజీవనం అతలాకుతలమై జీవావరణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. వలసలు, కరువుకాటకాలు, వేలాది వృక్షాలు, జంతువులు భూమిపైన కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వీటిని నివారించడానికి పర్యావరణవేత్తలు సమాజహితం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వారు అరుదుగా ఉంటారు. ఈ కోవలోకి చెందిన వారు మేధాపాట్కర్, గ్రెటా థన్ బర్గ్, దిశ రవి, ఝాదవ్ పెంగ్.

విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించాల్సింది యువకులే. ప్రతి దేశ పురోభివృద్ధిలో, ఉద్యమాలలోనూ విద్యార్థులు పాలుపంచుకుంటారు. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ కావచ్చు కానీ కల్లాకపటం తెలియని నిర్మల మనస్కులు వీరు. వీరు కూడా సంఘజీవులే, సంఘంలో భాగస్వాములే, కాబట్టి సంఘసేవ వాళ్ళకి బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణం.

అదేవిధంగా మనం పదిమందిలో ఉన్నప్పుడు మనవల్ల ఆ పదిమందికీ ప్రయోజనం వుండాలి- లేదా మనవల్ల మరొకరికి మేలు కలగాలి. ఆ విధంగా పరస్పర సహకారంగా, పరోపకారంగా, మంచిగా మెలగటమే సంఘసేవడా. డి.ఎస్. కొఠారి (1964-66) నేతృత్వంలోని విద్యా కమీషన్, విద్య అన్ని దశలలో ఉన్న విద్యార్థులను ఏదో ఒక విధమైన సామాజిక సేవతో ముడిపెట్టాలని సిఫారసు చేసింది. ఏప్రిల్ 1967 సంవత్సరంలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి వారి సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు.

అయితే అప్పటికే విశ్వవిద్యాలయ దశలో, స్వచ్ఛంద ప్రాతిపదికన ఉనికిలో ఉన్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సి సి) లో చేరడానికి విద్యార్థులను అనుమతించాలని, దీనికి ప్రత్యామ్నాయాన్ని నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్) అని పిలువబడే కొత్త కార్యక్రమం రూపంలో వారికి అందించవచ్చని వారు సిఫార్సు చేశారు. 1969 సంవత్సరంలో సెప్టెంబరులో జరిగిన వైస్ చాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఈ సిఫారసు ప్రకారం గా,సమస్యలు వివరంగా పరిశీలించడానికి వైస్ చాన్సలర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయవచ్చని సూచించారు. భారత ప్రభుత్వ విద్యపై జాతీయ విధానం ప్రకటనలో, పని అనుభవం, జాతీయ సేవ విద్యలో అంతర్భాగంగా ఉండాలని నిర్దేశించబడింది.

మే, 1969 సంవత్సరంలో, విద్యా మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల ప్రతినిధుల సమావేశం కూడా ఏకగ్రీవంగా ‘జాతీయ సేవ జాతీయ సమైక్యతకు శక్తివంతమైన సాధనం కాగలదని ప్రకటించింది. పట్టణ విద్యార్థులను గ్రామీణ జీవితానికి పరిచయం చేయడానికి, తద్వారా దేశ పురోభివృద్ధికి, అభ్యున్నతికి విద్యార్థి సమాజం చేస్తున్న కృషికి చిహ్నంగా ఉంటుందని జాతీయ సేవా పథకం తీసుకరావడం జరిగింది. 1969 సెప్టెంబరు 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు 37 విశ్వవిద్యాలయాలలో జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ పథకం అమలుకు సహాయం,సహకారాన్ని కోరారు.

గత నాలుగు సంవత్సరాలుగా జాతీయ సేవ పథకం కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో సేవ తక్కువ ప్రచారం ఎక్కువగా ఉంటున్నది. మానవ సంబంధాలు ఏమాత్రం లేని వారిని ఏరికోరి ప్రోగ్రాం ఆఫిసర్లుగా నియమిస్తున్నారు. ప్రతి విశ్వవిద్యాలయం పరిధిలో కనీసం లక్ష మంది విద్యార్థులు ఉంటున్నారు, మారుమూల ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కనీసం రెండువేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు సంవత్సరానికి నాలుగు రోజులు రోజు నాలుగు పనిగంటలు అంటే సుమారు పదహారు వేల పనిగంటలు సమయంతో ఎన్నో పనులు చేయవచ్చు.

ఎన్నో శాశ్విత పథకాలకు రూపకల్పన చేయవచ్చు. ఇరవై సంవత్సరాల క్రిందట జన్మభూమి పథకంలో సేవ కార్యక్రమాలు విద్యార్థులు అధ్యాపకులు భాగస్వామ్యం అయ్యారు, కొన్ని సందర్భాలలో మైక్రో లెవెల్ సర్వే విద్యార్థులతో నిర్వహించారు. జాతీయ సేవ పథకానికి ఎంతో గుర్తింపు ఉండేది. గ్రామాలను దత్తత తీసుకునే వారు, గ్రామాభ్యుదయం, ప్రజల జీవన సరళి, వైవిధ్యత, జాతీయ సమైక్యత భావన విద్యార్థులలో ఉండేది. విశ్వవిద్యాలయాలలో యూత్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ జరిగేవి. దేశంలో వివిధ ప్రాంతాల సంస్కృతి, ఆహార అలవాట్లు, ఆచారాలు, కట్టుబాట్లు తెలిసేది.

సమాజం అవసరాలు, సమస్యలను గుర్తించడం వాటి సమస్యా పరిష్కారాలు ఉండటం. తమలో తాము సామాజిక, పౌర బాధ్యతల భావనను పెంపొందించుకోవడం. వ్యక్తిగత,కమ్యూనిటీ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడంలో వారి జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం. కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని సమీకరించడంలో నైపుణ్యాలను పొందడం. నాయకత్వ లక్షణాలను, ప్రజాస్వామిక విలువలను పెంచుకోవడం. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యాన్ని అభ్యసించడం ప్రధాన లక్ష్యాలు గా పని చేస్తే ఉత్తమ పౌర సమాజం ఆశించవచ్చు. సేవా దృక్పథం లేని సమాజం వృధా.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE