Suryaa.co.in

Andhra Pradesh

పశుసంవర్ధక శాఖలో బదిలీల పంచాయితీ

– మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలు బేఖాతర్
– దగ్గరగా అడిగిన వారిని దూరం వేసిన వైచిత్రి
– అచ్చెన్నాయుడు వర్సెస్ దామోదర్‌నాయుడు
– హుటాహుటిన విజయవాడకు చేరిన మంత్రి అచ్చెన్న
– డైరక్టర్ చేసిన బదిలీలలు రద్దు?
– బదిలీల కోసం బారులు తీరిన ఆశావహులు

అమరావతి: ఉద్యోగుల బదిలీల వ్యవహారం చిత్రవిచిత్ర పరిస్థితి సృష్టిస్తోంది. కొన్ని శాఖల్లో మంత్రులు సీఎంఓను కూడా ఖాతరుచేయని పరిస్థితి. ‘‘సీఎంఓ చెబితే మేం బదిలీ చేయాలా? మేం సీఎంతోనే మాట్లాడుకుంటామ’’ని కొందరు మంత్రులు చెబుతున్నారు. ‘‘మేం లోకేష్‌తో మాట్లాడుకున్నాం. మీడియాలో వచ్చినా బేఫికర్’’ అని, మంత్రులు-ఎమ్మెల్యేల లేఖలను కూడా బేఖాతర్ చేసి, ఇష్టానుసారం బదిలీలు చేస్తున్న వైచిత్రి.పార్టీకి అండగా నిలిచిన అధికారులను కూడా కాసుల కోసం బదిలీ చేస్తున్న కక్కుర్తి. ఏసీబీ కేసులున్నా లెక్కచేయకుండా ముందస్తు ముడుపులు చెల్లించిన వారికి, కోరుకున్న చోట బదిలీ చేసిన పరిస్థితి. ఆ శాఖల ముచ్చట మరో కథనంలో ముచ్చటించుకుందాం.

ఇంకొందరు అధికారులు అసలు మంత్రులనే ఖాతరు చేయకుండా ఏకపక్షంగా బదిలీలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు పశుసంవర్ధక శాఖలో మంత్రి అచ్చెన్నాయుడు, డైరక్టర్ దామోదర్ నాయుడు మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో బదిలీల ప్రహసనం మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ శాఖ సంచాలకులు తన ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తూ గతరాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే ఆ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఆ బదిలీల ఉత్తర్వులకు బ్రేక్ వేశారని తెలిసింది. మంత్రి సిఫార్సు చేసినవారికి సుదూర ప్రాంతాలకు బదిలీ చేయగా దానిపై అమాత్యుల వారికి ఆగ్రహం కలిగించినట్టు తెలిసింది.

తన సామాజిక వర్గం వారినే విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాధాన్యతగల పోస్టుల్లో పశుసంవర్ధకశాఖ సంచాలకులు బదిలీ చేశారనే ఆరోపణలు వినిపించాయి. పైగా తన సిఫార్సులను సైతం సంచాలకులు పెడచెవిన పెట్టడంతో మంత్రి కోపం తలకెక్కింది. దాంతో ఆయన మంగళవారం ఉదయం హూటాహుటిన విజయవాడకు చేరుకుని సంబంధిత సంచాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.

ఫలితంగా గత రాత్రి జరిగిన బదిలీలను నిలుపుదల చేస్తున్నట్టు ఆ సంచాలకులు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈరోజు సాయంత్రం మళ్ళీ కొత్త బదిలీల జాబితాను సంచాలకులు తయారు చేస్తున్నట్టు తెలిసింది.

బదిలీల కోసం వచ్చేవారితో మంత్రి క్యాంపు కార్యాలయం కిటకిటలాడుతున్నది. వారందరు మంత్రిని కలసి మొరపెట్టుకుంటున్నారు. రెండురోజులు ఓపికపట్టండి.. అన్ని సర్దుకుంటాయంటూ మంత్రి బదులిస్తూ సముదాయిస్తున్నారని తెలిసింది.

LEAVE A RESPONSE