అధికార మార్పిడి!

( వ్యంగ్య పురాణ శ్రవణం)

హమ్మయ్య! ఎట్టకేలకు అధికార మార్పిడి జరిగింది!! 75 ఏళ్ల భారత రాజ్యాంగం సాక్షిగా ఎన్నికలస్వామ్యానికి ధన, కుల, మతోన్మాద మద్యo ఎక్కించి భ్రష్టు పట్టిస్తుంటే ఎరగనట్టు నటిస్తున్న వారందరినీ మౌన ప్రేక్షకులుగా నిమంత్రించ గలిగాము.

పూర్వం బ్రిటిష్ మౌంట్ బాటన్ నుండి కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ అధికారం స్వీకరిస్తే, ఇప్పుడు (అబద్ధపు) మహా మంత్రదండం సింగోలు సాక్షిగా, దేశ ప్రధాని మోడీ నుండి రాజాధిరాజ రాజమార్తాండ శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర సార్వభౌముల వారు అధికారిక మంత్రోచ్ఛాటనల నడుమ స్వీయ నిర్మిత రాజప్రసాదంలో అధికారాన్ని స్వీకరించి నూతన మహాసింహాసనం అధిష్టించారు!!!

హస్తినాపుర రాజ్యాన్ని క్రీస్తుకు పూర్వం 2023 కాలానికి ఫ్లాష్ బ్యాక్ లోకి పంపి చూపగలిగాము.
శుభకార్యాలకు మనుధార్మిక అనుమతి లేనందువల్ల రాజమాతను తెరవెనుకనే నిలుపగలిగాము. పిల్లి మంత్రాల ప్రతిపక్షాన్ని అల్లంత దూరంలోనే ఆపగలిగాము. అయినా ఒక్క శిరోభారం వేధిస్తోంది. హస్తినాపురం వీధులలో అదే రోజు మల్లయోధ మహిళల్ని ఈడ్చి ఈడ్చి గుంజుకెళ్లి నిర్బంధించవలసి వచ్చింది.

బేటి బచావో అంటే కుమారీ శతకం వరకు పఢావో అని అర్థం. ఆడపిల్లలకు ఇంటి పనులు వంట పనులు తప్ప ఆటలు కూడదoటే , ఏకంగా కుస్తీ పోటీలకు సిద్ధమై ప్రపంచ క్రీడాస్థలిలో గెలిచి బహుమతులు సాధించేయటమే! పతకాలపై పతకాలు సాధించిరే పో! మమ్ములను సాధించే విధంగా తరతరాల సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తూ మా రాజ్య ప్రతినిధిపై అన్యాయపు ఆరోపణలు చేస్తారా? అణిగి మణిగి ఉండవలసిన ఆడపిల్లలు నడి వీధులలో ఆందోళనలు, అలజడులు చేస్తూ అల్లర్లు సృష్టిస్తారా? మా శత్రువులతో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడతారా? చూశారుగా మా తఢాకా! కుస్తీ పట్లు కాదు, లాఠీ పోట్ల సంగతి తెలిసొచ్చిందా?

దేశ దేశాలలో కుస్తీలు పట్టడం బహుమతులు కొట్టడం అన్నవి భారత రాజ్యoతో తలబడటo కంటే పెద్ద విషయం కాదని ఇప్పటికైనా అర్థమైందా?

ఇక వినండి ఇదే మా సవాలు…
“హం దేఖేంగే! ఆప్ కే బేటియోoకో కైసె బచావోగే”
“మీ ఆడపిల్లల్ని మా నుండి మీరు ఎలా కాపాడుకుంటారో మేo చూస్తాం!”

ఫలశ్రుతి!
1. ఈ దేశానికి ప్రజాస్వామ్యం అచ్చి రాదని తన మరణం ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంత మొత్తుకున్నా వినకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం మనదేనంటూ ఐక్యరాజ్యసమితి మేడలెక్కి కూతలు కూయటం లేత సొరకాయ కోతలుగా మిగులుట!
2. “ప్రజాస్వామ్య యుగ పర్యవసానం రాచరికానికి నాందీ గీతం” అని
55 సంవత్సరాల క్రితమే రాసి నేటి అధికార మార్పిడి దృశ్యాన్ని, నాడే దర్శించగలిగిన తెలుగు వృద్ధ మహాకవికి నోబెల్ బహుమతి ఇప్పించటమొక అంతర్జాతీయ కర్తవ్యంగా స్వీకరించుట!!
3. సహేంద్ర తక్షకాయ స్వాహా అనే మంత్రంతో దేశమంతా ఉద్యమిస్తే తప్ప మల్ల యోధురాండ్ర గెలుపు సాధ్యపడక పోవచ్చు!!!

-చెరుకూరి జ్యోతి
(ప్రజాసాహితి )