రోడ్డు ప్రమాదానికి గురై ఆకస్మిక మృతి చెందిన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే క్రియాశీలక సభ్యుడు కొల్పుల శ్రీనివాస్ మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో పలువురు ప్రముఖులు సందర్శించి నివాళి అర్పించారు. ప్రజా పాత్రికేయుడు శ్రీనివాస్ అమర్ రహే అంటూ పాత్రికేయుల నినాదాలు మారుమ్రోగాయి. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ జర్నలిస్ట్స్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నెల్లి సురేందర్, కే. మధుసూధన్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు వి.సత్యనారాయణ, పి.విజయనందరెడ్డి, జమీల్, బాల్ నర్సయ్య, జగన్ లతో పాటు ఆయా ప్రజా సంఘాలు, దళిత సంఘాల బాధ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
ప్రజా పాత్రికేయుడు శ్రీనివాస్
ప్రజా ఉద్యమాల నుండి పుట్టుకొచ్చిన ప్రజా పాత్రికేయుడు కొల్పుల శ్రీనివాస్ అని, అనేక పోరాటాల్లో క్రియాశీలకంగా భాగస్వామ్యమై అనేక సందర్భాల్లో ప్రజల పక్షపాతిగా నిలబడిన చరిత్ర శ్రీనివాస్ కు ఉందని టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ కొనియాడారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో శ్రీనివాస్ చురుకైన పాత్ర పోషించాడన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి తమ సంఘం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.