శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్ పై పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ గూండాల దాడి
– టీఆర్ఎస్ గూండాల దాడిలో ధ్వంసమైన బీజేపీ నేతల వాహనాలు
– సీఎం డైరెక్షన్ లోనే అడుగడుగునా అడ్డంకులు, దాడులు
చేష్టలుడిగిన పోలీస్ యంత్రాంగం
ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం
శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి రైతులను కలిసేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ తొలిరోజు పర్యటనను పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ గూండాలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రైతులతో మాట్లాడుతుండగా….అడ్డుకుని రైతులను భయభ్రాంతాలకు గురిచేసేందుకు యత్నించారు. పోలీసుల ఎదుటే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా అడుగడుగునా టీఆర్ఎస్ కిరాయి గూండాలు రాళ్లు, కోడిగుడ్ల దాడికి యత్నించారు. పోలీసుల సాక్షిగా బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడులకు తెగబడ్డారు.
ఈ దాడిలో బీజేపీ నాయకులకు చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ బండి సంజయ్ వెనుకాడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లా అర్జాలబావి కొనుగోలు కేంద్రం నుండి మొదలైన పర్యటన మిర్యాలగూడ, తిప్పర్తి, కుక్కడం, శెట్టిపాలెం, నేరేడుచర్ల దాకా వెళ్లిన చోట రైతులతో మాట్లాడారు. ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెళ్లిన చోటా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెడుతూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
నెల రోజుల నుండి ఐకేపీ సెంటర్ లోకి వడ్లు తీసుకొచ్చినా తూకం చేయడం లేదని రైతులు బండి సంజయ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఒకవైపు వర్షం పడుతూ ధాన్యం తడుస్తోందని, అయినా తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులు తమ గోసను వెళ్లబుచ్చుకుంటుండటంతో అసహనానికి గురైన టీఆర్ఎస్ నేతలు పలు చోట్ల గొడవకు యత్నించారు. రైతులపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లోనైన పోలీసులు వారిని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. పరిస్థితిని గమనించిన బీజేపీ కార్యకర్తలు రైతులను కాపాడేందుకు ప్రతిఘటించారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల వైఖరిపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం తన హక్కు,


బాధ్యతని అన్నారు. తాము రైతులను కలుస్తుంటే టీఆర్ఎస్ నాయకులకు ఎందుకింత అసహనం అని ప్రశ్నించారు. చివరకు రైతులు తమను బాధను చెప్పుకోకుండా బెదిరించడమేంటని, వారిపై దాడులకు యత్నిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాలకు రాకుండా రైతులను ఖాళీ చేయిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ బండారం బయటపడుతుందనే భయంతోనే దాడులకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన పేరుతో కొందరు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలతో వస్తే మేం భయపడతామా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే మీరు తట్టుకుంటారా? మీరు గ్రామాల్లో తిరగగలరా? అని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతులను కలిస్తే కూడా సీఎం కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని….సీఎం ఆదేశాల మేరకే అడుగడుగునా అడ్డంకులు స్రుష్టిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రత్యక్షంగా ఈ దాడుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అరాచకం స్రుష్టిస్తూ కార్లపైకి రాళ్లతో రువ్వి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లేనని హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం చేష్టలుడిగి చూడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఎదుర్కొలేని టీఆర్ఎస్ నాయకులు పోలీసుల పర్యవేక్షణలో చాటుమాటుగా బీజేపీ నాయకుల కాన్వాయ్ పై కిరాయి గూండాలతో దాడులు చేయించారని, ఈ దాడిలో 6 కార్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.
రాజ్యాంగ పదవిలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం కేసీఆర్ ఈ దాడులకు పురిగొల్పడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో తుఫాను గండం పొంచి ఉందని….తక్షణమే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసేందుకు తాను వచ్చానన్నారు. బెంగాల్ తరహాలో అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. సీఎం తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదని…. రైతులు పండించిన ప్రతి గింజ కొనే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.